Home అంతర్జాతీయ వార్తలు ఐదు రోజుల కస్టడీకి అగస్టా దళారీ

ఐదు రోజుల కస్టడీకి అగస్టా దళారీ

 Christian Michel Image

 

న్యూఢిల్లీ : వివిఐపి చోపర్ కేసులో దళారి అయిన క్రిస్టియన్ మైకెల్‌ను ఐదు రోజుల కస్టడీకి తరలించారు. రూ 3600 కోట్ల విలువైన అగస్టా వెస్ట్‌లాండ్ ప్రముఖుల విమానాల కొనుగోళ్లలో ముడుపు అందాయనే ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. దళారిగా ఉన్నట్లుగా భావిస్తున్న మైకెల్‌ను యుఎఇ అధికార యంత్రాంగం విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించింది. ఈ దశలో బుధవారం ఆయనను స్థానిక కోర్టులో హాజరుపర్చారు. ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఆయనను అనుమతిస్తున్నట్లు సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ప్రకటించారు. అంతకు ముందు మైఖెల్ తన న్యాయవాదులతో ఐదు నిమిషాల పాటు మాట్లాడేందుకు సమ్మతించారు. మైఖెల్‌ను ఐదు రోజుల సిబిఐ కస్టడీ తరువాత తిరిగి కోర్టులో హాజరు పరుస్తారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా అగస్టా ముడుపుల వ్యవహారం మారింది.

ఆయన బ్రిటన్ జాతీయులు. యుఎఇలో ఉన్న ఆయనను విచారణ ప్రక్రియకు భారత్‌కు అప్పగించడం కీలక విషయంగా మారింది. ఆయనను జుడిషియల్ కస్టడీకి తరలించాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ఆయనను తమకు 14 రోజుల కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరింది. ఈ స్కామ్‌లో డబ్బుల లావాదేవీలు, ముడుపుల వివరాలను రాబట్టడానికి ఐదు రోజుల కస్టడీ చాలదని సిబిఐ తెలియచేసుకుంది. దీనిని తిరస్కరించిన న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. ముడుపుల కేసుకు సంబంధించి మైకెల్‌కు ఛార్జీషీట్‌తో పాటు సంబంధిత అన్ని డాక్యుమెంట్లను అందించాలని కోర్టు ఆదేశించింది.

ఇక మైకెల్ తరఫున దాఖలు అయిన బెయిల్ దరఖాస్తుపై ఎప్పుడు విచారణ జరుగుతుందనేది న్యాయస్థానం వెల్లడించలేదు. పటియాలా హౌజ్ కోర్టు ఆవరణలోని న్యాయస్థానానికి నిందితుడిని తీసుకువస్తున్న సందర్భంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి 54 సంవత్సరాల మైకెల్ స్థానిక ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానంలో చేరుకున్నారు. వెంటనే సిబిఐ వర్గాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి.

 

Agusta Westland Chopper Scam: Christian Michel Custody,Michel’s advocate asked the court to send him to judicial custody,