Home తాజా వార్తలు 9355 జూ. కార్యదర్శుల భర్తీకి మార్గసూచీ

9355 జూ. కార్యదర్శుల భర్తీకి మార్గసూచీ

9355 village panchayat secretary jobs notification in telangana 2018

డిఎస్‌సి ద్వారా నియామకాలు
రాష్ట్రస్థాయి సెలక్షన్ కమిటీ ఏర్పాటు
ప్రతి జిల్లాకు కొత్త రోస్టర్ పద్ధతి, కనీస విద్యార్హత డిగ్రీ
వయోపరిమితి జనరల్‌కు 39 ఏళ్లు, ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు పదేళ్ల సడలింపు

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సెలక్షన్ కమిటీతో పాటు మార్గదర్శకాలకు సంబంధించి ఉత్తర్వులను ప్రభు త్వం సోమవారం జారీచేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలను చేపడుతున్నారు. పంచాయతీరాజ్‌లో ఇప్పటి వరకు ఎలాంటి నియామకపు కమిటీ లేక పోవడంతో ఈ విషయంలో కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందేహాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీని నియమించింది. చైర్‌పర్సన్, కన్వీనర్, సభ్యులను ఎవరిని ఉంచా లో ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మొత్తం 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించనున్నారు. తొలుత 6603 పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం అనంతరం మిగిలిన వాటికి అనుమతిస్తూ తాజాగా మొత్తం 9355 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. పంచాయతీరాజ్ , గ్రామీణ ఉపాధి కమిషనర్ పరిధిలో ఈ నియామకాలు జరగనున్నాయి. 30జిల్లాల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏ జిల్లాకు సంబంధించిన మెరిట్ జాబితాను ఆ జిల్లా వారీగా సిద్ధం చేసి సెలక్షన్ కమిటీకి పంపిస్తారు.  ప్రతి జిల్లాకు కొత్త రోస్టర్ పద్ధతిన వీరి నియామకాలు జరుపుతారు. రాత పరీక్ష, ప్రశ్నాపత్రాల తయారీ తదితర ప్రక్రియలన్నింటిని జెఎన్‌టియు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ బోర్డ్ వంటి ఏజెన్సీల ద్వారా చేపడతారు. సెలక్షన్ కమిటీ నియామకాలను పూర్తి చేస్తుంది. పంచాయతీరాజ్, రూరల్ ఎంప్లాయిమెంట్ కమిషనర్ చైర్‌పర్సన్‌గా డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.  ఈ కమిటీలో సభ్యులుగా జెఎన్‌టియు రిజిస్ట్రార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అదనపు కార్యదర్శి, సెర్ఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సాధారణ పరిపాలన విభాగం(జిఎడి) నుంచి ఒకరు, న్యాయశాఖ నుంచి ఒకరు ఉంటారు. పంచాయతీరాజ్, రూరల్ ఎంప్లాయ్‌మెంట్ డిప్యూటి కమిషనర్ కన్వీనర్‌గా ఉంటారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పదిరోజుల పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.  అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి డిగ్రి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జనరల్ అభ్యర్థులు 18 నుంచి 39 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.

ఎస్‌సి, ఎస్‌టి, బిసి అభ్యర్థులకు పదేళ్ల సడలింపు( 49 సంవత్సరాల వరకు) ఇచ్చారు. కొత్త జిల్లాల వారీగా నియామకాలను ఆయా జిల్లాలకు చెందిన స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన తర్వాత వాటి మేరకు పోస్టుల భర్తీలో తగు మార్పులు చేసి అన్ రిజర్వ్‌డ్ కోటాలో నింపుతారు. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో మూడు గంటల నిడివితో రెండు పేపర్లు(పరీక్షలు) నిర్వహిస్తారు. ఒక్కోపేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్1లో జనరల్ నాలెడ్జ్, జనరల్ మెంటల్ ఎబిలిటికి సంబంధించిన ప్రశ్నలు, రెండవ పేపర్‌లో నూతన తెలంగాణ పంచాయతీరాజ్ ఆక్ట్2018, పంచాయతీరాజ్ సంస్థలు,లోకల్ గవర్నెన్స్, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, బౌగోళిక, ఆర్థిక వివరాలు, ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఇస్తారు. తప్పుడు సమాధానికి ( ఒక్కో దానికి) 1/3 మార్కును కట్‌చేస్తారు. జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్‌సి, ఎస్‌టి, బిసి అభ్యర్థులకు రూ.250 ఫీజు.