Search
Sunday 23 September 2018
  • :
  • :

మ్యాన్ కాదు ‘స్పైడర్‌మ్యాన్’…!(వీడియో)

AB de Villiers Stunning one-handed Catch in IPL 2018

బెంగళూరు: ఐపిఎల్ పదకొండో సీజన్ ఎన్నో అద్భుతమైన ఫీట్లకు వేదికవుతోంది. వైవిధ్యమైన ఫీల్డింగ్‌తో పాటు కళ్లు చెదిరే షాట్లతో ఆటగాళ్లు అలరిస్తున్నారు. మెరుపు వేగంతో కదులుతూ, ఫీల్డర్లు పక్షుల్లా ఎగురుతూ అద్భుతమైన క్యాచులు అందుకుంటున్నారు. ఇక దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎబి డివిలియర్స్ ఫీల్డింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడో అంతే అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తుంటాడు ఎబి. ఐపిఎల్‌లో బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న డివిలియర్స్ గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతమైన ఫీట్‌తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో పట్టిన క్యాచ్ ఐపిఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచుల్లో ఒకటిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

హైదరాబాద్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో ఈ ఫీట్ నమోదైంది. మొయిన్ అలీ వేసిన ఆ ఓవర్ చివరి బంతిని ఓపెనర్ అలెక్స్ హేల్స్ మిడ్ ఆన్ వైపు భారీ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డివిలియర్స్ మెరుపు వేగంతో దూసుకొస్తున్న బంతిని అంతే వేగంగా గాల్లోకి ఎగిరి ఒక్క చేతితో అందుకున్నాడు. కళ్లుమూసి తెరిచేలోగా క్యాచ్ అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు డివిలియర్స్. ఈ క్యాచ్‌పై బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఎబి అందుకున్న క్యాచ్ ఫోటోను పోస్ట్ చేసిన విరాట్ ‘ఈ రోజు స్పైడర్‌మ్యాన్’ను ప్రత్యక్షంగా చూశాను అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిని క్రికెట్ అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Comments

comments