Home తాజా వార్తలు ఎంజిఎం శ్కాంలో వైద్యులపై చర్యలు

ఎంజిఎం శ్కాంలో వైద్యులపై చర్యలు

MGM

హైదరాబాద్: వరంగల్‌లోని ప్రభుత్వ ఎంజిఎం ఆసుపత్రిలో ఐదేళ్ళ క్రితం వెలుగుచూసిన భారీ అవినీతి కుంభకోణంలో దోషులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దారిమళ్ళించిన మొత్తాన్ని రికవరీ చేయటంతో పాటు బాధ్యులైనవారిని అరెస్టు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందులో కీలక పాత్ర వహించిన మాజీ వైద్యాధికారి ఒకరిని ఇప్పటికే సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.రాష్ట్ర రాజధానిలోని ఓ ప్రతిష్టాత్మక సంస్థకు ప్రస్తుతం డైరెక్టరుగా వ్యవహరిస్తున్న వ్యక్తికి అప్పట్ల్లో ఈ కుంభకోణంతో సంబంధమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కేసులో తన పేరు లేకుండా మొదటి నుంచి ఆయన పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. సిఐడి పోలీసులు కొన్నిరోజుల క్రితం ఆరు గంటలపాటు ఆయన్ని విచారించినట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే…. వరంగల్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజిఎం) బోధనాసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల వ్యవహారానికి సంబంధించి 2007 నుంచి 2013 మధ్య కాలంలో ఐదున్నర కోట్ల రూపాయల మేరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణ సందర్భంగా అధికారులు గుర్తించారు. ఆసుపత్రికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు, అద్దెల విషయంలో రూ. 5.67 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని, వీటిలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పోలీసులు వెలుగులోకి తెచ్చి 2014లో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో సంబంధముందని భావిస్తున్నవారంతా తమకున్న పలుకుబడితో కేసును ముందుకు సాగకుండా అడ్డుకొన్నారనే ఆరోపణలు అప్పట్లోనే బలంగా వినిపించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విచారణ బాధ్యతను సిఐడికి అప్పగించింది. అప్పటి నుంచి వేగవంతమైన దర్యాప్తు దోషులను గుర్తించి చర్యలు తీసుకునే స్థాయికి చేరుకుంది.
మోసం జరిగిందిలా… :
ఎంజిఎం ఆసుపత్రిలో రోగుల అవసరాల కోసం ఆక్సిజన్ సిలిండర్లను పొరుగుసేవల (ఔట్‌సోర్సింగ్) ద్వారా పొందడం అప్పటి ఆనవాయితీ. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అధికారులు, సిబ్బంది ఈ కుంభకోణానికి తెరలేపారు. పొరుగుసేవల సంస్థతో చేతులు కలిపి బహిరంగ మార్కెటు కంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేశారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఆరు సంవత్సరాల తర్వాత ఈ కుంభకోణాన్ని గుర్తించి, దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఆ ఆరేళ్ళ కాలంలో పనిచేసిన ఏడుగురు ఆసుపత్రి సూపరింటెండెంట్లు 1,53,485 సిలిండర్లను ఆక్సిజన్‌తో నింపడానికి (రీఫిల్లింగ్) అద్దె రూపంలో రూ. 5.67 కోట్లు చెల్లించారు. బహిరంగ మార్కెటు కంటే ఇది వందశాతం అధికమని విజిలెన్సు శాఖ తన నివేదికలో పేర్కొంటూ, సమగ్ర దర్యాప్తుకు ప్రతిపాదించింది. ఈ అవకతవకలతో సంబంధమున్న వారు తమ పలుకుబడితో విచారణ ముందుకు సాగకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. 2008లో ఈ వైద్య సంస్థ సూపరింటెండెంటు డాక్టరు రఘురాం ఆక్సిజన్ కొరత ఉందని అప్పటి జిల్లా కలెక్టరు నుంచి ముందస్తు అనుమతి తీసుకొని టెండర్లు పిలవకుండానే హన్మకొండకు చెందిన తులసి గ్యాస్ ఏజన్సీ కి రూ. 16.82 లక్షలు చెల్లించి 30,570 సిలిండర్లను రీఫిల్ చేయించారు. ఇదే సంప్రదాయాన్ని ఆ తర్వాత వచ్చిన ఆరుగురు మెడికల్ సూపరింటెండెంట్లూ కొనసాగించారు. బహిరంగ మార్కెటు ధరకు రెట్టింపు చెల్లించి ఉద్దేశపూర్వకంగానే ఈ అవినీతికి పాల్పడినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. అయితే కుంభకోణం బయటపడిననాటికే ఆరుగురు ఆసుపత్రి సూపరింటెండెంట్లు పదవీ విరమణ చేశారు. చివరగా ఉన్న ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక కీలక ప్రభుత్వ వైద్య సంస్థలో ఉన్నత పొస్టులో కొనసాగుతున్న డాక్టర్ మాత్రం ఈ వ్యవహారంలో తన పేరు లేకుండా అప్పటి నుంచి అడ్డుకొంటున్నారనే వదంతులు ఉన్నాయి. ఆయన మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన కాలంలో రూ.70 లక్షలు తుల సి గ్యాస్ ఏజన్సీకి చెల్లింపులు జరిపినట్టు గుర్తించిన సిఐడి అధికారులు వరంగల్ పిలిపించి విచారించినట్టు తెలుస్తోంది.
ఎవరెవరు… ఎంతెంత..?
ఈ కుంభకోణంలో ఇప్పటికే దోషులుగా గుర్తించిన సూపరింటెండెంట్ల నుంచి అవకతవకలకు పాల్పడిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కొద్ది రోజుల క్రితం శాఖాపరమైన ఆదేశాలను జారీచేశారు. ఆ ఆదేశాల్లో ఎవరి నుంచి ఎంత మొత్తం వసూలు చేయాలో వివరంగా పేర్కొన్నా రు. కుంభకోణానికి తెరలేపిన డాక్టరు రఘురాం నుంచి రూ. 16.82 లక్షలు, 2008 నుంచి 2009 మధ్య పనిచేసిన మెడికల్ సూపరింటెండెంట్లు వెంకటరాజయ్య నుంచి రూ. 13.59 లక్షలు, 2009 జూన్ నుంచి 4 నెలలు మెడికల్ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టరు సుం దర్ నుంచి రూ. 13.59 లక్షలు, నవంబరు 2009 నుంచి మార్చి 2011 మధ్యకాలంలో పని చేసిన అశోక్ కుమార్ వద్ద రూ. 81.20 లక్షలు, తర్వాత సంవత్సర కాలం పని చేసిన సత్యదేవ్ నుంచి రూ. 88.97 లక్షలు, జూన్ 2012 నుంచి మార్చి 2013 వరకు పనిచేసిన ఏఎన్ ఆర్ లక్ష్మి వద్ద రూ. 58.02 లక్షల చొప్పున వసూలు చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు వెలువడగానే దోషులందరూ తప్పించుకునే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోగా, మరికొందరు ముందస్తు బెయిల్ పొందినట్టు తెలుస్తోంది. వీరిలో ప్రధాన నిందితుడు ఒకరు మాత్రం రెండురోజుల క్రితం విదేశాల నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం దీనిపై దర్యాప్తుతో మరికొందరు ఇంటి దొంగల భాగోతం బయటపడుతుందని అదే శాఖకు చెందిన కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.