Home లైఫ్ స్టైల్ ఆమే ఒక సైన్యం

ఆమే ఒక సైన్యం

Women-Cartoon

ఇంటిని చక్కదిద్దుకోవటం ఒక్కటే సవ్యంగా చేసినంత మాత్రాన “గొప్పభార్య” అనే కీర్తి ప్రతిష్ఠలు కొట్టేయొచ్చుననుకుంటే పప్పులో కాలువేసినట్టేనని సోషియాలజిస్టులంటున్నారు. గృహిణిగా మీరు ఎంత చక్కటి పాత్ర పోషించినా మీ బాధ్యతల పట్ల ఎంత అంటి పెట్టుకున్నా, అందరి సంతృప్తి కోసం ఎంతగా పాటుపడినా… అదొక్కటే మీ కార్య నిర్వహణా సామర్థంగా పరిగణించకూడదు. ఇంటిని మెయింటైన్ చేయటం, భర్తను మలుచుకోవటం, పిల్లల్ని పెంచి పెద్ద చేయటం ఇవ్వన్నీ గొప్ప విషయాలేనా అని మీ తోటి వాళ్ళే తీసి పారేస్తారు. “నేను నా ఇంటిని చక్కదిద్దుకున్నానోచ్‌” అని ఎలుగెత్తి చాటుకోవటానికి నువ్వేమైనా ప్రైమ్ మినిష్టర్ భార్యవా అనడుగుతారు. నిజానికి గృహిణిగా మీరు పాత్రను పోషించేందుకు సిద్ధపడినప్పుడు, మీ విధి నిర్వహణ, రోజుకు మూడు షిప్టులూ పనిచేసే సినిమా తారకన్నా భిన్నమైందనే చెప్పాలి. సంవత్సరానికి పది ఇరవై సిన్మాల్లో నటించే బిజీ తారకూడా అన్ని పాత్రలు పోషించదు. గృహిణి అనే మూడక్షరాల మాటలో ఎన్నో పాత్రలు ఇమిడి వున్నాయి. ఆ పాత్రల లిస్టులో కొన్నిటిని మాత్రం మనం ఒక లిస్టుగా రాయగలం. వంటామె, చాకలి, ఆయా, దాసి, పార్ట్ టైం కారు డ్రైవర్, అటక ఎక్కి బూజులు దులిపే పార్ట్ టైం కూలి, గుమస్తా (ఇంటి ఖర్చుల జమా పద్దులు రాయాలి) పుస్తకాలు సర్దాలి. అందంగా వుండాలి (లైబ్రేరియన్), ఇంటికి కావల్సిన వస్తువుల్ని తెలివిగా కొనుగోలు చేసే పర్చేజ్ ఆఫీసర్, ఇంటికి వచ్చే యావన్మందితో సత్సంబంధాలను పెంచుకునే పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు, మీ ఆయన అంతరంగిక విషయాలను పర్యవేక్షించే పర్సనల్ అసిస్టెంట్ , ఇంట్లో చిన్నా పెద్దలకు బుద్దులు, సలహాలు చెప్పే కన్సల్టెంట్, సమస్యలు వచ్చినప్పుడు తెలివిగా పరిష్కార మార్గాలను అందించే ట్రబుల్ షూటర్, చక్కని కార్యనిర్వాహకురాలు, ఎగ్జిక్యూటివ్… ఇలా రకరకాల పాత్రలు 24 గంటల పలు ఉద్యోగాల సందులోనే మీరు ఉద్యోగం చేయాలి. డబ్బు సంపాదించాలి. ఉత్తమురాలన్పించుకోవాలి. మీలో ఏదైనా కళాత్మక లక్షణాలుంటే వాటిని కాపాడుకుంటూ, గాయనీగానో, రచయిత్రిగానో వెలుగొందటం ఎలాగో ఆ పనీ మీరే స్వయంగా చేసుకోవాలి.
“విమన్‌” అనే గ్రంథం రచయిత్రి మారినియా ఫెర్టినాండ్ మాటల్లో చెప్పాలంటే…. “ఇంట్లో “భార్య” వుండటం వల్ల ఒక మగ మనిషి ఆదాయం పెరుగుదల మరింత అభివృద్ధి కావటమే కాక, అతగాడి ఖర్చులు 60శాతం నుండి 30శాతానికి పడిపోతున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.