Home ఎడిటోరియల్ శిథిల బాబ్రీపై మోడీ భారత్

శిథిల బాబ్రీపై మోడీ భారత్

Advani Hindutva experiment

 

కంప్యూటర్ యాప్స్ సైతం నేడు కాషాయ రంగు పులుముకుంటున్న రోజులివి. అయోధ్యలో వాస్తవిక పరిస్థితిని కాక, భవిష్యత్‌లో ‘మందిర్ యహీ బనేగా’ ( రామ మందిర నిర్మాణం జరిగేది ఇక్కడే) అని గూగుల్ మ్యాప్స్ మార్కర్ సూచించడంపై ఒమర్ రషిద్ హిందూ పత్రికలో ఒక సంచలనాత్మక కథనం రాశారు. 1992 డిసెంబర్ 6న సంఘ్ పరివార్‌కు చెందిన కరసేవకులు రామమందిరం నిర్మించాలని డిమాండ్ చేస్తూ కూలగొట్టిన బాబ్రీ మసీదు శిథిలాలవైపు ఆ మార్కర్ సూచిస్తున్నట్లు ఆయన తెలిపారు. 1949లో బాబ్రీ మసీదులోకి దొంగతనంగా తీసుకొచ్చిన ‘బాల రాముని’ విగ్రహాన్ని మసీదు శిథిలాలపై నిర్మించిన తాత్కాలిక మందిరంలో ఆ కరసేవకులు ఉంచారు. బాబ్రీ మసీదు కూల్చివేత చారిత్రక ఉపద్రవం జరిగి 26 ఏళ్లు అవుతున్నప్పటికీ, భారతీయ చారిత్రక అనుభవం, ఉనికిలో హింస ఒక మూలాంశంగా మారింది.

బాబ్రీ మసీదులాగా విధ్వంసానికి గురైన మరొక మసీదును మనం చూడకపోయినప్పటికీ, ముస్లిం వ్యతిరేక విద్వేషకాండలో మృత్యువాత పడుతున్న మనుషులను (ముస్లింలు) నేడు చూస్తున్నాం. ప్రభుత్వ పంథాను అనుసరించే విధంగా మీడియా మనల్ని నడిపిస్తోంది. మీడియాలో అతి పెద్ద విభాగం ప్రభుత్వ భావజాల ఎజెండాలో అంతర్భాంగా మారింది. ముఖ్యంగా టివి చానెళ్లు ఈ భావజాల ఎజెండాకు అడ్డాలుగా మారాయి. తమ దారికి అడ్డంగా వచ్చిన వారిని చంపుకుంటూ వెళ్లే మూకల్లో ఆ భావజాల విషం సాధికారత తీసుకురావడం ఒక చారిత్రక విషాదం. బులంద్‌షహర్‌లో ఈ మధ్యకాలంలో జరిగిన మత విద్వేష కాండ అందుకొక సజీవ సాక్షంగా నిలుస్తుంది.

‘ఇందులో (మందిర నిర్మాణ నిర్ణయంలో) ఒక అంగుళం కూడా వెనక్కి తగ్గే అవకామే లేదు’ అని అమిత్ షా కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రామ్‌లల్లా నివసించిన (బాబ్రీ మసీదు ఉన్న స్థలం) దగ్గరే రామ మందిర నిర్మాణం చేసేందుకు బిజెపి కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. రామ జన్మభూమి ఉద్యమం హిందూ మెజారిటేరియనిజం వివృతమవడానికి స్ప్రింగ్ బోర్డులా ఉపకరించింది. హిందువుల్లోని కొందరు జాత్యహంకారులు ముస్లింలపై దాడులు ప్రారంభమైనప్పటి నుంచి పరస్పర చర్చల ద్వారా నెహ్రూవియన్ ఏకాభిప్రాయాన్ని సాధించే సంప్రదాయం దేశంలో అడుగంటింది. అద్వానీ రామ్ రథయాత్రతో రాజకీయ పరిభాషలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హిందూ చైతన్యం పునాదిపై ‘బూటకపు లౌకికవాదం’, ‘మైనారిటీలను బుజ్జగించడం’ వంటి కొత్త భావనలను ప్రచారంలోకి వచ్చాయి. మత విద్వేషం కట్టలు తెంచుకుంది. క్రమంగా ముస్లిం వ్యతిరేక, మైనారిటీలపై దాడులు వివిధ రూపాల్లో తారస్థాయికి చేరుకున్నాము. దాంతో ఇండియా బహుళత్వ సమాజం బీటలుబారింది.

అద్వానీ హిందుత్వ ప్రయోగం విజయవంతమైంది. మందిర నిర్మాణం సజీవంగా ఉంది. పరివార్ లక్షం మరుగునపడింది. బిజెపి దాని మిత్రపక్షాలు మందిర నిర్మాణ సమస్యకు తార్కిక ముగింపు తీసుకురాలేకపోయాయి. భూ వైవిధ్యత, ముస్లిం ప్రజానీకం మద్దతుతో గెలిచిన నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డిఎ) భాగస్వామ్య పక్షాలు, బిజెపికి పార్లమెంట్‌లో మెజారిటీ లేకపోవడం వంటి కారణాల రీత్యా భావజాల ఏకీకరణ సాధ్యం కాకపోవడంతో రామ మందిర నిర్మాణం దశాబ్దాలుగా వాయిదా పడింది. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రామ మందిర నిర్మాణం ప్రతిష్టంభనకు గురయింది. ఆ తర్వాత దశాబ్దకాలం పాటు యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయన్స్ (యుపిఎ) ప్రభుత్వం అధికారంలో కొనసాగినంత కాలం బిజెపి ప్రభ కొంత మసకబారింది. 2013 లో నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం ప్రారంభించినప్పటి నుంచి బిజెపి మళ్లీ జాతీయ స్థాయిలో బలం పుంజుకుంది.

2002 గుజరాత్ అల్లర్లలో ముస్లిం ప్రజానీకం గోధ్రా మారణ హోమానికి, మూకస్వామ్య మారణ కాండకు గురైన నాటి నుంచి మోడీ తిరుగులేని నేతగా ఎదిగారు. ఆ మారణకాండపై మోడీ వెటకారంగా జోకులు వేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమైనాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ‘గుజరాత్ నమూనా’ అభివృద్ధి తీసుకురావడంతో పాటు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రకటించి, యుపిఎ అసమర్థపాలనతో విసిగి వేసారిపోయిన ప్రజానీకాన్ని ఆకర్షించగలిగారు. మరోవైపు అమిత్ షా మత విద్వేషకాండలను రెచ్చగొట్టాడు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ మత విద్వేషకాండతో దేశ వ్యాప్తంగా మెజారిటీ ఓటు బ్యాంకును సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 25 ఏళ్లలో ఒకే పార్టీ ప్రభుత్వం ఏర్పడడం మళ్లీ ఇదే. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధినేత షా ద్వయం దేశవ్యాప్తంగా మైనారిటీలు, దళిత, బహుజన వర్గాలపై గో రక్షణ దళాలు, మోరల్ పోలీసింగ్ మూకలు వగైరా రూపాల్లో మూకస్వామ్య హింస రచనకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ ఎంపిక చేయడం మోఢీ షా ద్వయం రాజకీయ చాణక్యంలో భాగమే. నరేంద్ర మోడీ రాజకీయ నమూనా సంప్రదాయ భారతీయ బహుళత్వ సమాజాన్ని మెజారిటీ ఓటు బ్యాంకులు సంఘటితమయ్యే స్వభావాన్ని సంతరించుకున్నది.

1990లో అద్వానీ రామ్ రథ యాత్రతో ప్రారంభమైన మత సామరస్య విధ్వంసం మోడీ హయాంలో మత విద్వేషకాండలు పెచ్చరిల్లడంతో పరాకాష్ఠకు చేరాయి. సమాజంలో మెజారిటీ సమూహ ఆధిపత్య రాజకీయాలతో భయం ఆవహించింది. మోడీ, అమిత్ షా ఆదిత్యనాథ్‌లు విద్వేష వాతావరణాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తున్నారు. చివరికి మెజారిటీ ప్రజానీకాన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ సహా, జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ పడరాని పాట్లు పడుతున్నాయి. ఎన్నడూలేని రాహుల్ గాంధీ తన బ్రాహ్మణ అస్తిత్వాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. విచిత్రమేమంటే రామ మందిరాన్ని తామే నిర్మిస్తామని బిజెపి కాదని రాహుల్ గాంధీ కీలక సలహాదారు ఇటీవల మాట్లాడటం దేశ రాజకీయాల దుస్థితి ఎలా దిగజారిందో అర్థమవుతోంది. రాజకీయ పార్టీలు లౌకిక వాద భావాలను వ్యక్తం చేయడం దాదాపుగా మానుకున్నాయి. కూలగొట్టిన బాబ్రీ మసీదును పునర్నిర్మిస్తామని ఏ పార్టీ అయినా నేడు ప్రకటన చేయగలదా? అక్కడ కాకపోతే అయోధ్యలోగాని, దేశంలో మరెక్కడైనా కట్టించగలదా? ఏ పార్టీ అలాంటి ప్రకటన చేయలేదు.

మసీదు, ముస్లింలు అనే పదాలు బహిరంగ సంబాషణల్లో నిషేధానికి గురయ్యాయి. బిజెపి 1991 ఎన్నికల ప్రణాళికలో బాబ్రీ మసీదును మరొక చోట గౌరవ ప్రదంగా నిర్మించగలమని ప్రకటించింది. బిజెపి లేదా ఏ ఇతర పార్టీ నేతగాని, మసీదు నిర్మానం గురించి ప్రస్తుతం హామీ ఇచ్చేందుకు సాహసించగలడా? మోడీ ఇండియా ముస్లిం మేధావులను కలిసినందుకు రాహుల్ గాంధీని అంతటి వాడినే తప్పుపడుతోంది. అందుకు ప్రతిస్పందనగా తన తాత నెహ్రూ ముందుకు తెచ్చిన అద్భుతమైన, సమ్మితమైన, బహుళత్వ దృక్కోణాన్ని చేపట్టకుండా తననొక జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుడిగా ప్రజలు పరిగణించేందుకు రాహుల్ గాంధీ పడరాని పాట్లు పడుతుండడం విడ్డూరం.

ప్రతిపక్షాలు లౌకికవాదాన్ని విసర్జించిన నేపథ్యంలో దేశంలో మత విద్వేష విషం వేగంగా విస్తరిస్తోంది. వ్యవసాయం సంక్షో భం కారణంగా దశాబ్ద కాలంలో మూడు లక్షల మంది ఆత్మహత్యలను పరిష్కారాలుగా ఎంచుకున్న స్థితి నుంచి నేడు తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు ఆందోళనల బాటపట్టాయి. న్యూఢిల్లీలో లక్షల మంది రైతు లు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల నిరసన మార్చ్ నిర్వహించిన దానికి ప్రతిగా హిందుత్వ శక్తులు రామమందిర నిర్మాణాన్ని చే పట్టేందుకు పార్లమెంట్‌లో చట్టం చేయాలని పట్టుబట్టడం విడ్డూరం. సా ర్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెజారిటీ ఓటు బ్యాంకును సంఘటితం చేసే లక్షంతో మళ్ళీ రామ మందిర నిర్మాణ సమస్య తెర మీదకు రాబోతోంది. బిజెపి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు రామ మందిర పునాదులు ఈసారి ఏ మేరకు ఉపకరిస్తాయో వేచి చూడాలి!

Advani Hindutva experiment was successful

Telangana Latest News