Home దునియా అగ్గికి ఎదురేగడమే పని!

అగ్గికి ఎదురేగడమే పని!

Firemenకలకత్తా నగరం విపరీతమైన జనసమ్మర్థంతో,ఇరుకుసందులతో కూడి ఉన్నది.నగర ఇరుకు సందుల్లోంచి గణ గణ గంట మోగిస్తూ వెళ్ళే ఎర్ర రంగు వాహనం చూడగానే ఓ పన్నెండు సంవత్సరాల బాలుడు ఇంట్లో ఉండేవాడు కాదు. తన ఇంటి ముందు నుండి వెళ్ళే వ్యాన్ వెంబడి ఆ కుర్రాడు పరిగెత్తేవాడు.అగ్ని ప్రమాదం సంభవించిన ఇంటి దగ్గర ఆగిన వ్యాన్‌లో నుండి బిల బిల మంటూ దిగిన సిబ్బంది మంటలనార్పుతుంటే ఈ బుడతడు వారికి సాయమందించేవాడు.అలా ప్రతి సారి వారిని గమనించి మంటలనార్పే విద్యను ఒంటబట్టించుకున్నాడు.అలా 1978 సంవత్సరంలో బ్యాంక్‌లో సంభవించిన మంటలనార్పుతూ మొదలుపెట్టిన ప్రవృత్తిని నేటికీ తన 60 సంవత్సరాల వయసులో కొనసాగిస్తున్నారు కోల్‌కతాకు చెందిన ‘బిపిన్ దా’.

అన్నయ్య దుర్మరణం బాధ్యత గుర్తు చేసింది : బిపిన్ దా పూర్తిపేరు బిపిన్ గంటారా. కలకత్తాలో తమ ఇంట్లో చిన్నప్పడు దీపావళి పండుగ సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో బిపిన్ అన్నయ్య నరేంద్ర మృతి చెందడం తనను కలిచివేసింది. అదే బిపిన్‌ను బాధ్యత వైపు నడిపింది.వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్ అయిన బిపిన్ ప్రవృత్తిగా ఫైర్ ఫైటింగ్ ఎంచుకున్నారు,అదీ స్వచ్ఛందంగా.

ఎలా తెలుసుకుంటారు : ఒంటరిగా నివసించే బిపిన్ రోజూ రేడియో,టి.వి ల్లో వచ్చే సమాచారాన్ని అందుకుని మొదట అగ్ని మాపక సిబ్బందికి తెలియజేసి,తాను ఆటోలో ప్రమాదం జరిగే ప్రదేశానికి చేరుకుంటాడు.బిపిన్‌ను చూసిన ప్రజలు కూడా అతడు వెళుతుంటే అభ్యంతరం చెప్పరు,ఎందుకంటే శిక్షణ పొందకపోయినా కూడా చాకచక్యంతో పని చేస్తాడన్న నమ్మకం అక్కడి ప్రజలది.

సిబ్బంది కొరత : కోల్ కతా నగరంలో 2014 సంవత్సరంలో 2000 అగ్ని ప్రమాదాలు నమోదవ్వగా వాటిలో 347 మంది చనిపోయారు,1749 మంది గాయపడ్డారు.గత సంవత్సరం 1600 ప్రమాదాల్లో 143 మంది చనిపోగా,974 మంది గాయపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. సిబ్బంది ఎంతమంది ఉన్నా నగరాల్లో సంభవించే అగ్ని ప్రమాదాలకు సిబ్బంది కొరత ఉంటుంది.దాంతో వారు ఎక్కువ గంటలు పనిచేయడం సర్వ సాధారణం.అగ్నిమాపక సిబ్బంది బిపిన్‌కు అడ్డుచెప్పకపోవడానికి ఇదో కారణం.బిపిన్ కూడా ఒక్కో రోజు మూడు మంటలార్పే విధుల్లో పాల్గొంటున్నారు.

మృత్యువు అంచుల వరకు వెళ్ళి: కోల్‌కతా స్ట్రాండ్ రోడ్‌లోని గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో బిపిన్ దాదాపు మృత్యువు అంచులదాకా వెళ్లి వచ్చారు. ఘటనలో రెండు నిండు సిలిండర్లను బయటకు తేవడానికి(నిండు సిలిండర్ పేలితే అగ్ని ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుందని) అత్యంత ప్రమాదమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు బిపిన్.మరో సంఘటనలో నాలుగంతస్థుల బిల్డింగ్ అగ్ని ప్రమాదానికి గురైతే అందులో ఉన్న గర్భవతైన మహిళను రక్షించేందుకు దట్టమైన పొగలు అలుముకుంటున్నా ఆవిడ వెంబడి ఉండి,సిబ్బంది తెచ్చిన ప్రత్యేక స్ట్రెచర్ సాయంతో ఆమెను రక్షించారు.2011 సంవత్సరంలో ప్రైవేట్ వైద్యశాలలో సంభవించిన అగ్ని ప్రమాదం(89 మంది చనిపోయారు)లో పొగతో నిండిన దవాఖానాలోకి వెళ్ళి ఐ సి యు లో బతికున్న పేషెంట్‌ను కాపాడారు.1993 సంవత్సరంలో బజార్ బాంబ్ బ్లాస్ట్ ,2001 సంవత్సరంలో నందరం మార్కెట్ ఫైర్‌లో కీలకంగా పనిచేశారు.

నెలకు వెయ్యి రూపాయల సంపాదన : ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే బిపిన్ నెల సంపాదన కేవలం ఒక వెయ్యి రూపాయలు.స్నేహితులు ప్రతి నెల అందించే 2,500 రూపాయలతో కలిపి తన జీవితం గడిచిపోతుంది.ఎన్నో సార్లు కాలిన గాయాలు,దెబ్బల పాలైనా కూడా తాను చేసే పనిని ఆపలేదు. ఇప్పటి వరకు ఒక అధికారి ఇచ్చిన ఖాఖీ యూనిఫాం(21 సంవత్సరాలుగా),స్నేహితులు ఇచ్చిన టార్చి,పసుపు రంగు హెల్మెట్‌తోనే తన స్వచ్ఛంద సేవ కొనసాగిస్తున్నారు బిపిన్.గత 40 సంవత్సరాలుగా సేవలందిస్తున్న బిపిన్ నేటికీ అలసిపోలేదు,తన చివరి శ్వాస వరకు సేవలందిస్తానని చెబుతున్నారు.

– అనిత యెలిశెట్టి