Home జాతీయ వార్తలు శిబిరాల నుంచి శిథిలాలకు…

శిబిరాల నుంచి శిథిలాలకు…

373 Dead In Kerala Floods Since May 30

తిరువనంతపురం: కేరళలో వరదలు తగ్గుముఖం పట్టడంతో సహాయక శిబిరాల్లో తలదాచుకున్న లక్షలాది మంది తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. అత్యవసర సర్వీసులు కూడా క్రమంంగా మొదలవుతున్నాయి. అయితే దాదాపు వందేళ్ల చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల వల్ల కలిగిన నష్టం మాత్రం మాటల్లో వర్ణించనంతగా ఉంది. ఎక్కడ చూసినా కూలిన ఇళ్లు, నీట మునిగిన పంటపొలాలు, చనిపోయిన మనుషులు, పశువుల అవశేషాలు కనిపిస్తున్నాయి. అలప్పుజ గిల్లాలోని చంగన్నూర్ సమీపంలో ఉన్న పండనాడ్‌లో చాలాప్రాంతాలు ఇప్పటికీ బురద, కుళ్లిన చెత్తాచెదారంతో నిండి ఉన్నాయి. వాటి మధ్‌యలోనే కుళ్లిపోయి కంపు కొడుతున్న జంంతువుల కళేబరాల దుర్వాసన భరించలేనంతగా ఉంది. మరో వైపు రోజుల తరబడి నీళ్లలో మునిగిపోయిన తమ ఇళ్లలో పాడయిపోకుండా మిగిలి ఉన్న సామాను, బట్టలు లాంటి వాటిని భద్ర పరచుకునే పనిలో జనం నిమగ్నమై ఉన్నారు. అయితే తాముఇళ్లకు తిరిగి వెళ్లే సరికి ఇళ్లలో తమకు పాములు లాంటి విషపురుగుల కనిపిస్తున్నాయని జనం వాపోతున్నారు. పరవూరులాంటి కొన్ని ప్రాంతాల్లో కొందరు పాముకాటుకు కూడా గురయ్యారు.

కేరళ ధాన్యాగారంగా పేరుపడ్డ కుట్టనాడ్ ప్రాంతం ఇప్పటికీ నీటిలో మునిగే ఉంది. ఎటు చూసినా పచ్చని వరి పొలాలతో కనువిందు చేసే ఈ ప్రాంతం ఇప్పుడు మరు భూమిని తలపిస్తోంది.‘ మేము ఎప్పుడూ నాణ్యమైన బియ్యాన్నే తినే వాళ్లం. అయితే సహాయక శిబిరాల్లో నాసిరకం బియ్యం తినాల్సి వస్తోంది. భగవంతుడు కూడా మమ్మల్ని వదిలేశాడేమోననిపిస్తోంది’అని నెడుమూడికి చెందిన కాత్యాయని అమ్మ అను వృద్ధురాలు వాపోయింది. సహాయక శిబిరాల్లో తలదాచునుంటున్న లక్షలాది మంది మాట కూడా ఇదే. సహాయక శిబిరాల్లోతలదాచుకుంటున్న దాదాపు పది లక్షల మందిలో లక్షమంది దాకా చిన్నారులు ముఖ్యంగా వీరిలో 15 ఏళ్లలోపు వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయి ఉంటారు కనుక వారికికౌన్సిలింగ్ అవసరమని మానసిక వైద్యులు అంటున్నారు. ఇక వరదల్లో దెబ్బతిన్న పాఠశాలలను చక్కదిద్ది తిరిగి తరగతులు ప్రారంభం కావడానికి, ఈ పిల్లలు తరగతులకు వెళ్లడానికి మరికొంత సమయం పట్టవచ్చు. వీరిలో చాలామంది పుస్త్తకాలు, ఇతర స్టడీ మెటీరియల్ వరదల్లో ధ్వంసమయినాయి కూడా.
కేరళలో ఇప్పటివరకు 373 మంది మృతి
గత మే 30న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటినుంచి ఇప్పటివరకు కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడ్డం కారణంగా మొత్తం 373 మంది చనిపోయినట్లు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఏ) మంగళవారం తెలిపింది. మరో 87 మంది గాయపడగా, 32 మంది జాడ తెలియలేదని కూడా తెలిపింది. భారీ ఎత్తున సంభవించిన వరదల్లో రాష్ట్రంలో 54.11 లక్షల మందికి పైగా నష్టపోయారని, 5,645 సహాయక శిబిరాల్లో 12.47లక్షల మంది తలదాచుకున్నారని కూడా ఎన్‌డిఎంఏ తెలిపింది. సహాయక చర్యల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ 59 బృందాలు, 207 బోట్లను రంగంలోకి దింపడా, ఆర్మీ 23 బృందాలు,104 బోట్లు, నేవీ 94 బృందాలను రంగంలోకి దింపాయి. ఇవే కాకుండా వైమానిక దళం, కోస్ట్‌గార్డు, బిఎస్‌ఎస్‌లు సైతం పెద్ద ఎత్తున హెలికాప్టర్లు, విమానాలు, సహాయక బృందాలతో రాష్ట్రంలో సహాయ, పునరావాస కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నాయి,
కోచ్చి ఎయిర్‌పోర్టుకు రూ.220 కోట్ల నష్టం
కేరళలో ఇటీవల సంభవించిన వరదల్లో కోచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి రూ.220 కోట్లకు పైగా నష్టం సంభవించిందని ఉన్నతాధికారి ఒకరు మంగళవారం చెప్పారు. పెరియార్ నది పోంగి పొర్లడంతో కూలిపోయిన 2.5 కిలోమీటర్ల విమానాశ్రయం గోడతో పాటుగా దెబ్బతిన్న నిర్మాణాల పునర్నిర్మాణం పనులను కోచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్(సిఐఎఎల్) ప్రారంభించిందని ఆ అధికారి చెప్పారు. వరద నీటిలో రన్‌వే, టాక్సీ బే, డ్యూటీఫ్రీ షాపులు, అంతర్జాతీయ, డొమెస్టిక్ టెర్మినల్స్‌కు చెందిన ఇతర ప్రాంతాలు కూడా మునిగిపోయాయని, ఫలితంగా రన్‌వే లైట్లతో పాటుగా ఎలక్ట్రికల్ పరికరాలు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సౌర విద్యుత్ విమానాశ్రయమైన ఈ ఎయిర్‌పోర్టుకు చెందిన సౌర విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బ తిన్నదని ఆయన చెప్పారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఎయిర్‌పోర్టు బిల్డింగ్‌ను శుభ్రం చేసే పనిలో దాదాపు 200 మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారని ఆ అధికారి తెలిపారు.