Home భద్రాద్రి కొత్తగూడెం కాలం చెల్లిన ప్రయాణం

కాలం చెల్లిన ప్రయాణం

60 శాతానికిపైగా పనికిరాని ఆర్‌టిసి బస్సులు
ప్రమాదాలకు గురవుతున్న వాహనాలు
ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రయాణికులు
రాలిపోయే లైట్లు, పగిలి పోయిన విండో గ్లాసులు
కార్మికులను బాధ్యులగా చేస్తూ రికవరీ పేరుతో జీతం కట్
ఇష్టానుసారంగా డ్యూటీలు వేస్తున్న డిఎంలు
పనిభారంతో నలిగిపోతున్న సిబ్బంది
డిపోలలో వింతపోకడలు

Bus1భద్రాచలం: ఆర్‌టిసిలో ప్రయాణం సురక్షితం, శుభ ప్రధం… ఇదోకప్పటి మాట…కానీ ఇప్పుడు ఆర్‌టిసిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరిచేతులో పెట్టుకోవాల్సిందే… లాభార్జనే ధేయ్యంగా కాలం చెల్లిన బస్సులను తిప్పుతూ సంస్థకు ప్రధాన ఆధారమైన ప్రయాణికులను, మనుగడకు
మూలమైన కార్మికుల భద్రతను గానీ పట్టించుకోవడం లేదనేది నిస్పష్టం. జిల్లా వ్యాప్తంగా ఉన్న డిపోల్లో 60 శాతానికి పైగా బస్సులు మైలేజీ పూర్తి అయి తిరిగేందుకు పనికి రానివే ఉన్నట్లు తెలుస్తోంది. ఏటా ఆర్‌టిసి చార్జీలను వడ్డిస్తున్న సంస్థ ప్రయాణికుల భద్రతను పట్టించు కోవడం లేదు.  వెరసి కాలం చెల్లిన బస్సుల్లో ప్రయాణం సాగిస్తూ జీవితాల మీదకు తెచ్చుకోవాల్సిన పరస్థితి ఏర్పడుతోంది.

క్షణ క్షణం గండమే..

భద్రాద్రి జిల్లాల్లో కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలంలలో ఆర్‌టిసి డిపోలు ఉన్నాయి. ఈ మూడు డిపోల పరిధిలో మోత్తంగా సుమారు 274 బస్సులు తిరుగుతుండగా వాటిలో 71 బస్సులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన తిప్పుతున్నారు. కొత్తగూడెం డిపో పరిధిలో 92 బస్సులు తిరుగుతున్నాయి.
ఇందులో 69 సంస్థలకు చెందిన బస్సులుండగా 23 బస్సులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నడిపిస్తున్నారు. మణుగూరు డిపోలో 84 బస్సులకు గానూ 63 సంస్థవి, 21అద్దెవి, భద్రాచలం డిపోలో 98 బస్సులకు గానూ 71సంస్థ బస్సులు కాగా, 27 ప్రైవేటు బస్సులనుతిప్పుతున్నారు.

అయితే వీటిలో రోడ్ల మీద తిరిగేందుకు పనికిరానివి సగానికిపైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో బస్సు సుమారుగా 12 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే 16 లక్షల కిలోమీటర్లు పైబడే ఉన్నట్లు సంస్థకు చెందిన వారే బాహాటంగా చెబుతున్నారు. ఆ బస్సులకు కొద్దిపాటి మరమ్మతులు చేసి రోడ్లమీదికి పంపుతుంటే వాటిని తోలలేక డ్రైవర్లు అగచాట్లు పడుతున్నారు. దీనికితోడు మైలేజీ రావడం లేదని యాజమాన్యం వేధిస్తున్నట్లు అనుమానాలువ్యక్తం అవుతున్నాయి.

కొన్ని బస్సుల్లో టివిలు ఉండవు అయినా సంస్థ ప్రయాణికుల వద్ద చార్జీ వసూలు చేస్తోంది. పూర్తిగా అరిగిపోయిన టైర్లతో బస్సులను డ్రైవర్లకు ఇవ్వడం వల్ల అవి ఎక్కడైనా ఫెయిల్ అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణానికి ఉపయోగపడని బస్సులు తిరగడం వల్ల హాఠాత్తుగా ప్రమాదాలకు గురువు తున్నాయి. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. తద్వారా వాటి కుటుం బాలు వీధిన పడుతున్నాయి. సంస్థకు చెందిన సిబ్బంది ప్రమాదంలో మృతి చెందితే కంటితుడుపు చర్యగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

డబడబా శబ్దాలు…

ఆర్టీసికి చెందిన ఏ బస్సు ఎక్కినా బడబడా శబ్దాలతో కర్ణకఠోరంగా మారుతున్నాయి. బస్సు ఎక్కింది మోదలు ఎప్పుడు దిగుతామా అని ప్రయాణిలు వేచి చూడాల్సిన పరిస్థితి. ఓ ప్రక్క బస్సుకు చెందిన లైట్లు, డేంజర్ బల్బులు ఊడి పడుతుంటాయి. మరో ప్రక్క విండో గ్లాసులు లేక చలి గాలికి ప్రయాణికులు పాట్లు పడుతుంటారు. విండోగ్లాసులు ఏర్పాటు చేయకుండా రోగులతో ఆ విండోని మూసేస్తున్నారు. బస్సు కొన్న సమయంలో ఉన్న ముందు అద్దాలు పగిలిపోతున్నాయి. ఎప్పుడో కొన్న బస్సులు అవడంతో బస్సు గోతిలో పడితే చాలు ఒక్కసారిగా ముందు అద్దం ముక్కులు ముక్కలుగా పగిలిపోతుంది. దీనికి డ్రైవర్‌ను బాధ్యులుగా చేస్తూ రికవరీ పెడుతూ జీతంలో కోత విధిస్తున్నారు. చిన్న మిర్రర్ పోయిన, విండో గ్లాస్ పగిలినా, డేంజర్ లైట్ పగిలిపోయిన దానికి బాధ్యత డ్రైవర్‌దే అంటూ యాజమాన్యం ముక్కుపిండి వసూళ్లు చేస్తోంది.

ఇష్టానుసారంగా…

డిపో మేనేజర్లు కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల డ్యూటీని ఒక్కరోజుకు కుదిరింది. రెండు గంటల ఓటి తమ ముఖాన పడేసి లాభాల కోసం సిబ్బందిని వేధిస్తున్నట్లు బాహాటంగానే చర్చ సాగుతోంది. ఉదాహరణకు భద్రాచలం నుండి రాజమండ్రికి రోజుకు సుమారు 9 బస్సులు తిప్పుతున్నారు. కార్మికుల చట్టాల ప్రకారం ప్రతీ కార్మికునితో 8 గంటల మించి పనిచేయించరాదు. తప్పని సరి పరిస్థితుల్లో చేయించాల్సి వస్తే ఓవర్ డ్యూటీ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంటోంది. భద్రాచలం నుండి రాజమండ్రి పోయి రావడానికి ప్రస్తుతం 12 నుంచి 14 గంటలు పడుతోంది. ఈ రోడ్డు డ్యూటీకి వెళ్లిన వారు మరుసటి రోజు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడి డిపో మేనేజర్ హయర్ విత్ బస్సులు తిరిగినట్లే సంస్థ బస్సులను కూడా తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీంతో కార్మికులు తీవ్ర అలసటకు గురై అనారోగ్యాల పాలవుతున్నారు. మరో పక్క రెండురోజుల డ్యూటీని ఒక్కరోజుకు కుదించడం వల్ల కొందరు కార్మికులకు డ్యూటీలు లేక ఇళ్ల వద్దే ఉండిపోతున్నారు. వారిని సెలవుగా పరిగణిస్తున్న సంస్థ కార్మికులను నయానో భయానో ఒప్పించి నిర్ణయం తీసుకుంటోంది. కాగా బుధవారం ఆర్‌టిసి డిపో నుండి రాజమండ్రికి వెళుతున్న రెండు హయిర్ విత్ బస్సులను కార్మికులు అడ్డుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆపేసిన బస్సులు సాయంత్ర 4 గంటల వరకూ కూడా డిపోలోనే ఉన్నాయి. మరో పక్క భద్రాచలం నుంచి రాజమండ్రికి సుమారు 198 కిలోమీటరు ఉండగ సంస్థ మాత్రం 160 నుంచి 170 వరకూ మాత్రమే లెక్కకడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతీ ట్రిప్‌కు 20 కిలోమీటర్లు తగ్గించడం వల్ల బస్సు పూర్తి కాలపు మైలేజీలో తేడా కనిపించేలా చేసి కాలం చెల్లినప్పటికీ రోడ్లుమీద తిప్పేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది. ఆర్డిసి డిపోల్లో చేటుచేసుకుంటున్న వింత పోకడల వల్ల కార్మికులు నలిగిపోవడంతో పాటు అనారోగ్యల పాలవుతున్నట్లు తెలుస్తోంది