Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

డిగ్రీ కాలేజీల్లో అటెండర్లూ కరవే…

BREAK739 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీ
హైదరాబాద్‌ః ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కనీసం అటెండర్లూ లేకుండా నడుస్తున్నాయి. వినడానికి అశ్చరంగానే ఉన్నా ఇది నిజం. డిగ్రీ కాలేజీల్లో పెద్ద ఎత్తున నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీలున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 127 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 739 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగుల విభజన అనంతరం జనాభా నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి అధికంగా పోస్టులు పోవడం … సింగిల్ పోస్టులు కూడా ఆ రాష్ట్రానికే కేటాయించడంతో ఉన్నత విద్య కమిషనరేట్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఏర్పడింది. అదే సమయంలో డిగ్రీ కాలేజీల్లోనూ వందల సంఖ్యలో ఖాళీ పోస్టులున్నాయి. గత కాంగ్రెస్ పాలనలో కొత్తగా డిగ్రీ కాలేజీలు మంజూరు చేసినా… వాటిలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేయలేదు. అక్కడ కాంట్రాక్ట్ సిబ్బందితో క్లాసులు నడిపిస్తున్నారు. పరిపాలన పరమైన విషయాలకు నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. కనీసం అటెండర్ పోస్టు కూడా మంజూరు చేయలేదు. దీంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇలా వర్ధన్నపేట, శాంతినగర్, గొల్కొండ, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, భీమ్‌గల్, దార్‌పల్లి, జహీరాబాద్, బుధేర, పెబ్బెరు కాలేజీల్లో ఒక్కరు కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు. వీటిలో 145 మంది నాన్ టీచింగ్ సిబ్బంది అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీటితో పాటుగా 113 కాలేజీల్లో ఎలక్ట్రిషియన్ లేరని, 72 కాలేజీల్లో నైట్ వాచ్ మెన్ లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. పరిపాలన అధికారి(ఎఒ) పోస్టులు మరో 22 , పోస్టులు స్టోర్ కీపర్ లు 53, జూనియర్ అసిస్టెంట్ లు 53 మంది, హెర్బెరియ్ కీపర్ 53 మంది, రికార్డ్ అసిస్టెంట్ లు 53మంది, అటెండర్ లు 194 మంది అవసరమని ప్రతిపాదనలు రూపోందించారు. డిగ్రీ కాలేజీల్లో అటెండర్, నైట్ వాచ్ మెన్, జూనియర్ అసిస్టెంట్ ఉండాల్సి ఉండగా ఇవేవి లేకుండా నడిపిస్తున్నారు. వెయ్యి మంది పిల్లల కంటే ఎక్కువగా ఉన్న కాలేజికి ఒక ఎఒ పోస్టును మంజూరు చేయాలనే నిబంధన ఉంది. రాష్ట్రంలో 27 కాలేజీల్లో వెయ్యి మందికి కంటే ఎక్కువగా విద్యార్థులున్నారు.. కానీ ఎనిమిది మంది మాత్రమే ఎఒలున్నారు. ఇలా నాన్ టీచింగ్ సిబ్బంది లేకపోవడంతో పరిపాలన పరంగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని… విద్యార్థుల ఫీజులు తీసుకోవడం, వారికి సంబంధించిన రికార్డులు నిర్వహణ, ఇతరత్రా సమాచారం , బిల్లులు చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనైనా వీటికి మంజూరు అవుతాయనే అంచనాలతో అధికారులు, విద్యార్థులున్నారు.

Comments

comments