Home జాతీయ వార్తలు అటల్ భూజల్‌లో 42 మండలాలను చేర్చండి

అటల్ భూజల్‌లో 42 మండలాలను చేర్చండి

Adilabad Re-Organization of new Districts in Telangana

గడ్కరీని కోరిన హరీశ్‌రావు

మనతెలంగాణ/న్యూఢిల్లీ : భూగర్భ జల మట్టాన్ని పెంచడం కోసం కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ‘అటల్ భూ జల్ యోజన’ అనే పథకాన్ని అమలుచేస్తోందని, ఇందులో తెలంగాణలోని 42 మండలాలను కూడా చేర్చాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలను ఎంపిక చేశారని, తెలంగాణలో 42 మండలాలు ‘ఎక్కువ నీటిని తోడేస్తున్న ప్రాంతాలు’గా 2013లోనే కేంద్ర భూగర్భ జల బోర్డు (సమన్వయ విభాగం) గుర్తించిందని,దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభు త్వం 2015 అక్టోబరు 1వ తేదీన రూ. 736. 46 కోట్ల ఖర్చుతో ఈ ప్రాంతాల్లోని 21,235 గ్రామాల్లో కృత్రిమ నిర్మాణాలకు సంబంధించిన నివేదిక సమర్పించిందని హరీశ్‌రావు వివరించారు. తెలంగాణ ప్రాంతంలోని ఎక్కువ భాగం గట్టి రాళ్ళతో కూడినదని, గణనీయమైన మోతాదులో సాగుభూములు భూగర్భ జలంపై ఆధారపడి ఉన్నాయని, భూగర్భ జలం లేనందువల్లనే బోర్లు చాలా లోతుకి వేయాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ‘అటల్ భూ జల్ యోజన’ పథకం కిందికి రాష్ట్రంలోని 42 మండలాలను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

‘ఆకాంక్ష’ జాబితాలోకి మూడు జిల్లాలు చేర్చండి
దేశం మొత్తం మీద 115 జిల్లాలను ‘ఆకాంక్ష జిల్లాలు’గా గుర్తించిన నీతి ఆయోగ్ ఉపరితల మైనర్ సాగునీటి పథకం అమలుకు ఎంపిక చేసిందని, తెలంగాణలోని పూర్వ ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలను చేర్చాలని కేంద్ర మంత్రిని హరీశ్‌రావు కోరారు. ప్రస్తుతం ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలను మాత్రమే నీతి ఆయోగ్ ఈ పథకంలో చేర్చిందని, కానీ పూర్వ జిల్లాల పరిధిలో ఉన్న కొత్త జిల్లాలను చేర్చలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పూర్వ ఖమ్మం జిల్లాను రెండుగా, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలను నాలుగు కొత్త జిల్లాలుగా, పూర్వ వరంగల్ జిల్లాను ఐదు కొత్త జిల్లాలుగా ఏర్పర్చిందని, అందువల్ల పూర్వ జిల్లాల ప్రాతిపదికన వాటి పరిధిలోని కొత్త జిల్లాలను ఈ పథకం కిందికి తీసుకొచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఫలితంగా ఉపరితల మైనర్ ఇరిగేషన్ పనులు జరిగేందుకు సహకరించాలని కోరారు.