Home దునియా ఇల్లాలి(భర్త) ముచ్చట్లు

ఇల్లాలి(భర్త) ముచ్చట్లు

Harivillu-image

పురాణం వారి ‘ఇల్లాలి ముచ్చట్లు’ శీర్షికకి రజతోత్సవం జరుగుతోంది. నాకు చాలా ఆనందం కలిగింది. తెలుగు సాహిత్యంలో భార్యలకి ఇంత అందమైన చరిత్రను కల్పించిన భర్తలు అరుదు. ముని మాణిక్యంగారి కాంతం నండూరి ఎంకి స్థాయిలో తన యిల్లాలికి పీట వేశారు పురాణం. ఆయన యిల్లాలి ముచ్చట్లు ప్రారంభం కాక ముందే ఆయన యిల్లాలిని దాదాపు 3 దశాబ్దాల క్రిందటే తెలుసు. ఆ రోజుల్లో 1959లో నేను ఢిల్లీలో అంతర్విశ్వ విద్యాలయ నాటిక పోటీల్లో ఉత్తమ రచనకి అనంతం బహుమతి పుచ్చుకుంటే, అద్దె కడిగి నన్ను సైకిల్ మీద వేసుకొని సభలో కూర్చుని చప్పట్లు కొట్టిన ఏకైక ఆంధ్రుడు పురాణం. అప్పట్లో చీకటిలో చీలికలు నవల వ్రాస్తున్నాను. ఆయన 182 నార్త్ ఎవెన్యూలో మోతే వేదకుమారి క్వార్టర్‌లో ఉండేవారు. నన్ను పందెపు కోడిలా దువ్వి ఇంట్లోనే సమావేశం జరిపి నా చేత నవలలో భాగాలు చదివించారు. కపిల కాశీపతి, పన్యాల రంగనాధరావు, కట్టారి సుబ్రహ్మణ్యం, సెట్టి ఈశ్వరరావు, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు, కొత్త లక్ష్మీ రఘురామ్ వీరంతా ప్రేక్షకులు.

ఓ రోజు ఉదయాన్నే తెలుగు వార్తల్లో సూరంపూడి సీతరాం గారి గొంతు విని అప్పటికప్పుడు ఫ్లాట్ తాళం వేసి రేడియో స్టేషన్‌కి వెళ్లాం యిద్దరమూను. స్టౌ మీద పాలు ఉంచామన్న విషయం ఇద్దరం మరచిపోయాం. కొన్ని గంటల తర్వాత ఇద్దరం తిరిగివ చ్చేసరికి పాలు మరిగి, పొంగి, నల్లగా మసి అయిన గిన్నె కాలి నలుపెక్కి పోయింది. నేను రొట్టెలు తయారు చేస్తూ ఆయన కూర చేస్తూ సాహితీ చర్చ సాగించేవాళ్లం. సాహిత్యం రుచిచూస్తూ నాసిరకం వంటతో సరిపెట్టుకొనే వాళ్లం.
నా ఆంధ్రప్రభ ఉద్యోగానికి ఆయనే అప్లికేషన్ తయారు చేసి, రికమండేషన్ ఉత్తరము పోగుచేసి విజయవాడ రైలెక్కించారు. వాళ్లింట్లోనే దిగి పురాణం సూర్యప్రకాశరావు, నేను, నీలం రాజు వెంకట శేషయ్యగారు కలుసుకున్నారు.

ఆయన రైల్వేలో ఉద్యోగం చేసేవారు. సాయంకాలం పార్లమెంట్ స్ట్రీట్ మూలన ఇండియా కాఫీ హౌస్ దగ్గర నిలబడితే రెండు మొక్కజొన్న పొత్తులు పట్టుకొని సాహిత్య అకాడమీ బిల్డింగ్ దగ్గర కనిపించేవారు. ఇద్దరం మొక్కజొన్న పొత్తు తింటూ జంతర్ మంతర్, రిజర్వుబ్యాంక్, ఆలిండియా రేడియో, పార్లమెంటు భవనం దాటి ఇండియా గేటు లాన్స్‌కి చేరేవాళ్లం. అక్కడ నాటకం రిహార్సల్సు. మమ్మల్నందర్నీ ఆకెళ్ల అచ్యుతరాముగారు తన బుల్లికారులో ఇళ్లకు చేర్చేవారు.
తర్వాత జ్యోతి ఉద్యోగం. ఆయన ఆలస్యంగా ఉద్యోగం మారుస్తూన్నారు అనుకొన్నాను. కాని ఒక జీవితకాలం గుర్తుండే సాహితీ సంసారాన్ని సిద్ధం చేసుకొంటారని అనుకోలేదు. ఆయనది వంటింట్లో పీట వేసి కూర్చునే మధ్యతరగతి హాస్యం. సరాసరి వధూవరుల మనస్సుల్లోకి దూసుకుపోతుంది.

ఓసారి నన్నూ, కొమ్మూరినీ పురికొల్పి నవల రాద్దామన్నారు. ఆయనే మొదలుపెట్టారు. ఇడియట్, ముగ్గురం నాడు కలిసి చర్చించలేదు. ఆయన వ్రాసి నాకు అందించాక, నేను వ్రాశాను. అలాంటి ప్రయోగం. ఆ తర్వాత ముందూ ఎవరయినా చేశారేమో తెలీదు. నాకు మొదటి ప్రశంస దాశరధి గారి దగ్గర్నుంచి వచ్చింది.
నార్ల వారు నన్ను, పురాణం వారిని కూర్చోపెట్టి గురజాడ వారి డైరీలు సాపు రాయించారు. అదో అపూర్వమయిన అనుభవం. తర్వాత కన్యాశుల్కం మీదా, గురజాడ మీదా పురాణం కొన్ని వ్యాసాలు వ్రాసినట్టున్నారు.
ఇల్లాలి ముచ్చట్లు అపూర్వమయిన ప్రక్రియ. మధ్యతరగతి జీవితంలోని మాధుర్యాన్నంతా ఆ రచనల్లో పురాణం వారు రంగరించి పోశారు. వేలూరి శివరామశాస్త్రి, శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారిలో కనిపించే తెలుగుదనం నూటికి నూరుపాళ్లు ఆ వ్యాసాల్లో ప్రతిఫలిస్తాయి. శాంతారాంగారు సెల్యూలాయిడ్ మీద తీర్చిన నవరంగ్ రంగుల కావ్యాన్ని కాగితంమీద తీర్చారు పురాణం. నవరంగ్‌ని గుర్తు చేసుకోడానికి కారణం పురాణం యిల్లాలిని నాకు తెలుసు కనుక ఆయన ఇల్లాలి కంటె ఇల్లాలి ముచ్చట్లు మూర్తి ఎత్తయిన మనిషి, పదహారణాల తెలుగుదనాన్ని పుణికి పుచ్చుకున్న సౌందర్య రాశి. ఈ పుస్తకం ఏదో ఉత్తర దేశంలో విశ్వవిద్యాలయంలో పాఠ్యపుస్తకంగా పెట్టారని చదివాను. విశ్వవిద్యాలయం దాకా వెళ్లనక్కర్లేదు. ఇల్లాలి ముచ్చట్లు

శీర్షికే చక్కని విశ్వవిద్యాలయం.
పురాణం వారి జీవనాన్ని పరిశీలిస్తే ఆ రోజుల్లో నీలి వంటి కథలు గుర్తుకొస్తాయి కాని తర్వాత వారపత్రిక సంపాదకత్వం, ఇల్లాలి ముచ్చట్లే మిగులుతాయి. పత్రికలో ఉన్నారు కనుక చాలాసార్లు కుడి ఎడమలకి తిరిగారు కాని, ఆయన ఎన్ని చెప్పినా, ఏం వ్రాసినా ఆయన హృదయం మధ్య తరగతి మనస్తత్వం ఇల్లాలి ముచ్చట్లే చెప్తాయి.

పురాణం వారు చాలా మంది రచయితలకి చెయ్యి అందించారు. చాలామంది భుజం తట్టారు. నిజానికి ఈ కాలమ్ వారపత్రికలో వ్రాయమని నన్ను చాలాకాలం అడుగుతూ వచ్చారు. నా సినిమా జీవితంలో వారంవారం వ్రాయగలనా అని సందేహపడ్డాను. ఈ దినపత్రికలో మొదలుపెట్టడానికి ఆయన, మిత్రులు నండూరి వారే కారకులు. వ్రాయటం ప్రారంభించి 11 ఏళ్లు గడిచాక వారి సంకల్ప బలం ఎంత గొప్పదా అనిపిస్తుంది. నేనూ, సూర్యప్రకాశరావూ ఒక వయస్సు వాళ్లం. నన్ను తట్టి మారుతీరావు అని పిలిచే కొద్దిమంది మిత్రులలో పురాణం ఒకరు.

                                                                                                                                                  గొల్లపూడి మారుతీరావు