Home తాజా వార్తలు 6 రోజుల పసికందు అపహరణ

6 రోజుల పసికందు అపహరణ

kidnap

హైదరాబాద్ సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో టీకా వేయిస్తానని చెప్పి ఎత్తుకెళ్లిన మహిళ
అగంతుకురాలి కోసం 8 పోలీసు బృందాల గాలింపు

మన తెలంగాణ/ హైదరాబాద్/ గోషామహల్: హైదరాబాద్ నగరంలోని సుల్తాన్‌బజార్ ప్రభు త్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆరు రోజుల క్రితం జన్మించిన నవజాత శిశువును ఓ గుర్తు తెలియ ని అగంతకురాలు అపహరించిన ఘటన సోమవారం కలకలం సృష్టించింది. టీకా వేయిస్తానని చెప్పి తల్లి దగ్గరి నుంచి శిశువును తీసుకుని పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నా రు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం…రంగారెడ్డి జిల్లా ఎల్లమ్మ తండాకు చెందిన ఎస్. విజయ (25) నరి దంపతులు. వీరికి 8 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఐదేళ్ల ఆనంద్ వీరి మొదటి సంతానం. రెండోసారి విజయ గర్భం దాల్చడంతో ప్రతి నెలా సుల్తాన్‌బజార్ ఆసుపత్రికి వచ్చి చెకప్ చేయించుకు ంటుంది.  ఈ క్రమంలో విజయకు నెలలు నిండటంతో గత నెల 21న సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వైద్యురాలిని సంప్రదించగా ఆమెను పరీక్షించిన పలు పరీక్ష లు నిర్వహించిన వైద్యులు రక్తం తక్కువగా ఉన్నట్లు గుర్తించి, ఆమెను అడ్మిట్ చేసుకుని ఎప్పటికప్పుడు విజయ ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తు రక్తం పెరిగేందుకు అవసరమైన మందులు ఇస్తున్నారు. ఈ నేఫథ్యంలో గత నెల 27న విజయకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రి వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి ప్రసవం చేశారు. ఈ ప్రసవంలో విజయ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. సోమవారం ఉదయం సుమారు 11:15 గంటల సమయంలో విజయ వద్ద సహాయకులుగా ఉన్న భర్త నరి, తల్లి చాందీలు కిందకు వెళ్లారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే సుమారు 35 సంవత్సరాల వయస్సు గల ఓ గుర్తుతెలియని మహిళ ఆ వార్డులోకి వచ్చి విజయ వద్ద సహాయకులు ఎవ్వరూ లేని విషయం ప సిగట్టింది. విజయ బెడ్ వద్దకు వెళ్లి మీ పాపకు వారం టీకాలు ఇప్పించారా అని అడిగింది. దీంతో విజయ తనకు ఆ విషయం తెలియదని, శిశువుకు ఎలాంటి టీకాలు ఇప్పించలేదని చెప్పింది. కింద వైద్యుడి గదిలో శిశువులకు వారం టీకాలు ఇస్తున్నారని, మీ పాపకు నేను టీకాలు ఇప్పించుకుని వస్తానని నమ్మబలికింది.  నీ కేస్‌షీట్ ఇవ్వు దీని ద్వారా మీ పాపను కింద వైద్యుడి గదికి తీసుకువెళ్లి టీకాలు వేయించి తీసుకొస్తానని చెప్పి విజయ వద్ద నుండి పాపతో పాటు కేస్‌షీట్‌ను తీసుకుని వార్డు నుండి బయటకు వెళ్లింది. కొద్ది సేపటికే వార్డుకు వద్దకు వచ్చిన భర్త నరి, తల్లి చాంలీలు పాప ఏదని విజయను ప్రశ్నించగా ఓ మహిళ వచ్చి టీకా వేయిస్తానని తీసుకెళ్లిందని చెప్పడంతో వారు వార్డులోనే నిరీక్షిస్తూ కూర్చున్నారు. పాపను తీసుకెళ్లిన మహిళ ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన శిశువు తండ్రి నరి కిందకు వైద్యులను సంప్రదించగా అక్కడికి పాపను తీసుకుని ఎవరూ రాలేదని తెసుకుకుని ఆందోళనకు గురయ్యాడు. వెంటనే విజయ తల్లితో కలిసి ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో తమ పాప అపహరణకు గురైందని గ్రహించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆసుపత్రిలోని రోగుల సహాయకుల సూచనలతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్, ఎస్‌ఐలు. సిబ్బంది హుటాహుటిన ప్రసూతి ఆసుపత్రికి చేరుకుని శిశువు తల్లిదండ్రులను సంప్రదించి శిశువు అపహరణకు సంబంధించిన విషయాలను అడిగి తెసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ ఎసిపి ఎం చేతన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 3 గంటల వరకు పోలీసులు ఆసు పత్రిలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి శిశువును అపహరించిన మహిళ  నీలి రంగు చీర ధరించిందని, ఆమె వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రావు తెలిపారు. శిశువును ఒడిలో పెట్టుకుని వరండాలోకి వెళ్తున్న దృశ్యాలను అన్ని పోలీస్‌స్టేషన్‌లకు పంపినట్లు వెల్లడించారు. నిందితురాలిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.