Home ఎడిటోరియల్ అయిన కాడికి ఏర్ ఇండియా అమ్మకం?

అయిన కాడికి ఏర్ ఇండియా అమ్మకం?

Economic & Political Weekly జులై 15 సంపాదకీయం

Air-India-Cartoon

ఏర్ ఇండియా సంస్థను ఈ దశలో అమ్మడం ఎందుకు? 2012లో ఏర్ ఇండియా పుంజుకోవడానికి ప్రణాళిక రూపొం దించారు. ఆ ప్రణాళిక పూర్తి కావడానికి మరో ఐదేళ్ల గడువున్నప్పుడు అమ్మడం ఎందుకో అర్థం కాదు. 2016-17 ఆర్థిక సర్వేలో ‘నిరంతరం నష్టాలు తెచ్చే సంస్థ’ అని అన్యాయమైన వ్యాఖ్యచేసి దీన్ని ప్రైవేటీకరిస్తామని చెప్పారు. ఏర్ ఇండియాను ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సూచించిన తర్వాత, ఈ ప్రభుత్వ విచిత్ర పనితీరు వల్ల మంత్రివర్గ సంఘం ‘సూత్రప్రాయంగా’ ఏర్ ఇండియాను ప్రైవేటీక రించడానికి అంగీకరించింది. ఈ ఆమోదం తెలిపేముందు ఈ సంస్థతో సంబంధం ఉన్న వారిని ఎవరినీ సంప్రదించకుండాగానే తొందరపడి నిర్ణయం తీసుకున్నారు. మరోవేపున ‘పారిశ్రామిక అశాంతి’ నెలకొంటుం దని ఏర్ ఇండియా కార్మికసంఘాలు హెచ్చరించాయి.
ఈ జతీయ ఏర్‌లైన్స్ సంస్థ ఇతర సంస్థలలాగే నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది. నిలదొక్కుకోవడానికి 2012లో పదేళ్లు అమలులో ఉండే ప్రణాళిక రూపొందించారు. ఇంకా అయిదు సంవత్సరాల గడువు ఉంది. నిర్వహణలో ఏర్ ఇండియా సంస్థ లాభాల బాట పట్టింది. 2015-16లో నికర నష్టాలు తగ్గాయి. ఈ సంస్థకు ఇచ్చిన ప్యాకేజీ ఫలితాలు ఇస్తున్న దశలో, అందునా దాని అధీనంలో ఉన్న ఏర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ లాభాలు గడిస్తున్న తరుణంలో ప్రైవేటీకరించాలని సంకల్పించారు. ఈ రెండు సంస్థలు 2016-17లో మంచి పనితీరు కనబరిచాయి. ఏ విమానయాన సంస్థకైనా ఉన్న సీట్లు నిడుతున్నాయా లేదా అన్నది కొలమానం. గత అయిదేళ్ల కాలంలో ఈ విషయంలో ఏర్ ఇండియా పని తీరు క్రమంగా మెరుగుపడింది. అదే సంవత్సరంలో భారత పౌర విమాన యాన రంగం కూడా పదేళ్ల కష్టకాలం తర్వాత పుజుకుంది. ప్రయాణి కుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందువల్ల ఏర్ ఇండియా పౌర విమానయాన రంగంలో దశాబ్ద కాలంలో మూడవ అతి పెద్ద సంస్థగా అవతరించబోతోంది. పరిస్థితి ఆశాజనకంగా ఉంది. వచ్చే ఏడాదికల్లా వార్షిక స్వదేశీ ప్రయాణికులే 100 మిలియన్లకు చేరతారని అంచనా. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకన్నా భారత్ లో పౌరవిమానయాన పరిస్థితి కచ్చితంగా మెరుగ్గా ఉంది. పౌరవిమానయాన రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల పరిమితులను సడలించారు. విమాన యాన సంస్థల్లో 100 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడు లు అంగీకరిస్తు న్నారు. ఇలాంటి స్థితిలో మహారాజాను (ఏర్ ఇండియా చిహ్నం) ప్రైవేటీకరించాలని నిర్ణయించడం అంటె ఆ సంస్థ పుజుకుంటున్న వాస్తవాన్ని విస్మరించడమే. ప్రైవేటీకరణకు అనుకూలమని చెప్ప డానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం జాతీయ విమానయాన సంస్థను అయినకాడికి అమ్మేయాలని చూస్తోంది.
ఏర్ ఇండియా ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది కనక, నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది కనక ఆ సంస్థను ప్రైవేటీకరించక తప్పదని నమ్మించా లని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిజానికి ఈ నిర్ణయం సిద్ధాంత పరమైంది. ఇది కొందరు ప్రైవేటు నిర్వాహకులకు లాభం చేకూరుస్తుంది. ఏ దృష్టితో చూసినా ఇది ఏర్ ఇండియా సంస్థకు, ఆ సంస్థలో పని చేసే సిబ్బందికి ప్రయొజనకారి కాదు. ఈ నిర్ణయం ఈ రంగానికే ముప్పుగా మారవచ్చు. ప్రయాణీకులకు కూడా నష్టమే.
సవ్యంగా పని చేయని సంస్థ ఏర్ ఇండియా ఒక్కటే కాదు. ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కున్నాయి. కొన్ని సంస్థలైతే కింగ్ ఫిషర్ ఏర్ లైన్స్ కన్నా ఎక్కువ సమస్యలే ఎదుర్కున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాలు అనుసరించడం మొద లైన తర్వాత అనేక ప్రైవేటు విమానయాన సంస్థలు అవత రించాయి. వీటిలో 23 సంస్థలు తమ వ్యాపారాన్ని మూసుకోవడమో లేదా ఇతర సంస్థల్లో విలీనం కావ డమో, అంతిమంగా వాటినీ మూసేయడమో జరిగింది. అయినా పని చేస్తున్న విమానయాన సంస్థలకు గత దశాబ్దంలో నష్టాలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుధర తగ్గే దాకా విమానయాన సంస్థలు ఇబ్బందులు పడ్డాయి. విమానాలకు వినియోగించే ఇంధనం ఖరీదైంది కావడమే దీనికి కారణం. అది గాక ఈ విమానాల సామర్థ్యం ఎక్కువ అయినందువల్ల పరిమితంగా ఉన్న ప్రయాణీకులను ఆకట్టు కోవడానికి పోటీ పడాల్సి వచ్చింది. ఏర్ ఇండియా సంస్థ ఎన్నడూ లాభసాటిగా లేదని, ఇక మీదట కూడా లాభసాటిగా ఉండదని, అసమర్థ నిర్వహణే దీనికి కారణం అని చెప్పడం కేవలం అతిశయోక్తే. విమాన యాన సంస్థలు ఆర్థికంగా బలంగా లేనందువల్ల, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బుతో నడిచే ప్రభుత్వరంగ సంస్థలు లాభసాటిగా ఉండవని చేసే వాదనలే దీనికి కారణం. గత పదిహేనేళ్ల కాలంలో జాతీయ విమానయాన సంస్థలకు 111విమానాలు కొన్నారు. ఈ కొనుగోలుపై దర్యాప్తు జరుగుతోంది. స్వదేశీ విమానయాన సంస్థ అయిన ఇండియన్ ఏర్‌లైన్స్‌ను 2007లో అస్తవ్యస్తమైన రీతిలో ఏర్ ఇండియాలో విలీనం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ఏర్ ఇండియా రుణభారం విపరీతంగా పెరిగిపోయింది.
ఏర్ ఇండియా సంస్థను అమ్మేయడానికి ముందు ఆ సంస్థ రుణాల లో కొంత భాగాన్ని అయినా ప్రభుత్వం రద్దు చేయక తప్పదు. ఆ సంస్థకు ఉన్న ఆస్తులను విక్రయించి కొంత అప్పు తీర్చవచ్చు. రుణాలను వాయిదా వేయవచ్చు. ప్రైవేటీకరించకుండానే ఈ పనులన్నీ చేయవచ్చు. ఎందు కంటే ఏర్ ఇండియా సంస్థ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏర్ ఇండియాకు అప్పులు తీర్చుకునే, వడ్డీలు చెల్లించే అవకాశం ఇవ్వాల్సిందే. ప్రభుత్వరంగ బ్యాంకులకు అపారంగా బాకీపడ్డ ప్రైవేటు సంస్థలకు కూడా ఈ సదుపాయం కల్పిస్తు న్నారు. తన లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఏర్ ఇండియాకు ఈ అవకాశం ఇవ్వాలి. ఈ సంస్థలో సిబ్బంది నియామక సమస్యను కొంత మేరకు పరిష్కరించారు. కాని సేవలు అందించడం, నాణ్యంగా పని చేయడం లాంటి విషయాలు చాలా మెరుగు పడాల్సి ఉంది. ఉన్నత ప్రమాణాలు గల సేవలను సమర్థవంతంగా అందించాలంటే ఏర్ ఇండియా సంస్థ తమ సిబ్బందిపై పెట్టుబడి పెట్టాల్సిందే.
ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలాగే ఏర్ ఇండియా సంస్థ విపరీత మైన పోటీ ఉండే వ్యవస్థలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మార్కెట్‌లో కొన్ని సంస్థలకే మార్కెట్ వాటా ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న, మొత్తం మార్కెట్ లో ఉన్న విమా నాల్లో 31 శాతం విమానాలున్న, ప్రపంచ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో ముఖ్యమైన స్లాట్లు ఉన్న సంస్థను ప్రైవేటీకరించడమంటే ఇదివరకే గుత్తాధిపత్యం చెలా యిస్తున్న ప్రైవేటు సంస్థలను మరింత బలోపేతం చేయడమే. ఇది పోటీ లేకుండా చేస్తుంది. పోటీ ఉండే చోట ఇంతభారీ ప్రభుత్వరంగ సంస్థలు ఉండడం వాంఛనీయమే కాదు అత్యవసరం కూ డా.

(ఇ.పి.డబ్ల్యు. సౌజన్యంతో)