Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) మేడ్చల్ జిల్లా రిజిస్టార్ కార్యాయలంలో ఏసిబి సోదాలు

మేడ్చల్ జిల్లా రిజిస్టార్ కార్యాయలంలో ఏసిబి సోదాలు

ACB Officers Raids Continue On Medchal Registrar Office

మేడ్చల్:  మేడ్చల్ జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్.కిషన్‌ప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని వచ్చిన సమాచారం మేరకు ఆయన నివాసం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్‌తో పాటు ఆయన విధులు నిర్వహిస్తున్న మేడ్చల్ జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో ఏక కాలంలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయమే జిల్లా రిజిస్టార్ కార్యాలయానికి చేరుకున్న ఏసిబి అధికారులు కిషన్ ప్రసాద్ కూర్చునే టేబుల్, బీరువాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మేడ్చల్‌లో జిల్లా రిజిస్టార్ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటి నుండి కిషన్ ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా అంతకుముందు ఎల్‌బి నగర్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా రిజిస్టార్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఏసిబి అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు. కాగా ఏసీబి అధికారుల తనిఖీలలో కీలకపత్రాలు స్వాధీనం అయినట్లు సమాచారం. కాగా మేడ్చల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంపైన గతంలో కూడా ఏసిబి అధికారులు తనిఖీలు నిర్వహించడంతో పలుమార్లు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండటంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు రిజిస్ట్రేషన్‌లతో హడావుడిగా ఉండే రిజిస్టార్ కార్యాలయం ఏసిబి అధికారుల సోదాలతో ఎటువంటి హడావుడి కనిపించలేదు.