Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎయిర్ ఇండియా వేలం విఫలం

bsns

గడువు ముగిసింది.. ఒక్క బిడ్ రాలేదు

ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం ఆలోచన బెడిసికొట్టింది. ఆఖరి రోజైన మే 31 వరకూ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పెద్దమొత్తంలో బిడ్లు  వస్తాయని ఆశించిన ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బేనని చెప్పాలి. బిడ్‌లు వేసేందుకు సంస్థల నుంచి  కనీస స్పందన కరువైంది. ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు బిడ్డర్లనుంచి ఎలాంటి స్పందనా రాలేదనీ, తదుపరి చర్యలను త్వరలోనే నిర్ణయిస్తామని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అప్పులు పెరిగి ప్రభుత్వ నిధులతో పని నడిపిస్తున్న ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. బిడ్డింగ్‌లకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించింది. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు తొలుత పలు ప్రైవేటు విమాన సంస్థలు ముందుకొచ్చినా.. నిబంధనలు చూసి బెంబేలెత్తిపోయాయి. తాము కొనుగోలు చేయబోమంటూ వెనక్కి తగ్గాయి. ఆ తర్వాత ఎయిర్ ఇండియా బిడ్డింగ్‌కు గడువును మే 14 నుంచి 31 వరకు పొడిగించారు. గురువారంతో గడువు ముగిసినా ఇప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. ఎయిర్ ఇండియాను ప్రయివేటీకరించాలనే ప్రభుత్వం ఆలోచన విఫలమైంది. క్రితం రోజు ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే స్వయంగా మీడియాకు తెలిపారు. అయితే మళ్లీ గడువును పొడగించాలనుకోవట్లేదని ఆయన స్పష్టం చేశారు. మొదట్లో జెట్‌ఎయిర్‌వేస్, ఇండిగో, టాటా లాంటి సంస్థలు ఎయిర్ ఇండియాలో వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించాయి. అయితే వాటా విక్రయంపై ప్రభుత్వం విధించిన నిబంధనలు వాటికి నచ్చలేదు. వాటా కొనుగోలు అనంతరం ఎయిర్ ఇండియాను వారి సొంత సంస్థల్లో విలీనం చేయరాదని, పాత సిబ్బందిని తొలగించరాదని ప్రభుత్వం విధించిన నిబంధనల పట్ల ప్రైవేటు సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నిబంధనలను సవరించి, గడువు పొడిగించినా కూడా బిడ్ వేసేందుకు ఏ సంస్థ సుముఖత చూపలేదు.

Comments

comments