Home సినిమా ‘స్వింగ్ జరా’ అంటున్న తమన్నా!

‘స్వింగ్ జరా’ అంటున్న తమన్నా!

Tamannaah

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్ టిఆర్, యువ దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘జై లవకుశ’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా బుధవారం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్  బోర్డు సభ్యులు ఈ మూవీకి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ నిడివి 2 గంటల 35 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది.  ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘జై లవకుశ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుందనే విషయం మనకు తెలిసిందే.

శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ‘స్వింగ్‌ జరా..’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన తమన్నా పోస్టర్ ను చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ సినిమాలో తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం(జై, లవ, కుశ) చేస్తున్నాడు. ఎన్ టిఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ కథనాయికలుగా నటిస్తున్నారు. ఎన్ టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ భారీగా నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు ఇప్పటికే మార్కెట్లో విడుదలై అలరిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.