Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

గుండెపోటుతో నటి కల్పన కన్నుమూత

kalpanaనటి ఊర్వశి సోదరి కల్పన (51) సోమ వారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెం దారు. తమిళ, మలయాళ భాషల్లో కమేడియన్‌గా ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాగార్జున, కార్తీ హీరోలుగా పివిపి సినిమా పతాకంపై నిర్మిస్తున్న ‘ఊపిరి’ చిత్రంలో కల్పన మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమెకు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ ఆదివారంతో ముగిసింది. సోమవారం కొంత ప్యాచ్‌వర్క్ చేయాల్సి ఉంది. ఈ చిత్రం షూటింగ్‌తో పాటు ఐఫా అవార్డ్ ఫంక్షన్‌లో కూడా ఆమె పాల్గొనాల్సి ఉంది. ఆదివారం షూటింగ్ ముగించుకొని వెళ్లిన కల్పన నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఇప్పటివరకు 300కు పైగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి అందరినీ అలరించిన కల్పన తన చివరి చిత్రం ‘ఊపిరి’ వరకు నటించి కన్నుమూశారు. ఇక 1980లో నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన కల్పన 2012లో ‘ఎన్‌జాన్ తనిచెల్ల’ అనే మలయాళ చిత్రంలో నటించినందుకుగాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. కమల్‌హాసన్‌తో ‘సతీ లీలావతి’, ‘బ్రహ్మచారి’ చిత్రాల్లో నటించిన కల్పన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. కల్పన ఆకస్మిక మృతి పట్ల ‘ఊపిరి’ యూనిట్ తమ సంతాపాన్ని తెలియజేసింది. ఆమె మరణవార్త తెలుసుకున్న వెంటనే హీరో కార్తీ హాస్పిటల్‌కు వెళ్లి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అక్కినేని నాగార్జున, వంశీ పైడిపల్లి, పివిపిలతో పాటు యూనిట్ సభ్యులంతా హాస్పిటల్‌కు వెళ్లి కల్పన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పివిపి మాట్లాడుతూ “కల్పన చాలా మంచి నటి. మా ‘ఊపిరి’ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఆదివారంతో ఆమెకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. చివరి ఊపిరి వరకు నటిస్తూ ఉన్న కల్పన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రారిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం”అని అన్నారు. ఇక కల్పన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. రమ్యకృష్ణ, సిమ్రాన్, మమ్ముట్టి, నిక్కి గల్రాని, శివ కార్తికేయన్, పృథ్వీరాజ్ సుకుమరన్, జ్యోతికృష్ణ, ఇంద్రజిత్ తదితరులు ఆమెకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
హాస్య నటుడు ఎంఎస్ సతీమణి మృతి…
ప్రముఖ హాస్య నటుడు దివంగత ఎంఎస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఆమె మృతిచెందారు. ఆమె వయసు 63 ఏళ్లు. ఎంఎస్ మరణించి ఏడాది పూర్తయిన రెండు రోజులకే ఆయన ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో కళాప్రపూర్ణ బాధపడుతోంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె సోమవారం ఉదయం తుది శ్వాస విడవడంతో ఎంఎస్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

Comments

comments