Home తాజా వార్తలు సర్కార్ డాక్టర్ల నిర్లక్ష్యం: బాలుడి మృతి

సర్కార్ డాక్టర్ల నిర్లక్ష్యం: బాలుడి మృతి

5 Yr Old Kid Dies of Snake Bite in Medak district
మెదక్ టౌన్ : ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని పాపన్నపేటకు చెందిన తార్పటి నర్సింలు, భార్య సంతోషినీలు కన్నీరుమున్నీరయ్యారు. సర్కార్ దవఖానాలో పేదోల్లకు నాణ్యమైన వైద్యం అందుతుందని అంటున్నారు కానీ అది మాలాంటి పేదోల్లకు అందడం లేదని తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే… పాపన్నపేట గ్రామానికి చెందిన నర్సింలు, సంతోషినీలకు ఇద్దరు సంతానం. సోమవారం అర్థరాత్రి పాముకాటుకు గురైన తన కుమారుడు హరిప్రసాద్(5)ను స్థానికంగా వైద్యులకు చూపించగా వెంటనే జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో హుటాహుటినా జిల్లా సర్కార్ ఆసుపత్రికి తన కుమారున్ని తీసుకురాగా అక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం తో ఇక్కడ డాక్టర్లు చూడరంటూ ఒక ప్రైవేటు ఆసుపత్రి పేరును సూచిస్తూ అక్కడికి వెళ్లమని ఉచిత సలహాలిచ్చారు. కానీ ఆ సమయంలో ఇద్దరు డ్యూటీ డాక్టర్లు ఆసుపత్రిలో ఉన్నప్పటికీ బాబును చూడలేకపోవడం వల్లనే తన బాబు మరణించాడని వారు తీవ్ర ఆవేదన చెందారు.

పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగగా తన కుమారునికి పాముకాటుకు సంబంధించిన మందులు అందుబాటులో లేవని, వెంటనే సర్కారు దవఖానాకు వెళ్లాలని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు తెలుపడంతో చివరకు మళ్లీ సర్కార్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇదంతా జరుగడానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. అప్పటికే పాముకాటుకు గురైన హరిప్రసాద్ దేహమంతా విషపూరితం కావడంతో సర్కార్ ఆసుపత్రిలోనే మరణించాడు. సకాలంలో సర్కార్ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పాటు వైద్య సిబ్బంది కూడా పూర్తి నిర్లక్ష్యం పాటించడం వల్లే హరిప్రసాద్ మృత్యువాత పడ్డాడని తల్లిదండ్రులు కుమారుని మృతదేహంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సిఐటియు నాయకులు బాధితులకు అండగా నిలిచి వారి పక్షాన ఆందోళన చేపట్టారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయి గుండెలదిరేలా రోదించారు. తమ బాబు ప్రాణాలు బలికొన్న సర్కారు ధవఖాన డాక్టర్లు, సిబ్బంది తమకు న్యాయం చేసేంత వరకు కదిలిదిలేదని ఆసుపత్రి ఎదుట కూర్చున్నారు. దీంతో ఆసుపత్రి సూపరిండెంట్ పి. చంద్రశేఖర్ బాధిత కుటుంబాన్ని సముదాయిస్తూ రాత్రి డ్యూటిలో ఉన్న సిబ్బందిని బాధ్యులుగా చేస్తూ వెంటనే వారిపై సస్పెన్షన్ వేటు వేసి బాధిత కుటుంబంలోని తల్లిదండ్రులిద్దరికి కాంట్రాక్టు కార్మికులుగా ఆసుపత్రిలో అవకాశం కల్పిస్తానని హామీనివ్వడంతో వారు ఆందోళన విరమింపజేశారు.
సర్కార్ కోట్లు ఖర్చుపెట్టి పేదవాళ్లకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్నో సదుపాయాలను సమకూర్చుతున్నప్పటికీ డాక్టర్ల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారుతుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థ కొనసాగుతుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇకనైనా సిబ్బంది వైఖరిలో మార్పువచ్చి రోగుల పట్ల స్నేహపూర్వకంగా నడుచుకోవడమే కాకుండా కనీసం ఉన్న కొంత మంది డాక్టర్లైనా సరైన సమయ పాలన పాటించి పేదవారికి సకాలంలో మెరుగైన వైద్యసేలందించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.