Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

వరించిన వర్షం

A total of 89.69 lakh acres are cultivated in different crops

ఎగువన, రాష్ట్రంలోనూ సమృద్ధి వర్షాలతో ప్రాజెక్టులు కళకళ, పెరిగిన వరిసాగు
17.31 లక్షల ఎకరాల్లో నాట్లు
మొత్తం 89.69 లక్షల ఎకరాల్లో పంటలు 

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరినాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు మొత్తం 89.69 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో రికార్డు స్థాయిలో 17.31 లక్షల ఎకరాల్లో 74 శాతం మేర వరినాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 12.21 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయ ని వ్యవసాయ శాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ వానకాలం సీజన్‌లో 23.47 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసినప్పటికీ అంచనాలను మించి సాగవుతోంది. పత్తి సైతం 42.49 లక్షల ఎకరాల్లో (అంచనాల్లో 102 శాతం) సాగవుతోంది. మొక్కజొన్న 10.75 లక్షల ఎకరాల్లో వేశారు. మొత్తం ఆహార ధాన్యాల సాగు సాధారణ అంచనాలు ప్రస్తుత సీజన్‌కు 48.50 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 37.88 లక్షల ఎకరాల్లో (78%) వేశారు. ఈ సారి మిర్చి సాగు గణనీయంగా పడిపోయింది.

1.70 లక్షల ఎకరాల అంచనాలకు గాను కేవలం 41 వేల ఎకరాల్లో (24 శాతం) మాత్రమే రైతులు సాగులోకి తెచ్చారు. ఇక సోయాబీన్ 4.21 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 90 శాతంపైన పంటలు సాగయ్యాయి. మొన్నటివరకు పత్తి పంట వర్షాభావ పరిస్థితులతో ఎండిపోయే దశకు చేరుకోగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కుదుట పడిందని, వరికి కూడా అనుకూలిస్తుందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రం మొత్తంమీద ఆదిలాబాద్, వరంగల్ (అర్బన్), మహబూబ్‌నగర్ జిల్లాల్లో అంచనాకంటే ఎక్కువ విస్తీర్ణం సాగులోకిరాగా, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్ తదితర ఐదు జిల్లాల్లో 90% కంటే ఎక్కువ సాగులోకి వచ్చింది. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అంచనాల్లో 70% కంటే ఎక్కువ విస్తీర్ణమే సాగులోకి వచ్చింది. వరిసాగు అన్ని జిల్లాల్లోనూ గతేడాదికంటే సాగువిస్తీర్ణం ఈ సంవత్సరం పెరిగినట్లు వ్యవసాయ శాఖ ఆ నివేదికలో పేర్కొనింది.

గణనీయంగా పెరిగిన పత్తి సాగు : వ్యవసాయ శాఖ ఈ సీజన్‌కు అంచనావేసినదానికన్నా అధికంగా సాగులోకి వచ్చింది. అన్ని జిల్లాల్లోనూ పత్తి సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపించారు. రాష్ట్రం మొత్తంమీద ఈ సీజన్ లో 41.51 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా 42.49 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. గతేడాది 44.20 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ సంవత్సరం ఆగస్టు 16వ తేదీ నాటికి కేవలం 38.13 ఎకరాల్లో మాత్రమే సాగులోకి వస్తున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా సీజన్ మొత్తానికి వేసిన అంచనాకంటే ఇప్పటికే ఎక్కువ విస్తీర్ణం సాగులోకి వచ్చింది. గరిష్టంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 7.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతూ ఉంది. ఆ తర్వాతి స్థానంలో పూర్వ నల్లగొండ జిల్లాలో 6.65 లక్షల ఎకరాల్లో, పూర్వపు వరంగల్ జిల్లాలో 5.76 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది.

5 జిల్లాల్లో అధిక వర్షపాతం : మూడు రోజుల క్రితం వరకు 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా మూడు రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆదిలాబాద్, కొమురంభీం, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాధారణ వర్షపాతంకంటే సగటున రెట్టింపు నమోదైంది. అలాగే మరో 14 జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ పన్నెం డు జిల్లాల్లో (సూర్యాపేట, నల్లగొండ, వనపర్తి, వికారాబాద్, హైదరాబాద్, మడ్చల్, యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు) సాధారణ వర్షపాతంకంటే లోటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ ఆ నివేదికలో స్పష్టం చేసింది.

Comments

comments