Home ఛాంపియన్స్ ట్రోఫీ తల్ల’ఢిల్లీ’ంది

తల్ల’ఢిల్లీ’ంది

KKR-Vs-DD

ఐపిఎల్ పదో సీజన్‌లో గంభీర్ సేన కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయ పరంపర కొనసాగుతోంది. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 16.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ గౌతం గంభీర్ 71(నాటౌట్), రాబిన్ ఉతప్ప (59) చెలరేగడంతో కోల్‌కతా ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో గంభీర్ సేనకు ఇది ఏడో గెలుపు కావడం విశేషం. మరోవైపు ఢిల్లీకి ఏడు మాచుల్లో ఇది ఐదో ఓటమి. -కోల్‌కతా

ఉతప్ప, గంభీర్ జోరు.. సునాయస లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్(4)ను రబడా రెండో ఓవర్లోనే పెవిలియన్ పంపించాడు. అయితే భీకర ఫాంలో ఉన్న కెప్టెన్ గంభీర్, వికెట్ కీపర్ రాబిన్ ఉతప్పలు ధాటిగా ఆడడంతో కోల్‌కతా లక్షం దిశగా సాగింది. ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించారు. ఉతప్ప తన మార్క్ షాట్లతో అలరించాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరిచిన ఉతప్ప 33 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఐదు ఫోర్లతో 59 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గంభీర్‌తో కలిసి రెండో వికెట్‌కు 108 పరుగులు జోడించి విజయం ఖాయం చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన గంభీర్ 52 బంతుల్లోనే 11 బౌండరీలతో అజేయంగా 71 పరుగులు చేసి జట్టుకు భారీ విజయం అందించాడు. మిగతా వారిలో మనీష్ పాండే ఐదు పరుగులు చేయగా, జాక్సన్ 12 పరుగులతో (నాటౌట్)గా ఉన్నాడు. కాగా, గంభీర్‌కు మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు దక్కింది.
రాణించిన శాంసన్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డేవిల్స్‌కు ఓపెనర్లు సంజూ శాంసన్, కరుణ్ నాయర్ శుభారంభం అందించారు. వీరిద్దరూ కోల్‌కతా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. నాయర్ రక్షణాత్మకంగా ఆడగా శాంసన్ తన మార్క్ షాట్లతో చెలరేగాడు. చెత్త బంతులను వదిలేస్తూ గతితప్పిన వాటిని బౌండరీలు దాటించాడు. శాంసన్ ధాటిగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 48 పరుగులు జోడించారు. అయితే జాగ్రత్తగా ఆడుతున్న నాయర్ (15; 17 బంతుల్లో ౩x4)ను సునీల్ నరైన్ పెవిలియన్ పంపించాడు. కుదురుగా ఆడుతున్న నాయర్ ప్రత్యర్థి వేసిన చక్కని బంతికి వికెట్ల ముందు దొరికి పోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ప్రారంభం నుంచే ధాటిగా ఆడాడు. శాంసన్‌తో కలిసి స్కోరును పరిగెత్తించాడు. ఇద్దరూ వేగంగా ఆడడంతో ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పలేదు. అద్భుత ఫాంలో ఉన్న శాంసన్ ఈడెన్‌లోనూ ప్రకంపనలు సృష్టించాడు. ఒకవైపూ జాగ్రత్తగా ఆడుతూనే వీలు దొరికినప్పుడల్లా భారీ షాట్లతో అలరించాడు. అయితే 38 బంతుల్లో 4ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 పరుగులు చేసిన శాంసన్‌ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ పంపించాడు. దీంతో 75 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
నైల్ మ్యాజిక్..
మరోవైపు స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ (6) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. నాథన్ కౌల్టర్ నైల్ అద్భుత బంతితో రిషబ్‌ను ఎల్బీడబ్లూ చేశాడు. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్‌ను కూడా నైల్ వెనక్కి పంపాడు. ధాటిగా ఆడిన శ్రేయస్ 34 బంతుల్లోనే 4ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 పరుగులు చేశాడు. వరుస వికెట్లు పడడంతో ఢిల్లీ జోరు తగ్గింది. స్టార్ ఆల్‌రౌండర్ అండర్సన్ (2) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. చివర్లో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ ఆశించిన స్కోరు కంటే తక్కువ పరుగులే చేసింది. మోరిస్ (11) పరుగులు చేసి నైల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంకిత్ బావే(12) పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లలో నైల్ (౩/౩4) రాణించాడు. ఉమేశ్, నరైన్‌లకు చెరో వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు:
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్ : సంజూ శాంసన్ ఎల్బీడబ్లూ (బి( ఉమేశ్ యాదవ్) 60, కరుణ్ నాయర్ ఎల్బీడబ్లూ (బి) సునీల్ నరైన్ 15, శ్రేయస్ అయ్యర్ ఎల్బీడబ్లూ (బి) కౌల్టర్ నైల్ 47, రిషబ్ పంత్ ఎల్బీడబ్లూ (బి) కౌల్టర్ నైల్ 6, క్రిస్ మోరిస్ (సి) వోక్స్ (బి) కౌల్టర్ నైల్ 11, కోరే అండర్సన్ (రనౌట్) 2, అంకిత్‌బావే నాటౌట్ 12, పాట్ కమిన్స్ నాటౌట్ ౦, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం 2౦ ఓవర్లలో 160/6.
బౌలింగ్: నాథన్ కౌల్టర్ నైల్ 4-0-34-3, ఉమేశ్ యాదవ్ 4-0-38-1, క్రిస్ వోక్స్ 3-0-20-0, సునీల్ నరైన్ 4-0-25-1, కుల్దీప్ యాదవ్ 4-0-27-0, కోలిన్ డి గ్రాండోమ్ 1-0-15-0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : సునీల్ నరైన్ (బి) రబడా 4, గౌతం గంభీర్ నాటౌట్ 71, రాబిన్ ఉతప్ప (రనౌట్) 59, మనీష్ పాండే (బి) రబడా 5, షెల్డన్ జాక్సన్ నాటౌట్ 12, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం 16.2 ఓవర్లలో 161/3.
బౌలింగ్: జహీర్ ఖాన్ 1.1-0-8-0, రబడా 3.2-0-20-2, అండర్సన్ 2.5-0-27-0, మోరిస్ ౩-0-39-0, కమిన్స్ 3-0-22-0, అమిత్ మిశ్రా 3-0-36-0.