Home స్కోర్ భారత్ హ్యాట్రిక్ విజయం

భారత్ హ్యాట్రిక్ విజయం

india4

 లంకకు మూడో ఓటమి

3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్

ముంబయి: శ్రీలంకతో జరిగిన ట్వంటీ20 సిరీస్‌ను టీమిండియా 30తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం ముంబయిలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ ఐదు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ మరో నాలుగు బంతులు మిగిలివుండగానే ఐదు వికెట్లకు 139 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కాగా, శ్రీలంకతో జరిగిన ఈ సిరీస్‌లో భారత్ మూడు ఫార్మాట్‌లలో కూడా విజేతగా నిలిచింది. టెస్టు సిరీస్‌ను 10తో, వన్డే సిరీస్‌ను 21తో భారత్ దక్కించుకుంది. తాజాగా టి20 సిరీస్‌ను కూడా వైట్‌వాష్ చేసింది. కాగా, ఈ సంవత్సరాన్ని భారత్ విజయంతో ముగించడం విశేషం. భారత క్రికెట్ చరిత్రలోనే 2017 అత్యంత విజయవంతమైన ఏడాదిగా చిరకాలం గుర్తుండి పోవడం ఖాయం.
ప్రారంభంలోనే…

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. తొలి రెండు మ్యాచుల్లో మెరుపు బ్యాటింగ్‌ను కనబరిచిన ఓపెనర్ లోకేస్ రాహుల్ ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. నాలుగు పరుగులు మాత్రమే చేసి చమీరా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 17 పరుగులు మాత్రమే. కొద్ది సేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వెనుదిరిగాడు. కిందటి మ్యాచ్‌లో విధ్వంసక సెంచరీతో చెలరేగిన రోహిత్ ఈసారి ఆ దూకుడును కనబరచలేక పోయాడు. 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి శనక బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
ఆదుకున్న అయ్యర్, పాండే…
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండేలు తమపై వేసుకున్నారు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. అయ్యర్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, మనీష అడపాదడపా బౌండరీలతో స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. వీరిద్దరూ నిలదొక్కుకోవడంతో భారత్ సునాయాసంగా విజయం సాధిస్తుందని కనిపించింది. కానీ, కుదురుగా ఆడుతున్న అయ్యర్ ఒక ఫోర్, సిక్స్‌తో 30 పరుగులు చేసి రనౌటయ్యాడు. దీంతో భారత్ 81 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆ వెంటనే హార్దిక్ పాండ్య (4) కూడా ఔటయ్యాడు. మరోవైపు దూకుడుగా ఆడుతున్న మనీష్ పాండే (32; 29 బంతుల్లో 4×4) కూడా వెనుదిరగడంతో భారత్ 108 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కాస్త ఇబ్బందుల్లో పడింది. కానీ తర్వాత వచ్చిన మహేంద్ర సింగ్ ధోనితో కలిసి దినేష్ కార్తీక్ మరో వికెట్ కోల్పోకుండానే భారత్‌ను గెలిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రెండు ఫోర్లతో 16, దినేష్ కార్తీక్ ఒక సిక్స్‌తో 18 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. దీంతో భారత్ 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.
ఉనద్కట్ మ్యాజిక్…
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంకను స్పీడ్‌స్టర్ జైదేవ్ ఉనద్కట్ హడలెత్తించాడు. అతను ప్రారంభంలోనే ఓపెనర్లు డిక్వెల్లా (1), ఉపుల్ తరంగ (11)లను పెవిలియన్ పంపించాడు. దీంతో లంక 14 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఆ వెంటనే కుశాల్ పెరీరా కూడా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్‌కు ఈ వికెట్ దక్కింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను సమరవిక్రమ, గుణరత్నె తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. వేగంగా ఆడిన సమరవిక్రమ 3 ఫోర్లతో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు గుణరత్నె 3 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. కాగా, గుణతిలక (3), తిసార పెరీరా (11) కూడా నిరాశ పరిచారు. కాగా చివర్లో శనక రెండు సిక్సర్లతో అజేయంగా 29 పరుగులు చేశాడు. ధనంజయ 11 (నాటౌట్) కూడా వేగంగా ఆడడంతో లంక స్కోరు 135కు చేరింది.

సమష్టి విజయమిది
సమష్టి పోరాటం వల్లే సిరీస్ గెలిచాం. అందివచ్చిన అవకాశాలను యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. ఈ విజయం ఎంతో సంతృప్తి ఇచ్చింది. కెప్టెన్‌గా రెండు సిరీస్‌లను గెలుచు కోవడం మరుపురాని అనుభూతిని ఇచ్చింది. తన కెరీర్‌లో ఈ సిరీస్ చిరకాలం గుర్తుండి పోతుంది. వన్డేల్లో, టి20లలో నిలకడగా రాణించడం ఆనందంగా ఉంది. రానున్న దక్షిణాఫ్రికాలో మరింగ మెరుగ్గా రాణించేందుకు ఈ విజయం దోహదం చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియా ఎంతో బలంగా మారింది. రిజర్వ్ బెంచ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఇది జట్టుకు ఎంతో ఊరటనిచ్చే విషయం. తుది జట్టులో స్థానం ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకర పోటీ నెలకొంది. ఒక్కసారి విఫలమైతే మళ్లీ జట్టులో స్థానం పొందడం కష్టంగా మారింది.
                                                                                                                                                                                             -రోహిత్ శర్మ

ఎంతో నేర్చుకున్నాం

సిరీస్‌లో తమ ఆట బాగానే సాగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోటీనే ఇచ్చాం. రెండో టి20లో కూడా భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించాం. ఈ మ్యాచ్‌లో బౌలర్లు బాగానే రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని సైతం నిలుపుకునేందుకు వీరు ఎంతో కష్టపడ్డారు. ఒకటి రెండు వికెట్లు పడి ఉంటే కచ్చితంగా ఫలితం తమకు అనుకూలంగా ఉండేది. రానున్న సిరీస్‌లలో మరింత మెరుగ్గా ఆడేందుకు యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నా. భారత్‌తో పోల్చితే తాము చాల బలహీనంగా ఉన్న విషయం వాస్తవమే. ఈ ఓటమిని ఇంతటి వదిలేస్తాం. రానున్న ముక్కోణపు సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతామని లంక కెప్టెన్ తిసార పెరీరా పేర్కొన్నాడు.

                                                                                                                                                                                  -తిసార పెరీరా