Home కలం ఒక కథారచయిత కథ

ఒక కథారచయిత కథ

SuraMouli

మొదటి రచన మొదలుకొని చివరి రచన దాకా అచంచల, అకుంఠిత భావజాలంతో రచనలు చేసిన అరుదైన రచయిత సురమౌళి (8-12-1935 – 30-3-1995) ఆయన చాలా కథలు రాశారు. కొంత కవిత్వం, ఒకటి రెండు నాటికలు రాసిన మాట నిజం. అయితే ఆ కథలేవీ ఆయన జీవిత కథకు సరితూగవు. చాలా సంవత్సరాల పాటు ఆయన సాహిత్య సర్కిళ్లలో చర్చనీయాంశంగా ఉన్న మాట నిజం. భావజాలాలకతీతంగా అందరి గౌరవాలు పొందిన మాట కూడా నిజం. సామాన్యుల మధ్య సామాన్యునిగానే కాదు, అసామాన్యుల మధ్య అసామాన్యునిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. జీవన క్షేత్రం నుంచి ఒక బాటసారిగా నిష్క్రమించిన తర్వాత మరుపు మరుగున పడిపోయిన సురమౌళిని ఆయన కుమారుడు విప్లవదత్తు సహకారంతో, ‘సురమౌళి కథలు’ (2015) గ్రంథానికి సంపాదకత్వం వహించి ప్రచురించిన సంగిశెట్టి శ్రీనివాస్‌కు సాహితీ లోకం ఎంతో రుణపడి ఉన్నది.
వేములవాడ సమీపంలోని విలాసాగర్‌లో ఒక వైదిక బ్రాహ్మణ కుటుంబంలో సురమౌళి జన్మించారు. 1951లో మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణులై కాలేజీ చదువు నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. సాయం కళాశాలలో చేరి ఇంటర్, ఆ తర్వాత 1955లో బి.ఎ. ఉత్తీర్ణులయ్యారు. ఈ కాలంలో ఆయన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్,స్టేట్ లీగల్ డిపార్ట్‌మెంట్లలో, ఆంధ్ర సారస్వత పరిషత్తులో – క్లర్కుగా, అనువాదకునిగా, హిందీ టీచర్‌గా పని చేశారు. టైపిస్టుగా కూడా పని చేశారు. కాని ఎక్కడా నిలకడలేదు. ఒక సంస్థలో ఇమిడిపోయి పనిచేయటం ఆయన తత్వంలో లేదు. ఆ తర్వాత లా డిగ్రీ సాధించి 1969-72 మధ్యకాలంలో వరంగల్‌లో స్వతంత్రంగా లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. కాని అందులో కూడా కొనసాగలేదు. ఈ కాలంలోనే మిత్ర మండలి సమావేశాల్లో పాల్గొన్నారు. ‘ఆంధ్రభూమి’లో ఉప సంపాదకులుగా, ‘ఆంధ్ర జనత’ దినపత్రికకు సంపాదకులు (1972-75) గా పనిచేశారు. పడాల రాంరెడ్డి మనవి మేరకు ‘లా’ పుస్తకాలు రాసిచ్చారు.
సురమౌళి మీద తొలి దశలోనే గాఢమైన ప్రభావం వేసింది గోరా అని చెప్పుకోవచ్చు. 1950 ప్రాంతాలలో తెలంగాణ ప్రాంతంలో నాస్తిక వాదానికి పెద్దగా ఆదరణ లేదు. వారి సాహిత్యం మాత్రం లభ్యమవుతూ వుండేది. పై చదువులకోసం హైదరాబాద్ వచ్చిన సురమౌళికి నాస్తిక వాదం అందుబాటులోకి రావటం – మొదటి చూపులో ప్రేమ -లాగా ఆ వాదంపట్ల అచంచలమైన విశ్వాసం ఏర్పడటం జరిగింది. నాస్తిక వాదంలో అంతర్గతంగా హేతు జ్ఞానం ఇమిడి ఉంటుంది. దీంతో హేతువాదం మీదకు సహజాతి సహజంగా దృష్టి మళ్లుతుంది. ఈ రెండూ నిజాయితీగా నమ్మిన వారిలో లౌకికవాద భావాలు కూడా చోటు చేసుకుంటాయి. వీటికి అడ్డంకుగా ఉండేది కులం కనుక సురమౌళి కుల నిర్మూలన సంఘాన్ని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఐదారు వందల కులాంతర, మతాంతర వివాహాలు జరిగాయి. సాధారణంగా ఇవి ప్రేమ వివాహాలే. ఈ సంస్థ రాష్ట్ర స్థాయి మహా సభలు 1973లో హైదరాబాద్‌లో జరిగాయి.
సురమౌళి స్వతహాగా సాహిత్యజీవి. నాస్తిక లౌకికవాద భావాలున్న సాహిత్యకారులకు, ఆ రోజుల్లో ‘చలం’ చాలా దగ్గరివాడు. స్త్రీపురుష సమానత్వం, స్త్రీ వ్యక్తిత్వాన్ని గౌరవించటం వంటి భావాలు 20 సంవత్సరాల వయసు నాటికే ఒక సంస్కారంగా ఆయనకు అలవడ్డాయి. చలంపట్ల సురమౌళికి అపారమైన గౌరవం ఉండేదని అంపశయ్య నవీన్ అంటున్నారు. ‘సృజన’ చలం ప్రత్యేక సంచికకు ‘చలం చేసిన తిరుగుబాటు’ అన్న వ్యాసాన్ని రాశారు. స్త్రీ వాదిగా, ప్రేమికునిగా చలం భావజాలాన్ని సురమౌళి సమర్థించారు. ఆధ్యాత్మిక దశ సంగతి ఏమైనా, సమాజం మీద చలం చేసిన తిరుగుబాటు విలువైందనే ఆయన అభిప్రాయం. ఈ వ్యాసం రాసిన 1968 లోనే ‘మలుపులు’ అన్న కథలో వివాహంతో నిమిత్తం లేకుండా, ప్రేమ ప్రమేయం కూడా లేకుండా లైంగిక సంబంధాలు కలిగి ఉండటాన్ని ఆయన సమర్థించాడు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ కథా రంగం ఆసుపత్రి. విధి నిర్వహణే ప్రాణంగా భావించే అందమైన నర్సుపట్ల కథకుడు ఆకర్షితుడవుతాడు. ఇది గ్రహించి ఆమె మరో చోటికి బదిలీ చేయించుకుంటుంది. కథకుడు తన తప్పు గ్రహిస్తాడు. ‘అవును మానవుడు మహోన్నతమైన వ్యక్తే. కాని మానవులలో స్త్రీ మహోన్నత తరము. మహా మహోన్నతమైన వ్యక్తి అంటాడు. ఈ వాక్యాలలో కాల్పనిక ధోరణి ఉన్నా, స్త్రీ ఔన్నత్యాన్ని గ్రహించే నిజాయితీ కూడా ఉంది.
కాళోజీ మిత్రులు రామశాస్త్రి చెప్పిన దాన్ని బట్టి సురమౌళి మొదటి పెళ్లి వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపురంలో జరిగింది. అప్పటికే సురమౌళి నాస్తికులు కావటంతో ఆ పెండ్లికి హాజరైన కాళోజీ రామేశ్వర రావు షాద్ ‘నాస్తికుని పెండ్లి’ అన్న పేరుతో తెలుగులో కథను రాశారు. అయితే ఈ పెండ్లి నిలువలేదు. రెండవ పెండ్లి కూడా కారణాలేమైనా నిలువలేదు. ఈ పెండ్లిళ్ల విచ్ఛిన్నంలో సురమౌళి బాధ్యత ఏమీ లేదు. ఒక ఆదర్శవాదిగా నిలిచారని సన్నిహితులు భావిస్తున్నారు. వ్యక్తిగా సురమౌళి ఎంత ఉన్నతుడో చెప్పటానికి ఈ వివాహాలే నిదర్శనమని భావించే వారున్నారు. శరత్, ప్రేమ్‌చంద్ నవలలలోని కథా నాయకులతో పోల్చ దగ్గవాడేమోననిపిస్తుంది. మూడవ భార్య సక్కుబాయి ‘నా మౌళి- సురమౌళి’ అన్న ఆత్మీయ కథనం (సురమౌళి కథలు) ప్రకారం ‘మొదటి ఇద్దరు భార్యలు వారిని విడిచి వెళ్లి పోయినారు’ “నాకు ఎవరు పిల్లనిస్తారు? నన్ను ఎవ్వరు పెండ్లి చేసుకుంటారు? కులం లేదు, మతం లేదు, ఆస్తిపాస్తులు లేవు. ఇల్లు లేదు. వాకిలి లేదు. దేవుడు లేడు. దయ్యం లేదు” అని దుఃఖ స్వరంతో అన్నారు. ఇది ఆమెను కదిలించింది. పెద్దలు వద్దన్నా, కులాలు వేరే అయినా, సురమౌళి మీది సానుభూతితో ఆమె అతనితో పెండ్లికి ముందడుగు వేశారు. వరంగల్లులో రిజిస్టర్ వివాహం జరిగింది. ఇద్దరు కుమార్తెలు వెన్నెల, వేసవి. ఒక కొడుకు విప్లవదత్తు. పేర్లలో కులమతాల స్పర్శ లేకపోవటం గమనార్హం. వీరివి కూడా కులాంతర వివాహాలే.
సురమౌళి సోషలిస్టు కావటం ఆయన వ్యక్తిత్వంలో మరో కోణం. ఆయన మీద రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్‌ల ప్రభావం వుంది. ‘సురమౌళివల్లే లోహియా కార్యక్రమాలు జరుగుతు న్నాయి’ అని జస్టిస్ పి.ఎ. చౌదరి ఈ వ్యాసకర్తతో ఒకటికి రెండుసార్లు అన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌తో కూడా సురమౌళికి పరిచయాలుండేవి. ఇప్పుడు హోంశాఖామాత్యులు, ఒకప్పటి సోషలిస్టు నాయిని నరసింహారెడ్డి ఆయనకు గొప్ప మిత్రుడు. హైదరాబాద్‌లో సోషలిస్టు పార్టీ పెద్ద దిక్కు బద్రీ విశాల్ పిట్టీ సన్నిహిత మిత్రుడే. రచయితలలో కాళోజీ నారాయణ రావు, నెలనెలా వెన్నెల సి.వి.కృష్ణారావు ఆత్మీయ మిత్రులు. మాజీ ఉప రాష్ట్రపతి కృష్ణకాంత్ ‘సురమౌళి, మై క్లోజ్ ఫ్రెండ్’ అనే వారు. వారు ఇక్కడ గవర్నర్‌గా ఉన్నప్పుడే సురమౌళి మరణించారు. కృష్ణకాంత్ అంత్యక్రియలకు హాజరు కావటమేకాక ఆ తర్వాత సంతాప సభకు కూడా హాజరయ్యారు. సురమౌళిని బాగా అభిమానించిన వారిలో అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న నారాయణ రావు ఒకరు. అనువాదకునిగా సురమౌళికి వున్న అపారమైన అనుభవాన్ని వారు గుర్తించి ఆయనకు అసెంబ్లీలో అనువాదకునిగా ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్‌టి రామారావు వున్నారు. అనువాదకునిగా ఉద్యోగం వచ్చిన తరాత సురమౌళి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఆకాశవాణి హైదరాబాద్ నుండి సురమౌళి ప్రాంతీయ వార్తలు వినిపించిన సంగతి అందరికి తెలిసిందే. దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్లు’ నవలకు నాటక రూపం ఇచ్చి ఆకాశవాణిలో ప్రసారం చేశారు. ఇందులో పట్వారి పాత్ర సురమౌళి పోషించారు.

కరుణశ్రీ రచించిన కింది పద్యం సురమౌళికి చాలా ఇష్టం:
‘ప్రేయసి ప్రేమలోన కనిపించెడి తీయని స్వర్గ మొక్కటే
ధ్యేయము కాదు – హీనులతి దీనులు మ్లానతనుల్ దరిద్ర నా
రాయణులేడ్చు చుండిరి. తదశ్రువుల్ తుడువంగ బొమ్ము నీ
ప్రేయసి తోడ. నీ కట లభించును కోట్ల కొలంది స్వర్గముల్’

ఈ పద్యాన్ని కులాంతర వివాహాల వేదికల మీద, ఇతర సభలలోను సురమౌళి పాడి వినిపించేవారు. ఆ పద్యం ఇప్పటికీ తమ చెవుల్లో గింగురుమంటూనే ఉన్నదని కుల నిర్మూలన ఉద్యమంలో ఆయనతో కలిసి పని చేసిన మిత్రుడు అనంత్ అంటున్నారు. ఉద్యమకారునిగా, సాహిత్య కారునిగా సురమౌళి ముద్ర చెదిరిపోనిది.
( మార్చి 20, సురమౌళి వర్ధంతి)