Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఎఐ వాటాల సేల్ వేగవంతం

bs

 వచ్చే కొద్ది వారాల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ
 పౌర విమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే

హైదరాబాద్ : అప్పుల ఊబిలో కూరుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(ఎఐ) డిజిన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. వచ్చే కొద్ది వారాల్లో ఆసక్తి చూపే వారిని ఆహ్వానించనున్నట్టు పౌర విమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే తెలిపారు. గురువారం ఇక్కడ ‘వింగ్ ఇండియా 2018’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ హాన్స్‌లో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఆసక్తి చూపిస్తున్న వారిని ఆహ్వానిస్తామని అన్నారు. ‘ఎయిర్ ఇండియా, దీని అనుబంధ సంస్థలు, పవన్ హాన్స్ కొనుగోలుదారులను ఆహ్వానించే పనిలో మంత్రిత్వశాఖ నిమగ్నమైంది. మేము ఈ పనిని వేగవంతం చేయాలని నిర్ణయించాం’ అని చౌబే అన్నారు. వచ్చే వారాల్లో ఎయిర్ ఇండియా సేల్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. పీకల్లోతు అప్పులతో సతమతమవుతున్న ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించే విషయమై గతేడాది జూన్‌లోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాను ప్రభుత్వ నిధులతో నెట్టుకొస్తున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన బృందం ఎయిర్ ఇండియా వాటా విక్రయం కోసం వ్యూహరచన చేస్తుంది.
ప్రతి ఏడాది 26 శాతం వృద్ధి
విమానయాన పరిశ్రమ ప్రతి ఏడాది 26 శాతం వృద్ధితో దూసుకెళ్తోందని చౌబే అన్నారు. పౌర విమానయానంలో ఈ ఏడాది 17.5 శాతం వృద్ధి నమోదైందని, మూడేళ్ల క్రితం దేశంలో 395 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉండేవి.. ప్రస్తుతం వాటి సంఖ్య 900కి చేరాయని అన్నారు. ఉడాన్ పథకంలో భాగంగా 51 విమానాశ్రయాలను డెవలప్ చేస్తున్నామని, వీటిలో 18 విమానాశ్రయాలు ఇప్పటికే తమ ఆపరేషన్స్ ప్రారంభించాయని వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలోమరో వంద పట్టణాలకు ఎయిర్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇంధన ధరలు స్థిరంగా ఉంటే వచ్చే 20 ఏళ్లలో 15 శాతం వృద్ధితో విమానయాన పరిశ్రమ పరుగులు పెడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌లో మార్పులకు అవకాశం ఉందని, టికెట్ ధరలు తగ్గిస్తేనే సామాన్యుడు విమాన ప్రయాణం చేయగలడన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల విమానయాన కంపెనీలు భారాన్ని మోస్తున్నాయని, జిఎస్‌టిలోకి విమానయాన సర్వీసులను తీసుకురావడంతో విమాన పరిశ్రమ వృద్ధిని సాధిస్తుందని అన్నారు.

Comments

comments