Home జాతీయ వార్తలు అప్పట్లో ఈ ఫోటో ఓ సంచలనం…!

అప్పట్లో ఈ ఫోటో ఓ సంచలనం…!

AB Vajpayee touched the feet of Chinnapillai

న్యూఢిల్లీ: రావణాకాష్టంగా రగులుతున్న కశ్మీర్ సమస్యకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం రూపొందించిన సిద్ధాంతమే అనుసరణీయమని అప్పటి కాల పరిస్థితులు రుజువు చేశాయి. ఈ విషయాన్ని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి బుధవారం ప్రధాని మోడీయే స్వయంగా ధృవీకరించారు. గురువారం సాయంత్రం కన్నుమూసిన వాజ్‌పేయీ కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం, ప్రత్యేకించి పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాలను కొనసాగించడానికి కశ్మీర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రైవేటీకరణ, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమల్లో పెట్టుబడుల ఉపసంహరణ లాంటి చర్యలతో ఆధునిక భారత దేశంలో సంస్కరణలకు ఆద్యుడయ్యారు. ‘స్వర్ణ చతుర్భుజి’ కూడా అటల్ చలవే. ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన వాజ్‌పేయి తమిళనాడు-కర్ణాటకల మధ్య నెలకొన్న జల సమస్యను కూడా పరిష్కరించేందుకుగాను అటల్ ప్రభుత్వమే కావేరీ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఇక శ్రీలంక తమిళుల సమస్య పరిష్కారానికి అడుగులు వేగంగా పడడం మొదలైంది కూడా ఆయన ప్రభుత్వ హయాంలోనే. ఎన్నూరు హార్బర్‌ నిర్మాణం ఆయన ఆలోచనే. మదురై జిల్లాలో గ్రామీణ మహిళాభివృద్ధికి పాటుపడుతున్న నిరక్షరాశ్యురాలు చిన్నపిళ్లైకు 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి పురస్కార్‌’తో సత్కరించింది. ఆ సమయంలో ఆమెకు పురస్కారం అందిస్తూ ప్రధాని అటల్ జి చిన్నపిళ్లైకు పాదాభివందనం చేశారు. అప్పట్లో ఇది సంచలనం రేపింది. ఆ సన్నివేశానికి సంబంధించిన ఫోటో దృశ్యాలు వైరల్ అయ్యాయి.