Home ఆదిలాబాద్ నాడు భయం భయం నేడు ప్రశాంత జీవనం

నాడు భయం భయం నేడు ప్రశాంత జీవనం

NAXALITE-INCIDENT-OF-ALLAMPదేశంలోనే సంచలనం సృష్టించిన అల్లంపల్లి సంఘటనకు నేటితో 28 ఏళ్లు
ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా నక్సలైట్ల జిల్లాగా దేశంలోనే ప్రసిద్ది చెందింది. జిల్లాలో ఖానాపూర్ పోలీస్ సర్కిల్‌కు ఒక పెద్ద చరిత్రనే ఉంది. ఈ సర్కిల్ పరిధిలోనే 21 మంది పోలీసులను నక్సలైట్లు పలు విధ్వంక సంఘటనలో హతమార్చారు. ఆ చరిత్రకు సజీవ చిహ్ననాలు నేటికి ఉన్నాయి. అరుదైన సంఘటనలు జరిగిన ఖానాపూర్ పోలీస్ సర్కిల్ గా వాసికేక్కింది. గత 28 సంవత్సరాల క్రితం పోలీసు ఉద్యోగం అంటే ఒక సవాల్‌గా ఉండేది. పోలీసులు విధినిర్వహనలోగాని, స్వంత పనులలోగాని, ఒక్కరు మాత్రం వెళ్లకపోయేవారు. స్వంత గ్రామానికి గాని, ఇంటికి గాని పోవాలంటే ప్రయాణికుల మాదిరిగా ప్రయాణికులతో కలిసి భయం భయంగా వెళ్లెవారు.

ఇదే మాదిరిగా క్షణక్షణం భయం భయంగా ఇక్కడి ప్రజలు బ్రతికారు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ఏ గ్రామంలోనైన నక్సలైట్లు కవ్వింపు చర్యలకు పాలుపడుతుండేవారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని పోలీసులు, ఇటు ప్రజలు ఆందోళన పడేవారు. 28 సంవత్సరాలు క్రితం ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అడవి ఉండేది. నక్సలైట్లు ఆదిలాబాద్ జిల్లాలోని అడవి ప్రాంతాన్ని ఎంచుకొని స్థావరాలు ఏర్పాటుచేసుకొని కొన్ని సంవత్సరాల పాటు తమ కార్యకలాపాలు కొనసాగించారు. అప్పట్లో అల్లంపల్లి దళంగా, అజ్ఞాతవాస నక్సలైట్లు అల్లంపల్లి దళంగా ఏర్పడి ప్రభుత్వాన్ని సైతం గడగడలాడించారు. అప్పటి అల్లంపల్లి దళ కమాండర్‌గా రమేష్ దేశంలోనే చరిత్ర సృష్టించారు. అల్లంపల్లి దళం అంటే జిల్లాలో భయం భయంగా ఉండేది. రమేష్ దళాన్ని తట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.

17adadb06p2సరిగ్గా అంటే 18 ఆగస్టు 1987న కడెం మండలం అల్లంపల్లి గ్రామ సమీపంలో గల అద్దాలచిన్నాపూర్ వద్ద నక్సలైట్లు పోలీసులపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఎస్‌ఐలతో పాటు 8 మంది పోలీసులను నక్సలైట్లు కాల్చి చంపారు. ఒక చోటనే 10 మంది పోలీసులను నక్సలైట్లు హతమార్చడం భారతదేశంలోనే సంచలనం సృష్టించింది. నక్సలైట్లు 10 మంది పోలీసులను హతమార్చడం కూడా అల్లంపల్లి సంఘటననే ప్రథమం. ఈ సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దేశంకూడా ఉలిక్కిపడింది. దీంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు స్వయంగా అల్లంపల్లి గ్రామాన్ని సందర్శించారు.

నక్సలీజం మూలం వెతకడానికి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ 100 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి ఉట్నూర్ ఐటిడిఎ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలన్నింటికి ఒకేసారి 1000 గిరిజన ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేశారు. ఏ మారుమూల గ్రామంలో పదో తరగతి వరకు చదువుకున్న గిరిజనులను గుర్తించి అదే గ్రామంలో ఉపాధ్యాయునిగా పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించారు. అంతే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలకు అల్లంపల్లి నుండే శ్రీకారం చుట్టారు. ఆ రోజు నక్సలైట్లు జరిపిన ఎదురుకాల్పుల్లో 10 మంది పోలీసులు మరణించగా కొద్ది పోలీసులు చాకచక్యంగా తప్పించుకున్నారు.

ప్రస్తుతం వారు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో ఎఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న నక్సలైట్లు ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. కాలక్రమేన ఆదిలాబాద్ జిల్లాలో నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గిపోయి నేడు ప్రశాంత జీవన, సుఖసంతోషాలతో ప్రజలు జీవిస్తున్నారు. అల్లంపల్లి సంఘటనలో మరణించిన ఎస్‌ఐ వెంటక రామనర్సయ్య, ఎస్‌ఐ రాజన్న, హెడ్ కానిస్టేబుల్ గఫర్, పిపిలు విఠల్‌సింగ్, జావీద్, రఘునాథ్, సత్యనారాయణచారి, జగన్నాథ్‌రావ్, ముకుంద్‌రావ్, అశోక్‌గౌడ్ తదితరులు అసువులు బాసారు.