Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

40 ఎలెక్ట్రిక్ బస్సులు

40 electric buses to hit Hyderabad roads

మన తెలంగాణ / హైదరాబాద్ : కాలుష్య రహిత  తెలంగాణ లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ఇఆటోలను వినియోగిస్తున్న ప్రభుత్వం తాజాగా టిఎస్ ఆర్‌టిసి సంస్థలోకి 100 ఎసి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తోంది. తొలి విడతగా 40 బస్సులు, ఆ తర్వాత మరో విడతలో 60 ఎసి ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చేలా నిర్ణయించింది. ముందస్తు ఎన్నికల హడావిడి నేపథ్యం లో రవాణా శాఖమంత్రి మహేందర్ రెడ్డి, ఆర్‌టిసి సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తదితరులు బిజీబిజీగా ఉండడంతో ఈ బస్సులను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా బుధవారం సచివాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాలుష్య రహిత వాహనాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం సంతోషకరమన్నారు. ప్రస్తుతం40 ఎసి ఎలక్ట్రిక్ బస్సులు సంస్థలో ప్రవేశ పెడుతున్నామని, మరో 60 బస్సులు త్వరలోనే వస్తాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నుండి శంషాబాద్ వరకు ముందుగా ఈ బస్సులను నడిపించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాలుష్య రహిత ఈ బస్సులు ప్రయాణంలోనూ ఎలాంటి శబ్దం లేకుండా ప్రయాణం చేస్తుందన్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను భారత్‌లోనే ఎలక్ట్రా గ్రీన్ టెక్ తయారు చేయగా, ఈ బస్సులకు ఛార్జింగ్ బ్యాటరీలను బివైడి కంపెనీ రూపొందించిందన్నారు. డ్రైవర్‌తో కలిపి 40 మంది సీటింగ్ కెపాసిటి గల ఈ ఎసి ఎలక్ట్రిక్ బస్సు ఒక సారి ఛార్జింగ్ చేస్తే 250 కి.మీ దూరం ప్రయాణించనుందని, ఛార్జింగ్ చేసేందుకు ఒక్కో బస్సుకు నాల్గు నుండి ఐదు గంటల సమయం తీసుకుంటుందని ఎలక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. లో ఫ్లోర్‌తో ఉండే ఈ ఏసి బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటుందన్నారు.
త్వరలో మరో 1000 ఇ – బస్సులు : కెటిఆర్
ఆర్‌టిసిలోకి మరో 1000 ఏసి ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్‌టిసి బస్సుల స్థానంలో అవసరం మేరకు మరో వెయ్యి బస్సులను రవాణా శాఖ రీప్లేస్ చేసుకోవాలని కోరినట్లు కెటిఆర్ ట్విట్ చేశారు.

Comments

comments