Home ఎడిటోరియల్ పెరుగుతున్న ఆప్ ప్రతిష్ఠ!

పెరుగుతున్న ఆప్ ప్రతిష్ఠ!

కేజ్రీవాల్ ధర్నా ఇప్పుడు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదు. ఇది జాతీయస్థాయి ప్రాధాన్యతను సంతరించుకుంది. బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యే క్రమంలో ఇదిమరో ముఖ్యమైన మలుపుగా మారింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం, కేంద్రంలో బిజెపి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒకేసారి అధికారంలోకి వచ్చాయి. వచ్చినప్పటి నుంచి బిజెపి వర్సెస్ ఆప్ ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉంది. బిజెపి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం రాష్ట్రాల అధికారాలను ఆక్రమించుకుంటుందనీ, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని విమర్శించేది. కాని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అవే పనులు చేయడం ప్రారంభమైంది. 

AAP-1

ఇప్పుడు ఢిల్లీలో ధర్నా రాజకీయాలు జరుగుతున్నాయి. ఐఎఎస్ అధికారులు సమ్మె మాని పనులు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన మంత్రులతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటనే ధర్నా చేస్తున్నారు. మరోవైపు బిజెపి కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి ధర్నాలు మాని పనులు చేసి చూపించాలంటూ ధర్నా చేసింది. కేజ్రీవాల్ ధర్నా ప్రారంభించి వారం రోజులు దాటి పోయింది. ఇప్పుడు ఈ ధర్నా వేడి నెమ్మదిగా పెరుగుతోంది. నీతిఅయోగ్ జనరల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రులందరినీ ఆహ్వానించారు. కేజ్రీవాల్ ఆ సమావేశానికి హాజరు కాలేదు. ధర్నాలోనే కొనసాగారు. నీతిఆయోగ్ సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రులు కొందరు కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించారు. నరేంద్రమోడీ కలుగజేసుకుని ఈ సమస్యను పరిష్కారించాలని అన్నారు. మరోవైపు ఆప్, వామపక్షాలు కలిసి భారీ ర్యాలీ తీశాయి.

నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. తమిళనాడు డిఎంకె నాయకుడు ఎం.కె.స్టాలిన్ కూడా కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించాడు. సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్రప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ఫెడరలిజాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా, నితీష్ కుమార్, తేజస్వీయాదవ్ తదితర నాయకులే కాదు, బిజెపిలో అసమ్మతి నేతలు కూడా కేజ్రీవాల్‌కు మద్దతుగా ముందుకు వచ్చారు.

జాతీయస్థాయిలో వస్తున్న మద్దతు చూసిన తర్వాత ఐఎఎస్ అధికారులు ఎప్పుడు లేనిది పత్రికా సమావేశం నిర్వహించి తాము సమ్మె చేయడం లేదని, కేంద్రంపట్ల పక్షపాతంతో వ్యవహరించడం లేదని చెప్పారు. ఈ మాటలు ఐఎఎస్ అధికారులు పత్రికా సమావేశంలో చెప్పవలసి రావడమే అనుమానాలకు కూడా కారణమవుతుంది. నిప్పు లేనిదే పొగరాదన్నట్లు, కేంద్రం పట్ల పక్షపాతంతో వ్యవహరించడం లేదని చెప్పుకోవలసిన అవసరం వారికి ఏమొచ్చిందన్న ప్రశ్న పుడుతోంది. మరోవైపు కేజ్రీవాల్‌కు మద్దతు కూడా పెరుగుతోంది.

ఢిల్లీలో కేజ్రీవాల్ ధర్నా ఇప్పుడు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదు. ఇది జాతీయస్థాయి ప్రాధాన్యతను సంతరించుకుంది. బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యే క్రమంలో ఇదిమరో ముఖ్యమైన మలుపుగా మారింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం, కేంద్రంలో బిజెపి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒకేసారి అధికారంలోకి వచ్చాయి. వచ్చినప్పటి నుంచి బిజెపి వర్సెస్ ఆప్ ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉంది. బిజెపి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం రాష్ట్రాల అధికారాలను ఆక్రమించుకుంటుందనీ, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని విమర్శించేది. కాని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అవే పనులు చేయడం ప్రారంభమైంది. సిబిఐని ఉపయోగించి ఒత్తిడి రాజకీయాలు నడుపుతుందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అనేకమంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను ఏవేవో ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేయడాన్ని ప్రశ్నించడం కొనసాగుతూ వస్తోంది. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అంషు ప్రకాష్ పై దాడికి సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ కేసు విచారణలో ఉంది. విచిత్రంగా ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తికాక ముందే ఐఎఎస్ అధికారులు తమకు రక్షణ కరువైందని అందుకే మీటింగులకు వెళ్ళడం లేదని అంటున్నారు. విచారణ పూర్తికాక ముందే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని అన్నారు. ఆప్ శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే ఒక కార్యక్రమమే నడిచింది. ఇదంతా చూస్తుంటే కేంద్రంలోని బిజెపి ఢిల్లీలోని ఆప్ పార్టీని అణచేయడానికి క్రూరంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయమే కలుగుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇద్దరు కూడా ఆప్ పార్టీని రాజకీయంగా సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం కలిగేలాగే బిజెపి వ్యవహారశైలి ఉంది. ఇది చివరకు కేజ్రీవాల్ కు రాజకీయ విజయంగాను, బిజెపికి అనూహ్యమైన ఎదురు దెబ్బగా మారే సూచనలు కనబడుతున్నాయి.

ఢిల్లీలో ఒక సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించాలని నలుగురు ముఖ్యమంత్రులు నరేంద్ర మోడీని కోరారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నాలేమిటో చెప్పకుండా నలుగురు ముఖ్యమంత్రులపై బిజెపి దాడి చేసింది. ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతివ్వడాన్ని తప్పుపట్టింది. పైగా అర్ధం పర్ధం లేకుండా ఇతర సమస్యలు తీసుకొచ్చి ఇందులో కలగాపులగం చేసే ప్రయత్నం చేసింది. బిజెపి అధికార ట్విటర్ హ్యాండిల్ లో అడిగిన ప్రశ్న ఏమంటే, “అరవింద్ కేజ్రివాల్‌కు మద్దతిస్తున్న ముఖ్యమంత్రులు పంజాబ్ వేర్పాటు విషయంలో రిఫరెండం జరిపించాలని చెప్పిన ఆప్ నాయకుడు సుఖ్ పాల్ ఖైరాకు కూడా మద్దతిస్తారా” అని. ఇది అర్ధం పర్థం లేని ట్వీట్. ఒక సమస్యను మరో సమస్యను కలగాపులగం చేసి అయోమయం సృష్టించాలన్న ప్రయత్నం.

ఢిల్లీ సమస్యలో తమ వైఫల్యాన్ని దాచుకోడానికి ప్రయాసపడ్డం తప్ప మరేమీ కాదిది. ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో ఇలాంటి ఎత్తుగడలతో బిజెపి ఏం సాధిస్తుంది. ఢిల్లీలో ఆప్ పాలనలో అనేక స్కీముల వల్ల ప్రజలు ప్రయోజనాలు పొందారు. ఇప్పుడు తలెత్తిన పరిస్థితి వల్ల తాగునీరు కరంటు సరఫరా వంటి సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించకుండా బిజెపి పంజాబ్ గురించి, పంజాబ్‌లో ఆప్ నాయకుడి పాత వ్యాఖ్యల గురించి మాట్లాడితే ఢిల్లీ ప్రజలు దానిని ఈసడించుకుంటారు. ఈ వాస్తవం తెలియని వారు కాదు బిజెపి నేతలు, కాని బిజెపి ఎత్తుగడ వేరు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రజలకు ఢిల్లీలో తాను వహిస్తున్న పాత్ర ద్వారా సంకేతాలు పంపిస్తోంది. ఈ నలుగురు ముఖ్యమంత్రులు వేర్పాటువాద వ్యాఖ్యలు చేసిన ఆప్ నాయకుడికి మద్దతిస్తున్నారన్న భ్రమను సృష్టించడం ద్వారా రాబోయే సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నిస్తోంది. ఓట్ల కోసం ఇతరులను జాతి వ్యతిరేక శక్తులుగా చిత్రించడం బిజెపికి మామూలైపోయిందనడానికి, అది ఎన్నికల ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్న కాంగ్రెసు ఢిల్లీ విషయంలో వేరే పాట పాడడం గమనార్హం. బిజెపిపై దాడి చేయడానికి దొరికిన మంచి అవకాశాన్ని కాంగ్రెసు వదిలేసింది. ఢిల్లీలో అజయ్ మాకెన్, షీలా దీక్షిత్ మళ్ళీ అధికారం చేపడతారన్న ఆశతో కాంగ్రెసు కేజ్రీవాల్‌కు మద్దతిచ్చే బదులు ఆయనను విమర్శించడం ప్రారంభించింది. ఈ వైఖరి కాంగ్రెసుకు 2019 ఎన్నికల్లో నష్టం కలిగించవచ్చు.

ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెసు కట్టుబడి ఉంటే, ఢిల్లీలో ఆప్ పార్టీతో అవగాహనకు రావడం అవసరం. కర్నాటకలో ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెసు తీసుకున్న నిర్ణయాలు ఎంత ప్రశంసించదగ్గవో, ఢిల్లీలో ప్రతిపక్ష ఐక్యతకు గండికొట్టే దాని వైఖరి అంత ఖండించదగ్గది. కేజ్రీవాల్ కు మద్దతుగా రాహుల్ గాంధీ రెండు మాటలు చెప్పి ఉన్నా ప్రతిపక్షాలకు నాయకత్వ స్థానంలో నిలబడే బలం లభించి ఉండేది.ఇప్పుడు కేజ్రీవాల్ ప్రతిపక్షాల సానుభూతి సంపాదించుకున్నాడు. ప్రజల సానుభూతి సంపాదించుకున్నాడు. సిసి టివి కెమెరాలు వగైరా అనేక విషయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ వైఖరి వల్లనే ఆలస్యం జరుగుతుందన్న అభిప్రాయమే ఇప్పుడు బలపడింది. ఈ అభిప్రాయం సానుభూతిగా కేజ్రీవాల్ కు ఉపయోగపడుతుంది. మోడీపై దాడి చేయడం ద్వారానే 2019 ఎన్నికల్లో తన బలం నిరూపించుకోగలడాయన. 2013, 2015 ఎన్నికల్లో ఆప్ పార్టీ కాంగ్రెసుపై రాజీలేని పోరాటం ద్వారానే ప్రజల్లోకి వెళ్ళగలిగింది. ఇప్పుడు కేంద్రంలోని మోడీపై పోరాటం ద్వారా 2019లో విజయానికి బాటలు వేసుకుంటోంది. ప్రతిపక్షాల ఐక్యతకు కొత్త చిహ్నంగా కేజ్రీవాల్ ఇప్పుడు ముందుకు వచ్చారు. కాంగ్రెసు ఆ మేరకు వెనుకబడింది.