Home తాజా వార్తలు వృద్ధ దంపతులకు కెటిఆర్ అభినందన

వృద్ధ దంపతులకు కెటిఆర్ అభినందన

Activities to manage the ashram in public sector

 

మన తెలంగాణ/హైదరాబాద్: మానవసేవయే మాధవ సేవగా భావించి నిర్మించిన వృద్దాశ్రమాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వృద్ద దంపతులు మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మలను టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అభినందించారు. ఆశ్రమాన్ని ప్రభుత్వరంగంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను వృద్దదంపతులు సత్యనారాయణరెడ్డి జానకమ్మలు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామంలో నిర్మించిన మే రెడ్డి సత్యనారాయణరెడ్డి, జానకమ్మ వానప్రస్థాశ్రమాన్ని ప్రభుత్వానికి డొనేట్ చేయనున్నట్లు తెలిపారు. ఎకరంన్నర స్థలంలో ఆరువేల చదరపు అడుగుల స్థలా న్ని సుమారు కోటి రూపాయలతో నిర్మించామని వివరించారు. అయితే వృద్దాప్యం, ఆరోగ్య సమస్యలతో నిర్వహణలో ఇబ్బంది కలగకుండా ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వనున్నట్లు వృద్దదంపతులు కెటిఆర్ తో చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషి, ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమపథకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో వృద్దాశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళం ఇస్తే ప్రభుత్వపరంగా ఎలాంటి ఆధారం లేని వృద్దులకు సేవలందిస్తారనే ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వృద్దదంపతులు కెటిఆర్‌కు చెప్పారు. వృద్దుల నిర్ణయాన్ని కెటిఆర్ అభినందించారు. సేవచేయాలనే ఆలోచన వారిలో ఉండటాన్ని ప్రసంసించారు. అయితే అధికారులతో చర్చించి ప్రభుత్వరంగంలో వృద్దాశ్రమనిర్వహణకు సహకారం అందిస్తానని కెటిఆర్ హామీ ఇచ్చారు. అలాగే జిల్లాకలెక్టర్ అనితారామ చంద్రన్ తో కెటిఆర్ అప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడి వివరాలు చెప్పారు.వృద్ధుల దాతృత్వాన్ని కెటిఆర్ తో పాటు కలెక్టర్ కొనియాడారు. భవిష్యత్‌లో ఆశ్రమ నిర్వాహణకు చట్టప్రకారంగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రభుత్వంతో చర్చించి వృద్దాశ్రమాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకొని వృద్దుదంపతుల కోరిక తీరుస్తానని హామి ఇచ్చారు.

Activities to manage the ashram in public sector

Telangana Latest News