Search
Thursday 15 November 2018
  • :
  • :

పరుచూరి మంచి విషయం ఉన్నోడు

Aatagallu Movie Release Date

నారారోహిత్, దర్శన బానిక్ హీరోహీరోయిన్లుగా జగపతిబాబు ముఖ్య పాత్రలో పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆటగాళ్లు’. వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగపతిబాబు మాట్లాడుతూ “ఆటగాళ్లు వంటి సినిమా చేయడం కొంతవరకు రిస్క్. అయినా నిర్మాతలు బడ్జెట్‌కు ఎక్కడా వెనుకాడకుండా సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు. నేను ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం పరుచూరి మురళి. నాతో అతను ‘పెదబాబు’ సినిమా చేశాడు. త్రివిక్రమ్ నాతో ఓసారి మాట్లాడుతూ ‘మురళి మంచి విషయం ఉన్నోడు’ అని చెప్పాడు. అది చాలా గ్రేట్. అందుకే నేను ఈ సినిమా చేశాను. సినిమాలో క్రైం, కోర్టు డ్రామా అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. రోహిత్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ “నేను చేసిన కొత్త జోనర్ చిత్రం ‘ఆటగాళ్లు’. ఇలాంటి చిత్రాన్ని నాతో చేసినందుకు పరుచూరి మురళికి నా థాంక్స్. సాయికార్తీక్‌తో ఇది నా ఏడవ సినిమా. అతని రీరికార్డింగ్ చాలా బాగుంది. విజయ్ విజువల్స్ అద్భుతంగా ఇచ్చారు. గోపి మోహన్ సూపర్బ్ డైలాగ్స్ రాసారు”అని తెలిపారు. పరుచూరి మురళి మాట్లాడుతూ “సీనియర్ డైరెక్టర్‌గా కాకుండా నా తొలి సినిమాలా భావించి ఈ చిత్రం చేశాను. జగపతిబాబు, రోహిత్ స్క్రిప్ట్ నమ్మి నా మీద నమ్మకంతో సినిమా చేశారు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి నా టెక్నికల్ టీమ్ ప్రధాన కారణం”అని పేర్కొన్నారు. నిర్మాతల్లో ఒకరైన వాసిరెడ్డి రవీంద్రనాథ్ మాట్లాడుతూ శుక్రవారం విడుదల చేస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకముందని అన్నారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ విజయ్ సి.కుమార్, రచయిత గోపిమోహన్, నటులు శ్రీతేజ, ఫణి పాల్గొన్నారు.

Comments

comments