హైదరాబాద్ : ఎన్టిఆర్, త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి హీరో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఎన్టిఆర్ కొడుకు అభయ్‌రామ్ ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం పూజా కార్యక్రమంలో అభయ్‌రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే తన తనయుడి పాత్ర గురించి ఎన్టిఆర్ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మహేశ్‌బాబు నటించిన నేనొక్కడినే చిత్రంలో మహేశ్ చిన్న నాటి పాత్రలో ఆయన తనయుడు గౌతమ్ నటించారు. అదేవిధంగా ఇటీవల విడుదలైన రవితేజ చిత్రం రాజా దిగ్రేట్లో రవితేజ తనయుడు మహాధన్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్టిఆర్ తనయుడు అభయ్‌రామ్ కూడా తెరపై సందడి చేయనున్నాడన్న వార్తలు వస్తుండడంతో ఎన్టిఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.