Home కరీంనగర్ జోరుగా కల్తీ మద్యం వ్యాపారం

జోరుగా కల్తీ మద్యం వ్యాపారం

adulterated-alcoholగోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కల్తీ మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయని దసరా పండుగ ముందు నుంచి కొనసాగుతున్న ఆరోపణలకు టూటౌన్ పోలీసులు ఆదివారం నిరూపించారు. చీప్ లిక్కర్‌తో బ్రాండెడ్ మద్యం సీసాలను వినియోగదారులకు ఎక్కువగా వినియోగించే మద్యం సీసాలను కల్తీ చేసే నైపుణ్యం గల యువకులు ఈ ప్రాంతంలో వంద మంది వరకు పనిచేస్తున్నట్లు తెలిసింది. సీసాలపైన ప్రభుత్వ వేసే స్టిక్కర్లకు గానీ, మూతలకు గానీ ఎలాంటి ఆటంకం కలుగకుండా మద్యాన్ని కల్తీ చేసే నైపుణ్యం గల యువకులుకు ఈ ప్రాంతంలోని బ్రాందీ షాపుల యజమానులు స్వయం ఉపాధి కల్పిస్తున్నారు. ఒక్క ఫుల్ బాటిల్ మద్యాన్ని కల్తీ చేస్తే రూ.50 చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిసింది. పట్టణ శివారుల్లోని బ్రాందీ షాపుల వెనుక షెడ్లు వేసి కల్తీ దందాను కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క యువకుడు రోజుకు వెయ్యి నుండి రెండు వేల రూపాయల నగదు ఆదాయాన్ని ఈ కల్తీ దందా పేరిట సంపాదిస్తున్నట్లు స్థానికులు వివరిస్తున్నారు. స్థానిక ఎక్సైజ్ అధికారులకు ఈ విషయాలన్నీ తెలిసినా బ్రాందీ షాపుల యజమానులు వారితో అన్ని విధాల సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తున్నందు వల్ల కల్తీ మద్యం వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతున్నది.

ప్రభుత్వం ఎన్ని మార్లు మద్యం విధానాలు మార్చినా గత 30ఏళ్లుగా మద్యం వ్యాపారం చేస్తున్న వారే ప్రస్తుతం దుకాణాలు నిర్వహిస్తున్నారు. లాటరీల పద్ధతి వచ్చినా మరే పద్ధతి ప్రవేశపెట్టినా పర్మినెంట్‌గా కొంత మంది వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి తమ దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు. ఎక్కువ మంది బ్రాందీ షాపుల యజమానులు కాంగ్రేస్ పార్టీకి చెందిన వారైనా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో  ఉన్నా ఈ యజమానులు తమ పలుకుబడితో మద్యం వ్యాపారాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు ఈ వ్యాపారుల మాయాజాలంలో పడిపోతున్నారనడానికి గత అనేక ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారమే ఇందుకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో ఉండటం అధికారుల నిర్లక్షం వ్యాపారుల రాజకీయ పలుకుబడి అన్నీ కలిపి కల్తీ మద్యం కుటీరపరిశ్రమగా మారడానికి దోహదపడుతున్నా యి.

ఆదివారం ఒక్క షాపులోనే 400 బాటిళ్ల కల్తీ మద్యాన్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారంటే ఈ ప్రాంతంలోని దాదాపు 30 షాపుల్లో ఏ స్థాయిలో కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో ఊహించవచ్చు. కేవలం పోలీసు అధికారుల చొరవ వల్లనే ఈ కల్తీ దందా పట్టుబడడంతో ఈ ప్రాంతంలోని కార్మికులు, వినియోగదారు లు కల్తీ మద్యం వ్యవహారంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నా రు. పోలీసు దాడుల సమయంలో కూడా వందలాది మంది స్థానికులు షాపు వద్ద గుమిగూడడం, షాపు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనం కలిగించింది. రూ.500 నుండి రూ.1000 రేటు గల మద్యం సీసాలో సగం వొరిజినల్ మద్యం తీసి సగం చీప్ లిక్కర్, నీటితో కల్తీ చేసి అమ్మడం ఈ ప్రాంతంలో అత్యంత సులువైన వ్యాపారంగా మారింది. కాంగ్రేస్ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల క్రితం జరిగిన ఎక్సైజ్ కుంభకోణంలో అవినీతి బయటపడింది. ఇక్కడి వ్యాపారుల అక్రమాల వల్లనే ఈ వ్యవహారం బయటపడింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ అక్రమ వ్యవహారాలను అరికట్టకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కల్తీ మద్యం వ్యాపారం వల్ల ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్య పరంగాను తీవ్రంగా నష్టపోతున్నారు.