Home ఆదిలాబాద్ ‘ఆశా’ల కలెక్టరేట్ ముట్టడి, ఉద్రిక్తం

‘ఆశా’ల కలెక్టరేట్ ముట్టడి, ఉద్రిక్తం

adilabad2ఆదిలాబాద్ కలెక్టరేట్ : సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన ఆశా వర్కర్లు, పలు రూపాల్లో తమ ఆవేదన వెలిబుచ్చిన ప్రభుత్వం, అధికారులనుంచి స్పందన కానరాకపోవడంతో తమ ఆందోళనను ఉదృతం చేశారు. తమ ఆందోళనను పెడచెవిన పెడుతున్న వైఖరిని ఎండగడుతూ కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బందం చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకే వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్ చేరుకున్న ఆశ కార్యకర్తలు కార్యాలయం రెండు గేట్ల ముందు బైఠా యించి ఉద్యోగులను కార్యాల యంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరకు జడ్పీ మార్గం ద్వారం వద్ద సైతం కార్యకర్తలు కాపుకాసి ఉద్యోగులు లోనికి వెళ్లకుండా చూశారు. నిరసన నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగంణం అట్టుడికిపోయింది. దాదాపు ఆరు గంటల పాటు నిరసన తెలిపిన కార్యకర్తలు అనంతరం కార్యాలయంలోకి వెళేందుకు ప్రయత్నించారు. వీరి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మద్య తోపులాటలు చోటు చేసుకొని పరిస్థితి కొంత ఉదృతంగా మారింది.

తోపులాటలో పలువురు గాయాలపాలయ్యారు. దీంతో పోలీసు సిబ్బంది కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వీరికి సిఐటియు నాయకులు సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో సైతం వైద్యసేవలందిస్తున్న తమపట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తోందని ఆరోపించారు. శాంతియుత మార్గంలో తమ నిరసనను వ్యక్తం చేస్తుంటే అక్రమ అరెస్టులకు దిగడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టిసారించి కనీస వేతనంగా 15 వేల రూపాయలు చెల్లించాలని అప్పటి వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.