Home తాజా వార్తలు 65 వేల కొలువులు!

65 వేల కొలువులు!

65thound Govt Jobs Vancancy In telangana

కొత్త జోనల్ వ్యవస్థతో కలగనున్న అదనపు ఉద్యోగావకాశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించిన నేపథ్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురించాయి. స్థానికులకు పెద్దపీట వేస్తూ ఏకంగా 95 శాతం రిజర్వేషన్ ‘స్థానికం’ పేరుతో కేటాయించడం పట్ల నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూసిన నిరుద్యోగులు ఇప్పుడు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. సిఎంకెసిఆర్ గతంలో అసెంబ్లీ వేదికగా లక్షా పది వేల కంటే ఎక్కువ ఉద్యోగాలే ప్రభుత్వం కల్పిస్తుందని ఇచ్చిన హామీ మేరకు వివిధ శాఖల అధికారుల నుంచి తీసుకున్న సమాచారం మేరకు తాజాగా 1,12,537 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తేలింది. మొత్తం 83,048 పోస్టుల కోసం రాష్ట్ర ఆర్థిక విభాగం ఇప్పటికే అనుమతులు మంజూరు చేయగా త్వరలో మరో 20,134 పోస్టుల కోసం ప్రస్తుతం పరిశీలన చేస్తూ ఉంది. ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసిన మొత్తం పోస్టుల్లో ఇప్పటికే 32 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ అ య్యాయని, 12,671 మందికి నియామక పత్రాలను కూడా అందజేసినట్లు ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. మరో 36 వేల ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయ ని, త్వరలోనే భర్తీ కావడానికి వివిధ దశల్లో ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మొత్తం 40,291 పోస్టుల్ని భర్తీ చేయడానికి ప్రభు త్వం అనుమతి ఇవ్వగా ఇప్పటికే 36,204 పోస్టుల భర్తీ కోసం 100 నోటిఫికేషన్ల ను జారీ చేసింది. ఇందులో 13,420 పోస్టుల్ని (ఆగస్టు 27 నాటికి) భర్తీ చేయగా మరో 20 వేల పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉంది. జోనల్ ఉత్తర్వులకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఇప్పుడు ఎంతలేదన్నా సుమారు 65 వేల పోస్టులు భర్తీ కానున్నాయి.
సమాయత్తమవుతున్న విద్యార్థులు :
ప్రకటన వెలువడిన వెంటనే పరీక్షలకు సమాయత్తం కావడం కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తునే ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వార్తలు వెలువుడుతున్న నేపథ్యంలో ఆ సర్కారు కొలువులే లక్షంగా పోటీ పరీక్షల్లో మంచి ఫలితం సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు వివిధ పోటీ పరీక్షలకు సిద్దమైన అభ్యర్థులు, యూనివర్సిటీలలో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాలకు అన్ని అర్హతలు ఉండి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ వేటలో పడ్డారు. కోచింగ్ సెంటర్లు, పరీక్షలకు సిద్ధం కావడానికి ఉపయోగపడే పుస్తకాలు తదితరాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. హిమాయత్‌నగర్, గాంధీనగర్, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో స్టడీ సెంటర్లు, కోచింగ్ సెంటర్ల దగ్గర గత వారం రోజులుగా యువత సందడి కనిపిస్తోంది. కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన భారీగా ఉద్యోగాలు భర్తీ అవుతాయని భావిస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులు సర్కారు కొలువులపై దృష్టి పెట్టారు. వివిధ విభాగాలలో భారీగా ఖాళీలు ఉండడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని నిరుద్యోగ యువకులు ఆరాటపడుతున్నారు.