Home తాజా వార్తలు జయరాం కేసులో సినీ నటుడు సూర్య అరెస్ట్

జయరాం కేసులో సినీ నటుడు సూర్య అరెస్ట్

మన తెలంగాణ/హైదరాబాద్‌: ఎన్నారై జయరాం హత్య కేసులో సినీ నటుడు సూర్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జయరాం మృతదేహాన్ని చూసినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వని వైనంపై సినీనటుడు సూర్య, కిశోర్, సిరిసిల్లకు చెందిన రియాల్టర్ అంజిరెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జయరాం మేనకోడలికి సైతం హత్య విషయం తెలుసన్న కోణంలో ఆమెను మరోసారి ప్రశ్నించేందుకు పోలీసులు సమాయత్తమ వుతున్నారు. జయరాం హత్య కేసు విచారణ చేపట్టిన ఎపి పోలీసులు రాకేష్‌రెడ్డి , శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కేసును రాష్ట్ర పోలీసులకు బదిలీ చేశారు. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వెస్జ్‌జోన్ డిసిపి, ఎసిపిలు 11 రోజల పాటు దాదాపు 80మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కేసులో కీలక పాత్ర పోషించిన నాగేష్, విశాల్‌లను నిందితులుగా గుర్తించారు. తాజాగా సినీనటుడు సూర్య, కిశోర్, సిరిసిల్లకు చెందిన రియాల్టర్ అంజిరెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని నిందితులుగా చేరుస్తారా? సాక్షులుగా మారుస్తారా? అన్న ప్రశ్నార్థకంగా మారింది. అయితే జయరాం హత్య గావింపబడిన విషయం తెలిసినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు ఉన్నారని వారిని ప్రశ్నించారు. జయరాం హత్య జరిగిన విషయం ముందే తెలిసినా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచిన పోలీసులపై శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జయరాం కేసులో పోలీసుల పాత్రపై అన్ని కోణాలలో దర్యాప్తు చేసిన అధికారులు మరోసారి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.

రాకేష్‌రెడ్డి తన స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ విషయాలను మాత్రమే తనకు ఫోన్లో తెలిపాడని ఎసిపి మల్లారెడ్డి విచారణాధికారులకు తెలిపినప్పటికీ ఆయా విషయాలపై ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో ఎసిపి మల్లారెడ్డి, సిఐలు శ్రీనివాస్, రాంబాబు తెలిపిన విషయాలపై లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా జయరాం మేనకోడలు శిఖాచౌదరి పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే శిఖాచౌదరికి సైతం జయరాం హత్య జరిగిన విషయం తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు గుర్తించారు. పైపెచ్చు జయరాం హత్య గావించబడిన అనంతరం శిఖా చౌదరి నేరుగా జయరాం ఇంటికి చేరుకుని జగ్గయ్యపేటలోని 10 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యూమెంట్లను తీసుకుందన్న ఆరోపణలపై పోలీసులు మరోసారి విచారణ చేపట్టనున్నారు. అలాగే జయరాం హత్య విషయాన్ని గోప్యంగా ఉంచిన శిఖాపై కేసు నమోదు చేయాలని, హత్యలో ఆమె పాత్ర ఉందని మృతుని భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అదేవిధంగా జయరాంను హత్య చేసేందుకు రాకేష్‌రెడ్డి నడిపిన హైడ్రామాలో పాత్ర పోషించిన జూనియర్ అర్టిస్ సూర్యప్రసాద్‌పై కేసు నమోదు చేయన్నుట్లు సమాచారం.

Actor Surya arrested in Jayaram Murder case