Home Default కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఉక్కపోత… నలుగురు మృతి

కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఉక్కపోత… నలుగురు మృతి

 

కాన్పూర్: రెండు వారాలుగా వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉత్తరాది అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఆగ్రానుంచి తమిళనాడుకు కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులుఝాన్సీ రైల్వే స్టేషన్ సమీపంలో తీవ్రమైన ఉష్ణ తాపం కారణంగా చనిపోయారు. వడదెబ్బ కారణంగానే వారు చనిపోయినట్లు ఝాన్సీలో రైల్వే ప్రతినిధి మనోజ్ కుమార్ సింగ్ చెప్పారు. వీరంతా కూడా తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన వారని, మృతులను బాలకృష్ణ రామస్వామి(70), పి కమల(76), సుబ్బరాయయ్య(80), దివా నాయిగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. పోస్టుమార్టం అనంతరం వారి మృతదేహాలను మంగళవారం వారి కుటుంబ సభ్యులను అప్పగిస్తారని ఆయన తెలిపారు.

సోమవారం బాధితులు ప్రయాణిస్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఝాన్సీ స్టేషన్ చేరుకుంటుండగా ప్రయాణికుల్లో ఒకరు స్పృహతప్పిపోయినట్లు రైల్వే టిటిఇ తమకు సమాచారం అందించారని, తాము వైద్య సిబ్బందితో రైల్వే స్టేషన్‌కు చేరుకోగా, ముగ్గురు ప్రయాణికులు అప్పటికే చనిపోయారని, నాలుగో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందారని ఆయన చెప్పారు. కాగా ఝాన్సీలో ఇటీవలి కాలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైనాయని అధికారులు చెప్తున్నారు. కాగా, ఆగ్రా దాటిన వెంటనే ఎండ వేడిని భరించలేకపోయామని, కొందరికి శ్వాస సమస్యలు కూడా తలెత్తాయని రైల్లో ప్రయాణించిన పలువురు ప్రయాణికులు చెప్పారు.

4 passengers died with heat stroke in kerala express