Home తాజా వార్తలు మళ్లీ ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లి కర్కశత్వం..

మళ్లీ ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లి కర్కశత్వం..

 

దేవరకొండ: బిడ్డ ఏడుపు వింటే ఎలాంటివారైన చలించిపోతారు. అదే కన్నతల్లైతే తల్లడిల్లిపోతుంది. ఎక్కడున్నా సరే వచ్చి తన బిడ్డను అక్కున చేర్చుకుంటుంది. కానీ, ఓ అమ్మ మాత్రం అప్పుడే పుట్టిన పసికందుకు పాలిచ్చేందుకు నిరాకరించి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. వివరాల్లోకి వెళ్లితే.. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో చందంపేట మండలం మోత్య దండాకు చెందిన సావిత్రి ప్రసవించింది. ఆమెకు ఇది పదో కాన్పు. ఇప్పటికే ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు.మరోసారి కొడుకు పుట్టాలని కోరుకుంది. అయితే పదో కాన్పులో మళ్లీ అమ్మాయి పుట్టడంతో పాప ముఖం చూసేందుకు కూడా సావిత్రి ఇష్టపడలేదు. సావిత్రియే కాదు, ఆమె భర్త రాజుతో సహా కుటుంబ సభ్యులెవరు బిడ్డను చూసేందుకు నిరాకరించారు.

అంతేకాదు, పాప గుక్క పట్టి ఏడుస్తున్నా ఆ కసాయి తల్లీ పాలిచ్చేందుకు ముందుకు రాలేదు. బిడ్డ ఏడుపు విని చలించి పోయిన చుట్టుపక్కల వాళ్లు సావిత్రిని మందలించి.. బిడ్డుకు పాలు పట్టాలని చెప్పారు. అయినా కూడా ఆమె వినలేదు. చివరికి వాళ్లే పోతపాలు పట్టి చిన్నారి ఆకలి తీర్చారు. అయితే, ఆ పసికందును గుట్టుచప్పుడు కాకుండా అమ్మేందుకు కూడా వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న ఐసిడిఎస్ సూపర్ వైజర్ వెంకటమ్మ ఆస్పత్రికి చేరుకొని మందలించారు. చిన్నారి కనిపించకపోయినా, ఆమెకేమన్నా జరిగిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో రాజు వెంకటమ్మతో వాగ్వాదానికి దిగాడు. చివరికి పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు.

 

A Mother Refused to breast feed to girl child in Nalgonda