Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఎయిర్ ఇండియాను బలోపేతం చేస్తాం

bs

 వాటాల విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
 యాజమాన్యం ప్రణాళికను సిద్ధం చేస్తోంది
 కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(ఎఐ) పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విమాన సంస్థను సమర్థవంతంగా నడిపేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఎయిర్ ఇండియా విక్రయం విఫలమైన తర్వాత వారం రోజులకు కేంద్రం ఈ విధంగా స్పందించింది. ఎయిర్ ఇండియా భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. భారీ అప్పులు, ఇతర పాత సమస్యలతో ఎయిర్ ఇండియా సతమతమవుతోందని అన్నారు. అయితే ఎఐ వాటాల విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రస్తుత పరిస్థితులు, ఇతర అంశాల పరిశీలించిన మీదట ఓ అంచనాకు వస్తామని విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. అయితే ఎయిర్ ఇండియా విక్రయం ఇప్పట్లో లేనట్లేనని, ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇది సరైన సమయం కాదని ప్రభుత్వం భావిస్తోందని మంగళవారం కొందరు అధికారులు చెప్పినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఎఐలో 76 శాతం వాటాలను విక్రయించాలని నిర్ణయించినా.. మే 31వరకు కొనుగోలు చేసేందుకు ఏ సంస్థ ముందుకురాలేదని సిన్హా తెలిపారు. అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించిన తర్వాత ఓ స్పష్టత వస్తామని, ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఎయిర్ ఇండియాకు అండగా నిలిచి, బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. కాగా ఎఐలో వాటాలను విక్రయించేందుకు తొందరపడొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఓ అధికారి చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఎయిర్ ఇండియా వాటా విక్రయం ఇప్పట్లో ఉండబోదని, సంస్థలో నిర్వహణ లాభాలు ఉన్నాయని, ఏ విమానం ఖాళీగా వెళ్లట్లేదని ఆ అధికారి తెలిపారు. ఈ లాభాలతో ఎయిర్‌లైన్ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని నిర్ణయించామని, అందుకే వాటా విక్రయం ఇప్పట్లో అవసరం లేదని ప్రభుత్వం భావించిందని అధికారి తెలిపారు.

Comments

comments