Home జాతీయ వార్తలు అలుపెరుగని పోరాట యోధుడు బర్దన్

అలుపెరుగని పోరాట యోధుడు బర్దన్

AB-Bardhanమన తెలంగాణ / హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీకి 14 సంవత్సరాల పాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అర్ధేందు భూషణ్ బర్దన్ (ఎబి బర్దన్)తూర్పు బెంగాల్‌లోని (ప్రస్తుతం బంగ్లాదేశ్)బరిసాల్‌లో 1924 సెప్టెంబర్ 24న జన్మించారు. ఆయన తండ్రి ఉన్నత ఉద్యోగి. కుటుంబం నాగ్‌పూర్‌లో స్థిరపడింది. నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి బర్దన్ ఎంఏ పట్టా పొందారు. ఆయన మెరిట్ విద్యార్థిగా ఉండేవారు. విద్యార్థి దశలోనే జైలుకు వెళ్లిన ఆయన, అక్కడ నుంచే పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులయ్యారు. విశ్వవిద్యాలయం విద్యార్థి ఎన్నికలలో భారీ మెజార్టీతో పిసి శుక్లాపై గెలుపొందారు. పిన్న వయస్సులోనే బర్దన్ కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నాగపూర్‌లో, 1946లో గుంటూరులో జరిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య మహాసభలలో ఆయన కీలక పాత్ర పోషించారు. సత్యపాల్‌డాంగ్, గీతాముఖర్జీ సహచరుడుగా విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించారు. 1948నుంచి రెండు సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపారు.

నాగపూర్ కేంద్రంగా కార్మిక సంఘాల నిర్మాణం, వాటిని సంఘటిత పర్చడంలో బర్దన్ కృషి ఎనలేది. ఎఐటియుసికి అధ్యక్షుడిగా, కార్యదర్శిగా నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.ముఖ్యంగా అఖిల భారత స్థాయిలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్‌కు దీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేశారు. మహారాష్ర్ట కమ్యూనిస్టు ఉద్యమంలో ముఖ్యంగా విదర్భ ప్రాంతంలో కామ్రేడ్ సుధాం దేశ్‌ముఖ్‌తో కలిసి బలమైన కమ్యూనిస్టు పార్టీని నిర్మించారు. 1957-62 కాలంలో మహారాష్ర్ట అసెంబ్లీకి నాగపూర్‌నుంచి ఎన్నికయ్యారు. బహు భాషల్లో ఆయనకున్న పరిజ్ఞానం ఆయనను ఒక గొప్ప వక్తగా తీర్చిదిద్దాయి. నాగపూర్‌లో అందరి ప్రేమాభిమానాలు చూరగొన్న మేధావిగా, రాజకీయ నాయకుడుగా ఆయన రాణించారు. విదర్భలోని పలు సంస్థలు ఆయనకు పురస్కారాలు అందజేశాయి. ఆయనకు 80ఏళ్లు వచ్చిన సందర్భంగా విదర్భలోని కార్మిక సంస్థలు ఆయన గౌరవార్థం రూ.20లక్షల మొత్తాన్ని అందించాయి. ఆ మొత్తాన్ని ఆయన వెంటనే విదర్భ ట్రేడ్‌యూనియన్ స్కూలుకు విరాళంగా అందజేశారు.

చండ్ర రాజేశ్వరరావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో బర్దన్ కేంద్రకార్యదర్శి వర్గంలోకి వచ్చారు. ఆ తర్వాత ఇంద్రజిత్ గుప్తా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా బర్దన్ బాధ్యతలు చేపట్టారు.1996నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శి పదవినుంచి ఆయన ఐచ్ఛికంగా వైదొలిగారు. సిపిఐ ప్రోగ్రావ్‌ు పర్మినెంట్ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. సిఆర్ ఫౌండేషన్‌కు గౌరవాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

దేశ రాజకీయాల్లో వామపక్షాలను ఐక్యవేదిక మీదకు తీసుకురావడంలో, ప్రత్యామ్నాయ పంథా రూపకల్పనలో ఆయన మార్గదర్శకత్వం వహించారు. కమ్యూనిస్టు పార్టీల ఆహ్వానంపై నాటి సోషలిస్టు దేశాల్లో, కొంత కాలం క్రితం చైనా, వియత్నాంలలో విస్తృతంగా పర్యటించారు. బంగ్లాదేశ్, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆయనతో పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించేవారు. దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా కమ్యూనిస్టు పార్టీ నాయకులతో ఆయనకు బలమైన సంబంధాలున్నాయి.

ఆయన రచనలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమంపై ఆయన రాసిన చిరుపుస్తకాలు, వ్యాసాలు కమ్యూనిస్టు శ్రేణులకు విజ్ఞానదాయకంగా ఉంటాయి. మతం, కులం, చరిత్రపై ఆయన వెలువరించిన పుస్తకాలు ఆయా అంశాలను అర్థంచేసుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి మార్గదర్శనం చేస్తాయి. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రోగ్రావ్‌ు రూపకల్పన చేసింది ఆయనే. పార్టీ కేంద్ర కార్యాలయం అజయ్‌భవన్‌లో ఉంటూనే సహచరులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేవారు. ముఖ్యంగా బీహార్, యూపీ, ఈశాన్య భారతంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. యూపీఏ 1 ఏర్పాటులో సుర్జీత్‌తో కలిసి బర్దన్ కీలక పాత్ర పోషించారు. వామపక్షాల నేతలేగాక, ఇతర పార్టీల సీనియర్లు కూడా బర్దన్‌తో వివిధ అంశాలపై సంప్రదింపులు జరుపుతూ సలహాలను స్వీకరించేవారు.

ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీతో ఆయనకు సుదీర్ఘమైన సంబంధాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఎన్నికల సందర్భంలో, ఇతర సమయాల్ల్లో పలుసార్లు పర్యటించారు. విశాలాంధ్ర దినపత్రిక అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. విజయవాడ, హైదరాబాద్‌లలో జరిగిన పత్రిక వార్షికోత్సవాల్లో, విశాఖపట్నం ఎడిషన్ ప్రారంభసభల్లో ఆయన పాల్గొన్నారు. బండ్లగూడలోని గిరిప్రసాద్ భవన్ ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

నాగపూర్‌లో నక్సల్స్‌ను పట్టుకొని ఎన్‌కౌంటర్‌కు పాల్పడుతున్న సమయాల్ల్లో ఆ కుట్రలను ఆయన బహిర్గతం చేసి వారి ప్రాణాలను కాపాడిన సందర్భాలున్నాయి. హైదరాబాద్‌లోని సీఆర్ ఫౌండేషన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. విద్యార్థి దశ నుంచే ఆయనకు ఆంధ్రప్రదేశ్‌తో గాఢమైన సంబంధాలు కొనసాగాయి. బర్దన్ భార్య 1986లో చనిపోయారు. ఆయనకు ఒక కుమార్డు, కుమార్తె ఉన్నారు. ఆయన కుమార్తె అహ్మదాబాద్‌లో వైద్య వృత్తిలో ఉన్నారు. ఆయన కుమారుడు అమెరికాలో ఉంటున్నారు.