Home జాతీయ వార్తలు మెదడువాపు మృతుల సంఖ్య 97

మెదడువాపు మృతుల సంఖ్య 97

97 children died

 

ముజఫర్‌పూర్(బీహార్): ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధికి బలైన వారి సంఖ్య 97కు చేరింది. పరిసర జిల్లాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలుతోంది. ఎక్కువ మంది బాధితులు పదేళ్ల లోపు పిల్లలే. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఆదివారం ముజఫర్‌పూర్ లోని శ్రీక్రిష్ణ మెడికల్ కాలేజి, ఆస్పత్రిని సందర్శించారు. మెదడువాపు వల్లనే ఈ ఆస్పత్రిలో గత రెండు వారాల్లో ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ చనిపోయారు. ఈ మెదడువాపును స్థానికంగా ‘చంకీ’ జ్వరంగా పిలుస్తారు. ఆదివారం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న ఐదేళ్ల బాలిక మంత్రి ఎదుటే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచి వేసింది. ఆస్పత్రిలో నాలుగు గంటలు గడిపి మంత్రి హర్షవర్ధన్ సమీక్షించారు. ఆస్పత్రి లోని చికిత్స విషయం లోను, సౌకర్యాల లోను ఎలాంటి పొరపాట్లు మంత్రి కనుగొనలేదు. ఈ విపత్తును ఎదుర్కోడంలో డాక్టర్ల సామర్ధాన్ని ప్రశంసించారు. ఈ వ్యాధికి దారి తీసిన కారణాలను గుర్తించడానికి వీలుగా రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పాలని సలహా ఇచ్చారు. ఈమేరకు మల్టీ డిసిప్లనరీ ఇనిస్టిట్యూట్ వచ్చే ఏడాదిలో ఇక్కడ నెలకొల్పడమవుతుందని చెప్పారు.

బీహార్ ఆరోగ్యమంత్రి ఘెరావ్
మెదడు వాపు వ్యాధికి ఎక్కువగా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నా రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేస్తూ పిల్లల తల్లిదండ్రులు రాష్ట్ర ఆరోగ్యమంత్రిని సోమవారం ఘెరావ్ చేశారు.

కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌పై కేసు
బీహార్ రాష్ట్రంలో మెదడువాపు తీవ్రంగా ప్రబలుతున్నా కేంద్ర ఆరోగ్య మంత్రి సరైన సమయంలో సరిగ్గా స్పందించ లేదని ఆరోపిస్తూ ఆయనపై కేసు దాఖలు అయింది. 2014లో ఇదే విధంగా ఈ రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి ప్రబలి 379 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు కేంద్ర ఆరోగ్య మంత్రిగా హర్షవర్ధనే ఉన్నారు. ఇక్కడి ఆస్పత్రిని సందర్శించి విపత్తును నివారించడానికి కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇది జరిగి ఐదేళ్లు అయినా క్షేత్ర స్థాయిలో ఎలాంటి మార్పు రాలేదు.

97 children died with brain disease in Bihar