Search
Saturday 22 September 2018
  • :
  • :

రిలయన్స్ లాభం 8,109 కోట్లు

నికర లాభం 12.5 శాతం వృద్ధి   

రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఆర్‌ఐఎల్

Reliance

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి సత్తా చాటిం ది. చమురు నుంచి టెలికామ్ వరకు బహుళ వ్యాపార సంస్థలు కల్గిన రిలయన్స్ రెండో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. ఈ క్యూ2 (జులై సెప్టెంబర్) లో ఫలితాల్లో నికర లాభం 12.5 శాతం వృద్ధిని సాధించి రూ.8,109 కోట్లు లాభం నమోదు చేసింది. రిఫైనింగ్ లాభాలు తొమ్మిదేళ్ల గరిష్ఠానికి చేరుకోవడం, టెలికామ్ సంస్థ జియో ఆపరేషనల్ లాభం పెరగడంతో ఈసారి కూడా రిలయన్స్ లాభాల్లో మేటి అనిపించింది. ఇక కంపెనీ నికర ఆదాయం 15.89 శాతం పెరిగింది. గతేడాది కంపెనీ ఆదాయం రూ.84,044 ఉండగా, ఇప్పుడు అది రూ.97,402కు పెరిగింది. కంపెనీ రాబడి 23.9 శాతం పెరిగి రూ.1,01,169 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ జెనెసిస్ లగ్జరీ లిమిటెడ్‌లో 40 శాతం వాటా కొనుగోలు చేసింది. మీడి యా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ఆర్‌ఐఎల్ బాలాజీ టెలిఫిలమ్స్‌లో వాటా కొనుగోలు చేసింది. ఆర్థిక ఫలితాల పై ఆర్‌ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ సంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిందని అన్నారు. ఈ త్రైమాసికంలో కంపెనీ అద్భుత సామర్ధ్యం కనబరిచిందని అన్నారు. తమ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపార వృద్ధి కంపెనీ ఫలితాలపై సానుకూల ప్రభావం చూపిందని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా వ్యాపార అవకాశాల విస్తృతి ఫలితాలు ఇవ్వడం మొదలైందని అన్నారు. రిటైల్ బిజినెస్ ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేస్తోందని అన్నారు. డిజిటల్ మార్కెట్‌లో రిలయన్స్ జియో నూతన తరం డేటా విప్లవాన్ని అందిపుచ్చు కుంటుందని అన్నారు. టెలికాం రంగంలో అడుగు పెట్టడంతోనే సంచలనాలను నమోదు చేసిన జియో మాత్రం రిలయన్స్‌కు నష్టాలను మిగిల్చింది. జియోకు రూ.271 కోట్ల మేర నష్టం వచ్చినట్లు రిలయన్స్ తన ఆర్థిక ఫలితాల్లో వెల్లడించింది. కంపెనీ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 0.48 శాతం పెరిగి రూ.876.70 వద్ద స్థిరపడింది. వచ్చే రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ భారీ లాభాలను నమోదు చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Comments

comments