Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

బ్యాగు బాంబు కలకలం

bag-bomb-image

స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఐదు కేజీల కుక్కర్ బాంబును నిర్వీర్యం చేసిన బాంబు స్వాడ్

మన తెలంగాణ/చర్ల : స్థానిక బస్టాండ్ వద్ద శుక్రవారం ఉదయం బ్యాగ్ బాంబు ఉదంతం కలకలం సృష్టించింది. ఉదయం 9 గం. ప్రాంతంలో బస్టాండ్ అవుట్ గేటు వద్ద ఓ అగంతకుడు బ్యాగును వదిలి పరుగెత్తినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో సిఐ సత్యనారాయణ, ఎస్సై రాజు వర్మ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాగును పరిశీలించగా అందులో కుక్కర్, వైర్లు కనిపిస్తుండటంతో పోలీసులు బాంబు స్వాడ్‌ను పిలిపించారు. బ్యాగు ఉన్న ప్రాంతం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను దగ్గరకు రానివ్వకుండా అప్రమత్తం చేశారు. సుమారు ఆరు గంటల ఉత్కంఠత తర్వాత కొత్తగూడెం నుండి బాంబు డిస్పోజల్ స్కాడ్ వచ్చి బ్యాగ్‌ను సమీపంలోని పంట పొలాల్లోనికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. బ్యాగులో సుమారు 5 కేజీలబరువైన కుక్కర్ బాంబు ఉండటంతో దానిని అత్యంత చాకచక్యం పేల్చివేశారు. చర్ల ప్రాంతంలో మొదటి సారిగా జన సంచారం అంధికంగా ఉండే బస్డాండ్ అవుట్ గేటు వద్ద బ్యాగు బాంబును వదిలేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇది ఖచ్చితంగా మావోయిస్టుల దుశ్చర్యే అని పోలీసులు తెలుపుతున్నారు. ఉదయం సుమారు 9 గం. ప్రాంతంలో పోలీస్ పార్టీలు బస్టాండ్ వద్ద ఉండటంతో పోలీసులను చూసిన అగంతకుడు బ్యాగును వదిలేసి పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 5 కేజీల కుక్కర్ బాంబును విధ్వంసం సృష్టించడం కోసమే మావోయిస్టులు తీసుకెళుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాగ్ బాంబు కలకలం రేగడంతో బస్టాండ్ ప్రాంతానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై రాజు వర్మ భద్రతా చర్యలు చేపట్టారు.
ఆంధ్రాబ్యాంకు ముందు చెట్టుకు మరో బ్యాగు
స్థానిక ఆంధ్రాబ్యాంకు ముందు ఉన్న చెట్టుకు మరో బ్యాగు వేలాడుతుండటంతో పోలీసులు హైరానా పడ్డారు. ఆ బ్యాంగును బాంబు స్కాడ్ సహాయంతో సమీపంలో ఉన్న చెరువు పొలం వద్దకు తీకుకెళ్లి పరిశీలిచంగా అందులో ఏమీ లభ్య కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Comments

comments