Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఎసిబి వలలో కొత్తకోట తహశీల్దార్

ACB officers who seized one lakh 50 thousand rupees

ఫుడ్‌పిరమిడ్ దాబాలో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న ఎసిబి
రూ.లక్ష 50వేలు స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు
తహశీల్దార్ అరెస్ట్

మన తెలంగాణ/కొత్తకోట : ఎసిబి వలలో కొత్తకోట తహశీల్దార్ మల్లికార్జున్‌రావు బుధవారం ఉదయం పట్టుపడ్డాడు. రూ.లక్ష50వేలు ఎసి బి అధికారులు స్వాధీనం చేసుకొని తహశీల్దార్‌ను అరెస్ట్ చేశారు. ఎసిబి. డిఎస్‌పి డా.శ్రీనివాసులు వివరాల ప్రకారం అప్పరాల గ్రామం సమీపంలో గల పుల్లారెడ్డి కుంట తాండా సమీపంలో హైద్రాబాద్‌కు చెందిన ప్రదీప్‌కు 9 ఎకరాల భూమి ఉండగా భూమిలో చెర్వు అలుగు మరియు ప్రభుత్వ భూమి ఉందని తహశీల్దార్ సంబంధిత బాధితులను పిలిపించి సమస్య పరిష్కారం కావాలంటే రూ. 4 లక్షల 50 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు తమకు సంబంధించిన 9 ఎకరాల భూమి డాక్యుమెంట్లు న్యాయబద్దంగా ఉన్నాయని డబ్బులు ఎందుకని ప్రశ్నించగా తమపై కేసు చేస్తావాని అని నీవి తప్పుడు డాక్యుమెంట్లను బుకాయించాడు. ప్రదీప్ స్నేహితుడైన సమాచార కమిటీ ఆర్గనైజర్‌గా పని చేస్తున్న రాజ్‌కుమార్ సహకారంతో బంజారాహిల్స్‌లోని ఎసిబి అధికారులను కలిసి డాక్యుమెంట్లతో పాటు తహశీల్దార్ పెడుతున్న ఇబ్బందులను డబ్బు డిమాండ్ వంటి సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. ఎసిబి అధికారుల సూచన మేరకు ఫుడ్ పిరమిడ్ డాబాలో డబ్బులు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులు పట్టుకుని రూ.లక్ష 50 వేలు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ జరిపారు. అనంతరం హైద్రాబాద్ జైలుకు తహశీల్దార్‌ను తరలిస్తున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ఎసిబి డిఎస్‌పి వెంట ఎసిబి అధికారులు రాజేష్, రమేష్‌రెడ్డి, జగన్మోహన్, తదితరులు ఉన్నారు.

పట్టాదారుడు లేనప్పుడు తప్పుడు సర్వే చేశారు : బాధితుడు ప్రదీప్
అప్పరాల గ్రామ సమీపంలో గల పుల్లారెడ్డి కుంట సమీపంలో 7గురు స్నేహితులం కలిసి 42 ఎకరాల భూమిని భాస్కర్‌రెడ్డి అనే మద్యవర్తి ద్వారా కొనుగోలు చేశామని, పట్టాదారుడులేనప్పుడు రెవెన్యూ అధికారులు తప్పుడు సర్వే చేశారని తహశీల్దార్ మల్లికార్జున్‌రావును పట్టించిన బాధితుడు ప్రదీప్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 సంవత్సరంలో భూమి కొనుగోలు చేశామని తమకు సంబంధించిన భూమిని చెర్వు అలుగు మరియు ప్రభుత్వ భూమి ఉందని తప్పుడు సమాచారంతో రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈనెల 7వ తేదీన తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి సంబంధిత డాక్యుమెంట్లను తహశీల్దార్‌కు చూపించిన అవి తప్పని తమపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమస్య పరిష్కారం కావాలంటే రూ.4 లక్షల 50 వేలతో పాటు ల్యాప్‌టాప్, ప్రింటర్, కంప్యూటర్ సిస్టంను ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వారు తెలిపారు. అయితే తహశీల్దార్ పలుమార్లు తమకు ఫోన్ చేసి డబ్బులను త్వరగా తీసుకురావాలని లేకపోతే తమపైకేసు నమోదు చేస్తామని తహశీల్దార్ తెలిపారు. తన స్నేహితునితో ఎసిబి అధికారులను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు.

Comments

comments