Home ఆంధ్రప్రదేశ్ వార్తలు చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్ధతు

చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్ధతు

Rahulఢీల్లీ : ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఢిల్లీలోని ఎపి భవన్ లో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. ఎపి ప్రజలకు ఇచ్చిన హామీలను మోడీ మరిచిపోయారని, మోడీకి విశ్వసనీయత లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని రాహుల్ దుయ్యబట్టారు. ఎపి దేశంలో భాగం కాదన్నట్టుగా మోడీ వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ ఎక్కడికి వెళితే, అక్కడి పాట పడుతారని రాహుల్ విమర్శించారు. ఎపి ప్రజల సొమ్మును దోచి అంబానీకి ఇచ్చారని ఆరోపించారు. ఎపి ప్రజలకు అండగా ఉంటామని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ స్పష్టం చేశారు. చంద్రబాబు దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా మధ్దతు  తెలిపారు.  భారత ప్రభుత్వం  ప్రత్యేక హోదా హామీ పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిందేనని మన్మోహన్ వెల్లడించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఎన్ డిఎ ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.  విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని ఆయన గుర్తు చేశారు. ఎపికి ప్రత్యేక హోదా సాధించేందుకు చంద్రబాబు చేస్తున్నపోరాటానికి తమ మద్ధతు పూర్తిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు దీక్షకు జమ్ముకశ్మీర్‌ మాజీ సిఎం ఫరూక్‌ అబ్దుల్లా , పశ్చిమ బెంగాల్‌ సిఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ , సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌లతో పాటు దేశంలోని పలువురు విపక్ష నేతలు మద్ధతు ప్రకటించారు.

AICCC Chief Rahul Comments on PM Modi