Home ఎడిటోరియల్ సంపాదకీయం : జపాన్‌తో కీలక ఒప్పందం

సంపాదకీయం : జపాన్‌తో కీలక ఒప్పందం

Sampadakeeyam-Logoభారత్ – జపాన్‌లు శుక్రవారం సంతకాలు చేసిన పౌర అణుశక్తి సహకార ఒప్పందం, మన దేశ విద్యుచ్ఛక్తి అవసరంలో అణు విద్యుత్ వాటాను గణనీయంగా పెంచే కృషిలో పెద్ద ముందంజ. ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుత జపాన్ పర్యటనలో ఈ ఒప్పందం అత్యంత ప్రధానమైంది. మౌలిక వసతులు, రైళ్లు, రేవుల అభివృద్ధిలో జపాన్ సహకారం వగైరా అనేక ఒప్పం దాలు జరిగినప్పటికీ మోడీ ప్రభుత్వానికి అణు సహకార ఒప్పందమే అత్యం త కీలకం. విశేషమేమంటే, అణు బాంబు దాడికి గురైన ఏకైక దేశం జపాన్ అణు విద్యుత్ వాణిజ్యంలో చురుకుగా పాల్గొంటూ, అణు శక్తి వ్యాప్తి నిరోధక ఒప్పందంపై (ఎన్‌పిటి) సంతకం చేయని భారత్‌తో ఈ ఒప్పందం చేసుకుంది. అణు సరఫరాల గ్రూపులో (ఎన్‌ఎస్‌జి) సభ్యత్వం కొరకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఎన్‌పిటిపై సంత కందారు కాని దేశాలకు ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం పొందే అర్హత లేదన్న క్లాజును ఉపయోగించి చైనా, మరో అరడజను దేశాలు ఆ ప్రయత్యాన్ని అడ్డుకున్నాయి. ఇప్పుడు భారత్‌తో అణు సహకారానికి జపాన్ ముందుకు రావటం భారత్ వాదనకు బలం చేకూర్చుతుంది. అణు శక్తిని శాంతియుత ప్రయోజనాల కే ఉయోగించటం, ముందుగా అణ్వస్త్ర దాడి చేయబోమని స్వయం నియంత్రణ విధించు కోవటం భారత్ వాదనలోని బలమైన అంశాలు. భారత్ ఎన్‌పిటియేతర ప్రతిపత్తి కార ణంగానే జపాన్‌తో ఒప్పందంపై చర్చలు ఫలప్రదం కావటానికి ఆరేళ్లు పట్టింది. 2010 లో యుపిఎ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. భారత్ గనుక అణుపరీక్ష జరిపితే జపాన్ నుంచి అణు సహకార ఆటోమేటిక్‌గా నిలిచిపోతుందన్న క్లాజును – ఒక సంవత్స రం నోటీసుతో నిలిపివేసే రీతిలో తుది ఒప్పందంలో చేర్చారు.
వాతావరణ కాలుష్యం పెరుగుదలను అదుపులో ఉంచే అంతర్జాతీయ కృషిలో పాలు పంచుకుంటున్న భారత్ అణు విద్యుత్ ఉత్పత్తి పెంపుదలను ఒక మార్గంగా ఎంచుకుంది. ఇందుకుగాను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2008లో అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు సహకార ఒప్పందం మన దేశంలో వివాదాస్పదమైంది. అయినా పట్టువిడవకుండా సాగించిన ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతున్నది. 2011లో జపాన్‌లోని ఫుకుషిమా అణు విద్యుత్కేంద్రంలో ప్రమాదం అణు విద్యుత్ కొనసాగింపుపై ప్రపంచ వ్యాప్త చర్చకు దారి తీసింది. అణు విద్యుత్కేంద్రాలను దశలవారీ మూసివే యాలని జర్మనీ నిర్ణయించింది. యూరప్ దేశాలు కూడా ప్రత్యామ్నాయ, పునరుత్పాదక ఎనర్జీపై దృష్టి పెట్టాయి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను లక్ష పెట్టకుండా ముందు కెళుతున్నది. తమిళనాడులోని కుడంకుళంలో రష్యా నిర్మించిన తొలి రియాక్టర్ ఉత్పత్తి ప్రారంభమైంది. రెండోది సిద్ధమైంది, మరో నాలుగు రియాక్టర్లు నెలకొల్పేందుకు ఒప్పందం ఖరారైంది.
కాగా అమెరికాకు చెందిన జిఇ, జపాన్ తోషిబాకు చెందిన వెస్టింగ్ హౌస్, ఫ్రాన్స్‌కు చెందిన అరేవా భారత్‌లో అణు విద్యుత్కేంద్రాల నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చు కున్నప్పటికీ, ప్రమాదాల సందర్భంలో పరిహారం భరించటానికి సిద్ధంకాక ఇంతవరకు ముందుకు రాలేదు. ఆ భారాన్ని భారత ప్రభుత్వం నిర్మాణ సంస్థ అయిన అణు ఇంధన కార్పొరేషన్‌పై పెట్టింది. జపాన్‌కు చెందిన హితాచి లిమిటెడ్, తోషిబా, మిత్సుబిషి కంపెనీ ల్లో అమెరికా, ఫ్రెంచి కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్‌పిటిపై సంతకం చేయ ని దేశాలకు అణు పరిజ్ఞానాన్ని అందించరాదన్న జపాన్ చట్టం ఆ కంపెనీలు భారత్‌లో అడుగుపెట్టటానికి అవరోధమైంది. ఎందుకంటే జపాన్ కంపెనీల నుంచి రియాక్ట ర్లకు సంబంధించిన అనేక భాగాలు సరఫరా అవుతున్నాయి. ఇప్పుడు జపాన్‌తో భారత్ ఒప్పం దం ఖరారుకావటంతో ఆ కంపెనీలు భారత్‌లో అడుగిడే అవకాశాలు మెరుగైనాయి.
అణు సరఫరాల గ్రూపులోని అనేక దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలతో భారతప్రభుత్వం అణు విద్యుత్కేంద్రాల స్థాపనకు తొందరపడుతోంది. అయితే ఈ కేంద్రాలన్నీ దక్షిణాదిలోనే నెలకొల్పాలని నిర్ణయించటం ఆందోళన కలిగించే అంశం. జపాన్‌తో ఒప్పందం ప్రకారం, వెస్టింగ్ హౌస్ నిర్మించే ఆరు అణు రియాక్టర్లు కూడా దక్షిణ రాష్ట్రాల్లోనే నిర్మిస్తారట. భారత ప్రభుత్వం దక్షిణాదిని ప్రయోగశాలగా మార్చనుందా? ప్రజా ప్రతిఘటనను పరీక్షించనుందా?