Home తాజా వార్తలు సౌదీ తీరం నుంచి స్వగ్రామానికి..

సౌదీ తీరం నుంచి స్వగ్రామానికి..

Telangana-Workers

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి కార్వ నిర్వాహక అధ్యక్షులు కెటిఆర్ చొరవతో 39 మంది తెలంగాణ కార్మికులు సోమవారం సౌదీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు గతేడాది సౌదీలో నిర్మాణరంగ సంస్థలో పనికోసం వెళ్లారు. అయితే ఆరు నెలలుగా వారికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా కంపెనీ పని చేయించుకోవడంతో పాటు సరైన, ఆహారాన్ని ఆ సంస్థ అందించలేకపోయింది. తిండికి, ఉపాధికి అనేక కష్టాలు పడుతున్న వీళ్లు, తమ సమస్యను ట్విట్టర్ ద్వారా కెటిఆర్ తెలి యజేశారు. వెంటనే స్పందించిన కెటిఆర్ కార్మికుల సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషిని కోరారు. దీంతోపాటు సౌదీలోని భారత రాయబార కార్యాలయం అధికారులకు కెటిఆర్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. దీనికి సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్పందించి, కార్మికుల సమాచారం ఆధారంగా వారిని గుర్తించి తెలంగాణకి పంపించేందుకు ఏర్పాట్లు చేసింది.

తమ వద్ద ఉన్న వర్క్ పర్మిట్ వీసా గడువు పూర్తవ్వడంతో భారత రాయబార కార్యాలయం వారికి తాత్కాలిక ఎగ్జిట్ వీసాలను ఇప్పించడంతో పాటు వీరికి విమాన టికెట్లను సమకూర్చి తెలంగాణకు పంపించింది. సౌదీ నుంచి తెలంగాణ కార్మికులు స్వరాష్ట్రానికి చేరుకోవడంపై కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయభార కార్యాలయంతో పాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబు కార్మికులను తెలంగాణ విమానాశ్రయంలో స్వాగతం పలికి వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేశారు. గతంలో ఇబ్బందులు పడుతూ పలువురు కార్మికులు కెటిఆర్‌కు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే స్పందించి వారికి ప్రభుత్వం తరఫున సాయం అందచేశారు.

39 Telangana workers reach Hyderabad from Saudi