Home లైఫ్ స్టైల్ 64 కళలు.. 64 సేవలు

64 కళలు.. 64 సేవలు

కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ వైపు లండన్ థీమ్ మండపం.  మరో వైపు బంగారంతో తయారైన అమ్మవారి చీర ప్రత్యేక ఆకర్షణగానిలిచాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పౌల్‌చే 22 కిలోల బంగారంతో చీరను డిజైన చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. పువ్వులు, పక్షులు, సీతాకోక చిలుకలు, నెమళ్ల బొమ్మలతో ఈ చీరకు ఎంబ్రాయిడరీ చేశారు. 

Durga-Mata-Idol

దుర్గామాత ఉపచార ప్రియ. ఆమెకు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉంటారు. ఆ దివ్యోపచారాలను ఆదిశంకరాచార్య ఒక స్తోత్రంలో ఇమిడ్చి మనకు అందించారు. దసరా పండగ సందర్భంగా జరిగే అమ్మవారి పూజల్లోని పరమార్థాన్ని తెలుసుకుందాం.

 1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం : అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, తాగుటకు జలము సమర్పించడం
 2. ఆభరణ అవరోపణం : ముందురోజు ఆభరాణాలు తీయడం
 3. సుగంధ తైలాభ్యంజనం : ఒంటికి నూనె పట్టించడం
 4. మజ్జనశాలా ప్రవేశం : స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
 5. మణిపీఠోపవేశనం : మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోబెట్టడం
 6. దివ్యస్నానీయ ఉద్వర్తనం : నలుగు పెట్టడం,
 7. ఉష్ణోదక స్నానం : వేడి నీటితో స్నానం చేయించడం
 8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం : పవిత్రనదీ జలాలలను బంగారుకలశాలలో పోసి వాటితో అభిషేకించడం
 9. ధౌతవస్త్ర పరిమార్జనం : పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
 10. అరుణ దుకూల పరిధానం : ఎర్రని వస్త్రం ధరింపజేయడం
 11. అరుణకుచోత్తరీయం : ఎర్రని జాకెట్టు ధరింపజేయడం
 12. ఆలేపన మంటప ప్రవేశనం : అత్తరు మొదలైన లేపనాలు పూసే మందిరానికి తీసుకు వెళ్ళడం.
  అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
 13. దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం : చందనం, అగరు, కుంకుమ, సంకు మృగమదం, కర్పూర, కస్తూరీ, గోరోజన తదితర దివ్య గంధములను పూయడం
 14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం : కేశములు విస్తార పరచి సుగంధ ధూపం వేసిజడవేయడం
 15. సర్వ ఋతు కుసుమమాల సంప్రయం : మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార పుష్ప మాలతో అమ్మవారిని అలంకరించడం
 16. భూషణమండప ప్రవేశము : అలంకార గది ప్రవేశము
 17. మణిపీఠోపవేశనం : మణిపీఠం పై కూర్చోపెట్టడము
 18. నవమణిమకుట ధారణ : తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
 19. చంద్ర శకలం : దానిపైన చంద్ర శకలం పెట్టడం
 20. సింధూర ధారణం : సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
 21. తిలక ధారణం : నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
 22. కాలాంజనం ధారణం : అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
 23. పాళీయగళం : అమ్మవారికి చెంప స్వరాలు (మాటీలు) అలంకారం చేయడం
 24. మణికుండళయుగళం : మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
 25. నాసాభరణం : ముక్కు పుడక అలంకరించడం
 26. అధరయావక లేపనం : పెదవులకు పూసే లత్తుక పూయడం
 27. ఆర్య భూషణం : ప్రధాన భూషణం అలంకరించడం
 28. మాంగల్య సూత్రము : మాంగల్య సూత్రమును అలంకరించడం
 29. హేమచింతాకం : బంగారు చింతామణులమాల వేయడం
 30. పతకం : బంగారు పతకం అలంకరించడం
 31. మహాపతకం : పెద్దదిగా ఉన్న బంగారు పతకం ధరింపజేయడం
 32. ముక్తావళి : మూడు వరుసల ముత్యాలహారం
 33. ఏకావళి : 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం అలంకరించడం
 34. చన్నభీరం : యజ్ఞోపవీతం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణాన్ని అలంకరించడం
 35. కేయూర యుగళ భూషణ చతుష్టయము : నాలుగు చేతులకు నాలుగు దండ కడియాలు ధరింపజేయడం
 36. వలయావళి : నాలుగు చేతులకు కంకణములు వేయడం
 37. ఊర్మికావళి : నాలుగు చేతులకు ఉంగరములు తొడగడం
 38. కాంచీధామం : వడ్డాణం పెట్టడం
 39. కటిసూత్రం : వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రం ధరింపజేయడం
 40. సౌభాగ్యాభరణం : అశోకచెట్టు ఆకులాగ ఉండే కుత్తిగంటును ధరింపజేయడం
 41. పాదకటకం : కాలి అందెలు తొడగడం.
 42. రత్ననూపురం : మువ్వల రత్ననూపురాలు తొడగడం.
 43. పాదంగుళీయాలు : మట్టెలు తొడగడం
 44. పాశం : పై కుడి చేతికి తాడు అందించడం
 45. అంకుశం : పై ఎడమ చేతికి అంకుశం అందించడం
 46. పుండ్రేక్షు చాపం : కింది కుడి చేతికి చెరుకువిల్లు ఇవ్వడం
 47. పుష్పబాణాలు : కింది ఎడమ చేతికి పూలబాణం ఇవ్వడం
 48. శ్రీ మణి మాణిక్య పాదుక : ఎర్రని మణి పాదుకలు వేయడం
 49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణం : మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం. ఆ మందిరంలో సాలంకృత ఆవరణదేవతలు కూడా ఉండాలి.
 50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశం : అమ్మవారిని కామేశ్వరుని తొడపై కూచోబెట్టడం
 51. అమృతచషకం : అమ్మవారు తాగడానికి అమృత పాత్రను అందించాలి.
 52. ఆచమనీయం : జలమునందించడం
 53. కర్పూరవీటిక : కర్పూర తాంబూలాన్ని అందించడం.
 54. ఆనందోల్లాస విలాస హాసం :  అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతోషంతో చేసే మందహాసాలు
 55. మంగళార్తికం : గుత్తి దీపాలను అమ్మవారి చుట్టూ తిప్పడం
 56. ఛత్రము :  గొడుగు పట్టడం
 57. చామరం : వింజామర వీచడం
 58. దర్పణం : అమ్మవారికి అద్దం చూపించడం
 59. తాళావృతం : అమ్మవారికి విసనకర్రతో విసురుట
 60. చందనం – గంధం : గంధం సమర్పించడం
 61. పుష్పం :  పుష్పాలను సమర్పించడం
 62. ధూపం :  పరిమళం కోసం ధూపం వేయడం
 63. దీపం : దీప దర్శనం చేయించడం
 64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారాలు : నైవేద్యం సమర్పించడం, తాంబూలం అందించడం, మంగళ నీరాజనం అందించి నమస్కరించడం.