Home కలం మనసజీవ తెలుగు భాష

మనసజీవ తెలుగు భాష

telugu

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భాషా సంస్కృతుల్లో కొంత విభిన్నత గోచరిస్తుంది. ఆంధ్రా ప్రాంతంలో బ్రి టిష్‌వారి భాషా ప్రభావా లు, దానికి కొంత తమిళ సంస్కృతులు కలగలిపితే అక్కడొక సంస్కృతి. తెలంగాణ ప్రాంతంలో ముస్లింల పరిపాలన ప్రభావంతో ఉర్దూ అధికార భాష, కొంత పారశీ పద ప్రయోగాలు, ఆ నుడికారాలతో మరో సంస్కృతిగా చోటుచేసుకున్నాయి. అట్లా రెండు ప్రాంతాల్లోనూ విభిన్న సంస్కృతులు పరిఢవిల్లి, నిరక్షరాస్యత కాస్త మిక్కుటంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్నిభాషని, సీమాంధ్రులు వివక్షకు గురిచేశారు. వెక్కిరించారు. ఇది తెలంగాణ ప్రజల గుండెల్లో గాయమై పోయింది. నెహ్రూ గారన్నట్లు “పోకిరి పిల్లగాడు అమాయకురాలైన పిల్లకు మధ్య సంబంధం కలిసింది” కొన్నాళ్ల సంబంధం తర్వాత కూడా ఆ పోకిరీతనాలు పెరిగిపోతుంటే వారి మధ్యన తెగతెంపులయ్యాయి. ఉభయ రాష్ట్రాలేర్పడ్డాయి.
తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లో అచ్చ తెలుగు పదాలు ఎప్పుడూ వాడుకలోనే ఉన్నాయి. ఒక హైదరాబాద్ నగర శివార్లలో మాత్రం ఉర్దూ పదాలు మణి ప్రవాళ భాషగా మారింది. అట్లాగే సీమాంధ్రలో కూడా తెలుగు పదాలు చాలా వరకు మారిపోయాయి. ‘పోవటం’కు బదులు ‘వెళ్లటం’ అన్నారు. ‘విసుర్రాయి’కి బదులు ‘తిరుగలి’ అన్నా రు. బ్రిటిష్ వారి కన్నా ముందు ఆ ప్రాంతాన్ని పాలించిన ముస్లింల పదాల్ని వాడారు. తమాషా, షికారు, పేచీ, మరమ్మత్తు వంటి పదాలు తెలుగువే అన్నంతగా భ్రమించారు. అయితే కేవలం హైదరాబాద్ భాషను మాత్రమే లెక్కలోకి తీసుకొని, మిగతా తెలంగాణ పల్లెల్లోని భాషను పట్టించుకోక, తెలంగాణ మంతటా ఉర్దూ భాషా ప్రభావంతో ఉందని చిన్న చూపు చూశారు. అయితే, తెలంగాణ జానపదుల్లో వాడే భాష అచ్చ తెనుగు భాష. అది వినసొంపుగా ఉంటుంది. దీర్ఘాలు లేని భాషను మాట్లాడుతారు. క్రియాపదాల్లో అనవసరమైన దీర్ఘాక్షరాలు పలుకరు. ‘పోతరు’, ‘వస్తరు’ , ‘తింటరు’ అంటారు. ఇతర ప్రాంతాల్లో లాక్కొని వెళ్లాడు. ‘అంటే’, ‘గుంజుక పోయిండు’ అని , ‘చేరాము’కు బదులు ‘చేరినం’, ‘మాయమయ్యారు’కు బదులు ‘మాయమైండ్రు’ అని, ‘వచ్చాక’కు బదులు ‘వచ్చినంక’, ‘బయలుదేరాము’కు ‘బైలెల్లినం’ అని ‘రానివ్వటం లేదు’కు బదులు, రాణిస్తలేదు. వంటి అందమైన చిన్న చిన్న పదాలే వాడుతారు. తెలంగాణ పల్లెల్లో సంస్కృత పదాల్లోని ప్రాకృత రూపాలు కూడా బాగా మాట్లాడతారు “మా చేసినవులే’ అంటారు. ‘ఇక్కడ ‘మా’ అంటే సంస్కృతంలోని ‘మహా’ అనే పదానికి మారు రూపం. సంస్కృతంలోని ‘అంగము’ అనే పదం నుండి, వచ్చిన పదరూపంగా ‘అంగి’ అని వాడతారు. అదే తెలంగాణేతరులు దాన్ని ‘చొక్కా’ అంటారు. ‘సంచకారి’ అనే సంస్కృత పదాన్ని తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ వాడతారు. దీన్నే ఆంధ్రా ప్రాంతంలో ‘అడ్వాన్స్’ అంటారు. అట్లాగే సంస్కృత పదమైన ‘ఘడియ ఘడియ’కు బదులు తెలంగాణలో ‘గడిగడికు’ అని వాడుతారు.
ప్రాచీన కావ్యాల్లో వాడిన పదజాలం కూడా తెలంగాణలో ఇంకా వుంది. ‘అటెనుక’ లేదా ‘అటెన్క’,‘అటు+వెనుక’గా, ‘నాటగోలె’ ‘నా పొంటె’ వంటి నన్నయ్య వాడిన విభక్తి ప్రత్యాయా లు, తెలంగాణ పల్లె ల్లో ‘గోలె’=‘నుంచి’, ‘పొంటె=వెంట”గా, వాడుకలో ఉన్నాయి. తిక్కన “జాత్యము’గామి నొప్పయిన సంస్కృ త పదాలను తన రచనలల్లో వాడనని అన్నాడు. ఆ ‘జాత్యము’ అనే పదం తెలంగాణలో ఉంది. అదే తిక్కన వాడిన ‘తరాజు’ అనే పదం, శ్రీనాథ పదమైన ‘సామాన్లు’, పెద్దన రాసిన ‘అలకని’ తేలికైన (అదే ఉర్దూలో హల్కా) అన్న పదాలు ఆపద, స్నేహం, స్పృహ, లగ్నం వరుసగా తెలంగాణలో ఆపతి, ఆపద, స్నేహం, సోపతి, సోయి, లగ్గం, వత్తి (బత్తి) వంటి రూపాలను సంతరించుకున్నాయి. పక్క రాష్ట్రమైన తమిళనాడులో ‘అఱై’ అంటే ‘గది’ అని అర్థం. తెలంగాణలో ‘అఱై’ ‘అర్ర’గా మారింది. ఇట్లా తెలంగాణ దేశ్య భాషలో సోదర ద్రావిడ భాషా పదాలకు పోలికలున్నాయి.
తెలంగాణ ది జీవభాష. చదువు రాని వాళ్లనోళ్లలో చక్కగా నానుతున్న బతికించబడుతున్న మట్టి వాసనలున్న భాష. ఆ భాషకు కృత్రిమత్వం లేదు. పూచిన తంగేడు పువ్వంత అందంగా ఉన్న భాష. చద్దుల బతుకమ్మోలె అందంగా ఉన్న భాష. ప్రకృతి అందాన్ని పోలిన భాష. నాద సౌందర్యం కలిగిన భాష. శ్రామికుల సామాజిక జీవనం తొణికిసలాడే భాష. ఆత్మీయత, మమకారం అలుముకున్న భాష. తెలంగాణ పల్లెల్లో మాట్లాడే భాషలో అనుకోకుండా కవిత్వ రూపాలు కూడా యాదృచ్ఛిక మౌతాయి. అవన్నీ ముఖ్యంగా తెలంగాణ స్త్రీలు బతికిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ సామెతల్ని పరిశీలిస్తే ఈ వాస్తవాలు తెలుస్తాయి. ఒక ఇల్లాలు పక్కింటావిడతో మాట్లాడుతూ “ముత్తెమంత పసుపు పెడతవా” అంటుంది. అంటే ఆ అడగడంలో ‘ముత్యాన్ని’ పోలికగా మాట్లాడుతుంది. “పిల్లలు లేనిల్లు పీరీల కొట్టం” అంటారు. పిల్లలే ఇంటికి అందమని చెప్పే సామెత. “తండ్రిబోతె తరంబాయె” అంటారు. “ఆలుమగల లొల్లి అన్నం తినేదాకనే” అడ్డాల నాడు బిడ్దలు కాని గడ్డాలు వచ్చినంకనా” “పుట్టంగ పుత్రులు, పెరుగంగ శత్రులు” “ఆడబిడ్డ అర్థ మొగుడు” “మూడ్రోజులైతే మురికిసుట్టం”, “ఉన్నవాడు ఉట్ల పండుగ లేన్నాడు లొట్ల పండుగ”, “మనోవ్యాధికి మందులేదు”, “ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే”, “ఉపాయం తెల్సినోడు ఉపాసముండడు” వంటి వాక్యాల్లో కవితా రూపాలున్నాయంటే కాదనే వారెవరు? ఇట్లా తెలంగాణా పలుకుబడుల భాషలో స్థానిక సంస్కృతులు, ప్రజాసంబంధాలు ప్రతిబింబిస్తాయి. జీవన వాస్తకవికతలకు అద్దంపడతాయి. అనుభవాలను రంగరించి చూపెడతాయి. శాశ్వత సత్యాలుగా మారిపోతాయి. “వనమిడిసిన కోతి” అంటారు. కోతి అడవిలోనే ఉంటే దానికి స్వేచ్ఛ ఉంటుంది. అక్కడ దానికి తిన్నన్ని పండ్లు, తిరుగాడినన్ని చెట్లు దొరుకుతాయి. కానీ ఆ అడవికి దూరమై ప్రజా సముహాల్లోకి వస్తే మనుషుల బెదిరింపులు ఎదురవుతాయి. భయంభయంగా గడపవలసి వస్తుంది. అట్లాగే మనుషులు కూడా ప్రజల మధ్యే చక్కగా కలిసి ఉండాలని చెప్పేమాట. ‘దంచినమ్మకు బుక్కిందే కూలి’ ‘రాముడున్న కాడనే అయోధ్య’, ‘లంజకిచ్చిన సొమ్ము గోడకు కొట్టిన సున్నం’, ‘చెర్ల నీళ్లు బోయి చెరెన్కబడ్డట్టు’, ‘గడ్డివామి కాడి కుక్క’, ‘కక్క దింటే గారెలు చేదు’, ‘ఇంటింటికీ మట్టిపొయ్యే’, ‘ఇల్లంతా అంగడంగడయింది’, వంటి తెలంగాణ జాతీయాలు ఎన్నైనా చెప్పవచ్చు. తెలంగాణ వాడుక కృత్రిమత్వం కనబడదు. సహజత్వం మాత్రమే ఉంటుంది. అక్కను, అత్తను ‘అక్క’ అనీ, ‘అత్త’ అనీ అంటారు. ఇతర ప్రాంతాల వలె ‘అక్కయ్య’, ‘అత్తయ్య’ అనరు. ఇటీవల ఆడపిల్లలు తమ బాయ్‌ఫ్రెండ్ ఏవేవో కబుర్లు చెబుతుంటే ‘అంతలేదమ్మా’ అంటున్నారు. ఇట్లా స్త్రీ లింగాలకు ‘అయ్య’ను వాడడం, పురుష లింగాలకు ‘అమ్మ’ను వాడడం భాషను చెడగొట్టినట్లువుతుందేమో. ఆలోచించుకోవాలె.తెలంగాణ భాషలో పూర్ణానుస్వారం ఉంటుంది. బాసింగాలు, నాగుంబాబు, చిమ్మంజీకటి, యాసంగి వంటి పదాలుంటాయి. ఈ పూర్ణానుస్వారం, అర్థానుస్వారం మన ప్రాచీన సాహిత్యంలో కనపడుతాయి. సంగీతంలో సరిగమలుంటాయి. అందులోని ‘మ’, ‘మ్’గా మారి సున్నా (ం)గా అవుతుంది. అట్లా సున్నాతో కలుపుకొని మాట్లాడడం వల్ల వాటికి నాద సౌందర్యం ఏర్పడుతుంది. అందుకే తెలంగాణ భాష గానీ, మన ప్రాచీన తెలుగు సాహిత్యంగాని, నాదాత్మకంగా ఉంటా యి. అందుకే పాశ్చాత్యులు తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు’ అన్నారు.
తెలంగాణ భాష సహజసిద్ధమైంది. ప్రాచీనతను సంతరించుకున్నది. శ్రామికులు, స్త్రీలు కాపాడుకుంటున్నది. సంప్రదాయికమైంది. నాదాత్మకమైంది. అది కాళోజీకి తెలుసు. యశోదారెడ్డికి తెలుసు, వానమామలై జగన్నాథాచార్యులకు తెలుసు. ప్రజాసాహితీ కళాకారులకు తెలుసు. వారి వారసత్వాన్ని కాపాడుకుంటున్న నేటి యువతరం కవులను అభినందిద్దాం. ఇప్పుడు జరుగబోతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో మన జానపదానికి పెద్ద పీట వేసి గౌరవించాలని కోరుకుందాం.