Home స్కోర్ చివరిదైనా  చిక్కేనా?

చివరిదైనా  చిక్కేనా?

india-teamనేడు భారత్, ఆస్ట్రేలియా ఐదోవన్డే
ధోనీసేనకు పొంచివున్న క్లీన్‌స్వీప్ ప్రమాదం
సిడ్నీ : గెలవాల్సిన మ్యాచ్‌ల్లో చేజేతులా ఓడిన టీమిండియా వన్డే సిరీస్‌లో చివరి పోరాటానికి సిద్ధమైంది. భారీస్కోరు నమోదుచేసినా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ధోనీసేన ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయకుండా అడ్డుకోవడంతో పాటు మూడు టీ-20ల సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడుగట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు సొంతగడ్డపై వరుసగా 18 విజయాలు నమోదుచేసిన ఆస్ట్రేలియా చివరి వన్డేలోనూ టీమిండియా చిత్తుచేసి సొంతగడ్డపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది.
సమష్టిగా రాణిస్తేనే.. : తొలి మూడువన్డేల్లో బ్యాట్స్‌మెన్ 300పై చిలుకు పరుగులు చేసినా.. బౌలర్లు చేతులెత్తేయడంతో టీమిండియా ఓటమి చూసింది. నాల్గోవన్డేలో టాపార్డర్ బ్యాట్స్‌మెన్ విజయానికి బాటలు పరిచినా.. లోయర్డార్ బ్యాట్స్‌మెన్ బ్యాట్లెత్తేయడంతో పరాజయం ఎదు రైంది. కనీసం పరువు కోసం పోరాడుతున్న చివరి, ఐదో వన్డేలోనైనా టీమిండియా గత తప్పిదాలను సరిచేసుకోని సమష్టిగా రాణిస్తేనే క్లీన్‌స్వీప్ ప్రమా దం తప్పే అవకాశం ఉంది. బ్యాటింగ్ పరంగా భారత్‌కు పెద్దగా సమస్యలేమీ కనిపించడం లేదు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ శిఖర్‌ధావన్, రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉన్నారు. అయితే ఫామ్ బ్యాట్స్‌మన్ రహానె గాయంతో మ్యాచ్‌కు దూరం కావడం భారత్‌కు ఎదురుదెబ్బే. జట్టు అవసరానికి తగ్గట్లు బ్యాటింగ్ చేస్తూ నాల్గోస్థానంలో రహానె చక్కగా కుదురుకున్నాడు. చివరి వన్డేలో రహానె స్థానంలో మనీశ్‌పాండే ఆడనున్నాడు. ఇక ఫామ్‌లో లేని ధోనీ కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్‌రౌం డర్‌గా చోటు దక్కించుకున్న గుర్‌కీరత్‌మన్ తన స్థానానికి న్యాయం చేయలేకపోయినా అతనికి మరో అవకాశం దక్కనుంది. ఇక బౌలింగ్ స్పిన్నర్ అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకా శం కనిపిస్తోంది. మెల్‌బోర్న్, కాన్‌బెర్రా వన్డేల్లో నిరాశపర్చిన పేస్ ఆల్‌రౌండర్ రిషి ధావన్ స్థానం లో అశ్విన్ తుదిజట్టుకు ఎంపిక కాను న్నాడు. జడేజా, ఇశాంత్, ఉమేశ్ తుది జట్టులో ఆడడం ఖాయం కాగా, భువనేశ్వర్ స్థానం లో అక్షర్‌పటేల్, బరిందర్‌లలో ఒకరు బరిలోకి దిగవచ్చు.
క్లీన్‌స్వీప్‌పై ఆసీస్ కన్ను : తమ గడ్డపై తొలిసారి టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్షంగా బరిలోకి దిగుతోంది. టీమిండియా మాదిరే ఆస్ట్రేలి యానూ బౌలర్ల నిరాశజనక ప్రదర్శన భయపె డుతోంది. బ్యాట్స్‌మెన్ సత్తాచాటడంతో తృటిలో ఓటమి ప్రమాదం నుంచి బయట పడుతున్న స్మిత్‌సేన బౌలర్ల నుంచి మరింత మంచి ప్రదర్శన ఆశిస్తోంది. ఇక లోయర్డార్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడే మ్యాక్స్‌వెల్ మ్యాచ్‌లో ఆడడం అనుమానంగా మారింది. నాల్గోవన్డేలో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన మ్యాక్స్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని టీమ్‌మేనేజ్‌మెట్ స్పష్టం చేసింది. మ్యాక్స్ ఆడకపోతే అతని స్థానంలో పేసర్ బొలాండ్, షాన్‌మార్ష్‌లలో ఒకరిని ఆడించనున్నారు.