Home ఎడిటోరియల్ వాయు కాలుష్య పడగనీడ

వాయు కాలుష్య పడగనీడ

Air-Polution

అక్టోబర్ 29వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రచురించిన నివేదిక “గాలి కాలుష్యం – పిల్లల ఆరోగ్యం” ప్రకారం 2016లో భారతదేశంలో 60,987 మంది ఐదేళ్ళ లోపు పిల్లలు గాలి కాలుష్యం వల్ల మరణించారు. వాయు కాలుష్యాన్ని లెక్కించే పి.ఎం.2.5 కాలుష్యం వల్లనే ఈ పిల్లలు మరణించారని నివేదిక తెలిపింది. పి.ఎం.2.5 అంటే గాలిలో 2.5 మైక్రాన్ల కన్న చిన్నవైన ధూళి, బొగ్గు, తదితర కాలుష్యాలు ఉండడం. లక్ష మంది పిల్లలకు 50.8 మంది పిల్లలు ఈ కాలుష్యం కాటుకు బలవుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఐదేళ్ళలోపు పిల్లలు ఎక్కువగా ఈ కాలుష్యం వల్ల ప్రాణాలు వదులుతున్నారని నివేదిక తెలియజేసింది. నైజీరియాలో ఈ కాలుష్యం వల్ల 2016లో మరణించిన పిల్లల సంఖ్య 47,674. అంటే ఇండియా కన్నా చాలా తక్కువ. నైజీరియా రెండవ స్థానంలో ఉంది. పాకిస్తాన్ మూడవ స్థానంలో ఉంది. పాకిస్తాన్‌లో మరణించిన పిల్లల సంఖ్య 21,136 మంది. నాల్గవ స్థానంలో డెమొక్రిటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉంది. అక్కడ మరణించిన పిల్లల సంఖ్య 12,890. చైనాలో కాలుష్యం వల్ల 2016లో మరణించిన ఐదేళ్ళలోపు పిల్లల సంఖ్య 6,645 మంది.

భారతదేశంలో ఐదేళ్ళలోపు పిల్లల్లో మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువగా మరణించారు. కాలుష్యం వల్ల 32,889 మంది ఆడపిల్లలు మరణిస్తే, 28,097 మంది మగపిల్లలు మరణించారు. అలాగే ఐదేళ్ల నుంచి పద్నాలుగేళ్ళ లోపు వయసు పిల్లల్లోను 2016లో 4,360 మంది భారతదేశంలో మరణించారు. అలాగే వివిధ కాలుష్యాల కారణంగా 2016లో ఇండియాలో మరణించిన పిల్లలు లక్షమంది ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ఎయిర్ పొల్యూషన్ అండ్ చైల్డ్ హెల్త్ నివేదికలో ఈ వివరాలు తెలియజేశారు.
భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరాదిలో వాయు కాలుష్యం ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. ఈ నెలలో సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ ప్రకారం 10 మైక్రాన్ల కన్నా తక్కువ కాలుష్యాలు గాలిలో 369 రికార్డయ్యాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన స్థాయి కన్నా ఏడు రెట్లు ఎక్కువ. అలాగే 2.5 మైక్రాన్ల కన్నా తక్కువ కాలుష్యాలు 168 రికార్డయ్యాయి. ఇది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన స్థాయి కన్నా ఏడురెట్లు ఎక్కువ. భారతదేశంలో ప్రజారోగ్యంపై కాలుష్యం ప్రభావానికి సంబంధించి నాలుగు అధ్యయనాలు జరిగాయి. 1991లో పెరినాటల్ మోర్టాలిటీ అధ్యయనం అంటే ప్రసవ సమయంలో శిశు మరణాలపై అధ్యయనం, 2009లో జరిగిన ఎడ్వర్స్ రిప్రొడక్టివ్ ఔట్ కం అధ్యయనం, 2010లో జరిగిన తక్కువ బరువుతో పిల్లల జననం, నిర్జీవ శిశు జననాల అధ్యయనం, 2013లో నిర్జీవ శిశు జననాలపై అధ్యయనం. ఈ నాలుగు అధ్యయనాల సమాచారాన్ని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణనలోకి తీసుకుంది.
భారతదేశంలో అనేక సంవత్సరాలుగా కాలుష్యం సమస్య నానాటికి పెరుగుతోంది. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరితమైన 20 నగరాల్లో 14 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వివరాలు ప్రకటించింది. ప్రపంచంలో వాయు కాలుష్యం వల్ల అత్యధిక మరణాలు, వ్యాధులు భారతదేశంలోనే ఉన్నాయి. వాయు కాలుష్యం, వాయు కాలుష్యం సంబంధిత వ్యాధుల వల్ల దాదాపు ఇరవై లక్షల మందికి అకాలమృత్యువు తప్పడం లేదు. ప్రపంచంలో వాయు కాలుష్యం వల్ల మరణిస్తున్న వారిలో 25 శాతం మనదేశంలోనే. ప్రపంచంలో పిల్లలపై వాయు కాలుష్యం ప్రభావాన్ని పరిశీలిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలోని పిల్లల్లో 90 శాతం మంది అంటే 180 కోట్ల మంది దాదాపు విషవాయువులనే పీలుస్తున్నారు.

ఈ పిల్లల్లో 2016లో దాదాపు ఆరు లక్షల మంది మరణించారని అంచనా. ముఖ్యంగా కాలుషిత గాలి వల్ల తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధికి గురై మరణించారు. పేద దేశాలలోను, మధ్యాదాయ దేశాల్లో ఐదేళ్ళలోపు పిల్లల్లో 98 శాతం మంది పిల్లలు ప్రమాదకరమైన 2.5 మైక్రాన్ల వాయు కాలుష్యానికి గురవుతున్నారు. ధనికదేశాల్లోను ఈ సమస్య ఉంది. అక్కడ పిల్లల్లో 52 శాతం మంది పిల్లలు ఈ వాయు కాలుష్యానికి గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో అన్ని విధాల కాలుష్యం గురించి ప్రస్తావించారు. ఇంటి బయట ఎదురయ్యే కాలుష్యం, ఇంటి లోపల ఉండే కాలుష్యాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. పేద, మధ్యాదాయ దేశాల్లో పిల్లలపై ఈ కాలుష్యం ప్రభావాన్ని అధ్యయనం చేశారు.
పిల్లలపై ఈ ప్రభావం పుట్టక ముందు నుంచి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే పడుతుంది. పుట్టిన తర్వాత ఈ కాలుష్యానికి మరింత గురవుతున్నారు. వాయు కాలుష్యం వల్ల గర్భవతులు నెలలు నిండక ముందే పిల్లలకు జన్మనివ్వడం జరుగుతుంది. శిశువు శ్వాస తీసుకోవడం పెద్దల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారిపై కాలుష్యం ప్రభావం మరీ ఎక్కువ. అంతేకాదు, పిల్లల ఎత్తు తక్కువ కాబట్టి కూడా కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువ. కాలుష్యాలు నేలకు దగ్గరగా ఎక్కువగా ఉంటాయి. పిల్లల శరీరం, మేధస్సు వికసించే దశలో ఉంటుంది. ఈ కాలుష్యాల ప్రభావం వల్ల వారి మేధోవికాసం, శారీరక పెరుగుదల దెబ్బతింటాయి. పిల్లలు ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పటికీ కాలుష్యం తప్పదు. ముఖ్యంగా పేద దేశాల్లో వంట చెరకును ఉపయోగిస్తున్నారు. కిరోసిన్ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఇంట్లో ఉన్నప్పటికీ పొయ్యి నుంచి వచ్చే కాలుష్యాలు తప్పడం లేదు. మరోవైపు గర్భవతులపై కాలుష్యం ప్రభావం వల్ల గర్భంలోని శిశువు ఎదుగుదల దెబ్బతింటోంది. తక్కువ బరువుతో జన్మించడం జరుగుతుంది. దీర్ఘకాలం వాయు కాలుష్యానికి గురైన పిల్లల్లో నాడీ మండల వికాసం దెబ్బ తింటుంది.

చురుకుదనం నష్టపోతారు. ఆస్తమా, క్యాన్సర్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. కాలుష్యాన్ని తట్టుకుంటూ పెరిగినప్పటికీ, పెద్దయిన తర్వాత గుండె వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ నివేదిక గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మారియా నీరా మాట్లాడుతూ వాయు కాలుష్యం పిల్లల మెదడు వికసించకుండా స్తంభించేలా చేస్తుందని అన్నారు. మనం ఊహించలేని విధంగా పిల్లల వికాసాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. అయితే ఈ కాలుష్యాన్ని నివారించే అనేక మార్గాలున్నాయని కూడా అన్నారు. గాలిలో కాలుష్యాన్ని తగ్గించడానికి వివిధ దేశాలు వెంటనే నడుం కట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది. వంట కోసం పొగను ఎగజిమ్మే వంటచెరకు వాడే బదులు ఇతర ఇంధనాలను ఉపయోగించాలి.

కాలుష్యాన్ని వెదజల్లే రవాణా పద్ధతులకు బదులు పర్యావరణానికి అనుకూలమైన రవాణా పద్ధతులు పాటించాలి. ఇండ్లలోను, నగర పాలన లోను ప్రణాళికాబద్ధంగా కాలుష్యాలను తగ్గించడానికి కృషి చేయాలి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తిలో పర్యావరణానికి ముప్పు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చెత్తను తగలబెట్టే అలవాటు వదులుకోవాలి. కలుషిత వాతావరణానికి పిల్లలను దూరంగా ఉంచాలి. స్కూళ్ళు, క్రీడామైదానాలు కాలుష్యానికి దూరంగా ఉండాలి. రోడ్ల పక్కన, ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంటుల పక్కన స్కూళ్ళ ఉండరాదు. పిల్లల ముందు పూర్తి జీవితం ఉంటుంది. కాలుష్యానికి గురైన పిల్లల్లో తర్వాత ఈ కాలుష్యాల ప్రభావం జీవితాంతం వెంటాడే వ్యాధులుగా పీడించవచ్చు. కాలుష్యానికి గురైన పిల్లలకు వ్యాధుల జీవిత శిక్ష విధించినట్లే అవుతుంది. మన పిల్లలను ఈ శిక్ష నుంచి కాపాడుకోవాలి.

Air Pollution and Childrens Health

Telangana News